వైసీపీ వర్సెస్ టీడీపీ.. గెలుపు ఎవరిదో!

మొత్తానికి గ్రాడ్యుయేట్ల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు అధికార పార్టీ ఈ ఎన్నికల విషయంలో తాము బలపరుస్తున్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తున్నాయి. 

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస గోపాల్ రెడ్డి పేరును ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పరిధికి ఈయన పోటీ చేస్తున్నాడు. మామూలుగా అయితే గ్రాడ్యుయేట్ల, టీచర్ల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీలు దూరదూరంగానే ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీల వారూ, యూనియన్ల నేతలు.. ఇలాంటి ఎన్నికల్లో పోటీ చేసి విజయాలు సాధిస్తూ ఉంటారు. 

అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా ఈ ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికో ప్రకటించాయి. ఈ పార్టీల మద్దతు ఉన్న వారితో పాటు యూనియన్ల నేపథ్యం నుంచి వచ్చిన వారు కూడా ఈ ఎన్నికల్లో యథాతథంగా పోటీ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

కానీ.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల జనాల్లో ఆసక్తి కొంచెం తక్కువే. లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నా.. ఈ ఎన్నికల్లో ఓటేయడానికి పేరు నమోదు చేయించుకునే.. వాళ్లు చాలా చాలా తక్కువమంది. చాలామంది గ్రాడ్యుయేట్లకు ఈ ఎన్నికల మీద అవగాహనే లేదు. ఉన్న వారు పెద్దగా పట్టించుకోరు. మరి ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను అధికారికంగానే ప్రకటించేసుకుంటున్న తరుణంలో అయినా.. ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి పేర్లను నమోదు చేసుకునే వారి శాతం పెరుగుతుందేమో చూడాలి!

Show comments