లోకేష్ దందా.. సెక్రటేరియట్ నుంచి సినిమాహాల్ వరకూ!

ఇందుగలడు అందు లేడనేందుకు లేదన్నట్టుగా.. తెలుగుదేశం అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఎందెందు వెదికినా అందందు కనిపిస్తూ ఉన్నాడు! ఆయన దందాలు లేని చోటు కనిపెట్టడం చాలా కష్టంగా మారింది. ప్రతి వ్యవహారంలోనూ లోకేష్ దందా ఉండనే ఉంటుందన్నట్టుగా మారింది పరిస్థితి. సెక్రటేరియట్ తో మొదలుపెడితే.. సినిమా థియేటర్ల వరకూ లోకేష్ వ్యవహారాలు రచ్చకు ఎక్కుతున్నాయి!

ఇప్పటికే ఏపీలో ‘లోకేష్ ట్యాక్స్’ చలామణీ అవుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. లోకేష్ పై ఇంకా అనేక ఆరోపణలున్నాయి. వెనుకటికి సీఎంల తనయుళ్లు, మనవళ్లు చాలా దందాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే వారందరి కన్నా లోకేష్ చాలా మించిపోయాడు. ఆఖరికి సచివాలయంలో తన షాడో టీమ్ ను ఏర్పాటు చేసుకునేంత వరకూ వెళ్లాడు లోకేష్.

ఈ పరంపరలో ఇప్పుడు సినీ దందాలో కూడా లోకేష్ వేలు పెడుతున్నాడనే మాట వినిపిస్తోంది.  మల్టీప్లెక్స్ యజమానులకు, సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మధ్య తలెత్తిన వివాదాల్లో లోకేష్ మల్టీప్లెక్స్ యజమానుల వైపున నిలిచి.. డిస్ట్రిబ్యూటర్లను తన అనుచరుల చేత బెదిరింప చేస్తున్నాడనేది ఆరోపణ. టికెట్ల ద్వారా వచ్చే మొత్తంలో పంపకాల గురించి ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదంలో లోకేష్ మల్టీప్లెక్స్ యజమానుల వైపున నిలిచి.. డిస్ట్రిబ్యూటర్లను బెదిరిస్తున్నాడట!

సినిమాల ప్రదర్శనసమయంలో.. వచ్చే డబ్బులో 55 నుంచి 60 శాతం మొత్తం తమకు ఇవ్వాలనేది డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్. అయితే  అందుకు మల్టీప్లెక్స్ ఓనర్లు ఒప్పుకోవడం లేదు. 50 శాతానికి మించి ఇచ్చేది లేదంటున్నారు. ఈ విషయంలో తెలంగాణలోస్పష్టమైన విధానం అమల్లో ఉంది. తొలి వారంలో 55శాతం డిస్ట్రిబ్యూటర్లు తీసుకొంటుండగా.. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.  Readmore!

ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ లలో అసలు తమ సినిమాలు విడుదల చేయకూడదని డిస్ట్రిబ్యూటర్లు ఉమ్మడిగా నిర్ణయించుకున్నారు. దీంతో మల్టీప్లెక్స్ ఓనర్లలో గాబరా మొదలైంది. రిలీజ్ లు లేకపోతే మల్టీప్లెక్స్ లోకి వెళ్లేదెవరు? దీంతో.. వాళ్లు చినబాబును ఆశ్రయించారట. వీరి వైపున నిలుస్తూ.. 50 శాతం వసూళ్ల సొమ్మును తీసుకుని.. మల్టీప్లెక్స్ లకు సినిమాలు ఇవ్వాలంటూ డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పనిలో చినబాబు అనుచరులు బిజీగా ఉన్నారట!

మరి ఈ వివాదంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని కలిగి ఉంది. ఏపీలో మాత్రం అలాంటి విధానాన్ని ఖరారు చేయక.. ఇలా చినబాబు ఆదేశాలకు, బెదరింపులకు అనుగుణంగా వ్యవహారాన్ని సెటిల్ చేసే యత్నాలు జరగుతుండటం గమనార్హం. 

Show comments