సర్వే లోగుట్టు సర్వేశ్వరుడికి ఎరుక

ఇది ఇవ్వాళ, నిన్నటి వ్యవహారం కాదు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి, పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర వహించడం ప్రారంభించినప్పుడే మొదలైంది. కార్యకర్తలను, నాయకులను క్షణంగా ఖాళీగా వుంచకుండా, ప్రశ్నపత్రాలు పంపించి, వేలాదిగా జిరాక్స్ లు తీయించి, ప్రజాభిప్రాయ సేకరణ చేయించడం అప్పట్లోనే ప్రారంభమైంది. అది ఇప్పటికే అలవాటుగా కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఓ అభిప్రాయ సేకరణ చేయించారు. గతంలో చేసింది మంత్రులపై. ఇప్పుడు చేసింది ఎమ్మెల్యేలపై. అదేంటో ఎప్పుడు బాబు అభిప్రాయ సేకరణ చేసినా, జనాలు భలే విలక్షణమైన అభిప్రాయం చెబుతారు. 

బాబు సూపర్..ఆయన పాలన సూపర్..కానీ ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు వున్నారే..వాళ్లు మాత్రం అందరూ సూపర్ కాదు. ఇదేంటో మరి? అంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సూపర్ కాదంటే, మరి ప్రభుత్వం సూపర్ ఎలా అయిందో? సరే, బాబు ఒక్కరి వల్లే ప్రభుత్వం సూపర్ అయింది అనుకుంటే మరి వీరంతా ఎందుకు? అంతే కాదు,  చంద్రబాబు మాదిరిగానే ఈ సర్వేలు ఏమిటో, ఎలా జరిగాయో పైకి అస్సలు తెలియదు. కానీ అవసరం అయినపుడు మాత్రం పలితారు పత్రికల్లో వచ్చేస్తాయి. నిజానికి ఇప్పటికే ఓసారి బాబు  మంత్రులకు ర్యాంకులు ప్రకటించి ఓసారి కంగుతిన్నారు. మంత్రుల్లో నిరసన, అసహనం కూడా వ్యక్తమయింది. 

ప్రజల్లో తమ పరువును తీసారు అని నేరుగా బాబుతో కాకున్నా ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. ఇదే ఇంకా చల్లారలేదు, మరో పరీక్షా ఫలితాలు వెల్లడించారు. ఈ సారి టోటల్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై పరీక్ష నిర్వహించారట. చిత్రమేమిటంటే బాబు కోటలోని సగానికిపైగా ఎమ్మెల్యేలు ఫెయిలయ్యారు. కాని బాబు మాత్రం 80శాతం మార్కులతో మెరిట్ సాధించారు. 10మంది ఎమ్మెల్యేల పనితీరు పూర్తిగా అధ్వాన్నంగా ఉందట. మరో 30 మంది ఎమ్మెల్యేల తీరు బాగాలేదట. అంటే 40 మంది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రజల కోసం పనిచేయడం లేదు, వారిపట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. 

అంటే  సగానికి పైగా నియోజకవర్గాల్లో ప్రజల అవసరాలు తీరలేదన్నట్టే దీని అర్థం. అలాంటప్పుడు ఓవరాల్ గా ఫలితం కూడా అలాగే ఉండాలి. కాని రాష్ట్ర వ్యాప్తంగా రిజల్ట్ విషయానికి వస్తే బాబు పాలనకు 80శాతం మార్కులు పడ్డాయి. టీమ్ అంతా ఫెయిల్ అయినా కెప్టెన్ ఒక్కడే గెలిపించారన్నమాట.  నిజం ఏంటన్నది కాసేపు పక్కన బెడతాం. ఇదంతా చేయడంలో బాబు అంతరంగమేమిటి, ఎందుకిలా చేస్తున్నారు, దీని వల్ల వారి బండారం వారే బయటపెట్టుకున్నట్లు కాదా అన్న సందేహాలయితే కలుగుతాయి. 

బాబు జపం చేసే వారి అభిప్రాయం మేరకు ఇదంతా పార్టీ బాగు కోసం, ప్రజల మేలు కోసమని అంటున్నారు. పని తీరు, ప్రజల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి తెలిస్తే వారు జాగ్రత్త పడి సర్దుకుపోతారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. వారి అవసరాల మేర పనులు చేస్తారు. దీని వల్ల సదరు ప్రజాప్రతినిధులు బాగుపడతారు, పార్టీ బాగుపడుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అన్నది వారి ఉవాచ. దీనిని తప్పని ఎవరు అనలేరు, ఇదేదో లోలోపల పార్టీ పరంగా అంతర్గత సమావేశం పెట్టి పరీక్ష ఫలితాలు వెల్లడించినా సరిపోతుంది కదా అన్నది బాబు వైఖరికి మనస్థాపం చెందిన వారు అంటున్న మాట. 

ఈ రెండు వాదనల మాటెలా ఉన్నా.. అసలుసిసలైన వాదన పార్టీలో కొంత మేర, బయట మెజార్టీ శాతం వారు చేస్తున్నారు. ఇప్పుడు వైకాపా నుంచి ఎమ్మెల్యేలందరిని తీసుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన రాబోయే ఎన్నికలలోపు అయ్యే అవకాశాలు లేవు. అలాంటప్పుడు వచ్చిన ప్రతి వారికి వారి సీటు గ్యారంటీ. మరి కొందరు ముఖ్యులకు ఏదో ఓ చోట సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడున్న వారిని ఎన్నికల సమయంలో హటాత్తుగా కాదంటే తిరుగుబాటు కంపల్సరి. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్నది  ఈ వాదనలోని సారాంశం. 

దీనిని కాదనలేం, ఇప్పటి నుంచే వేటు వేయాలనుకున్న వారిని ఇలా పరీక్షల పేరుతో ఫెయిల్ చేసి దానిని ప్రజల ముందుంచింతే ప్రజల్లో కూడా వారి పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. దీంతో ఎన్నికల వేల టికెట్ ఈయకున్నా వీరు రెబల్ గా పోటీచేయడానికి సాహసించకపోవచ్చు. ఒక వేల చేసినా బాబు ఇప్పటి నుంచి చేస్తున్న ప్రచారం మేరకు వారు గెలిచి ఏం చేశారని, ఇప్పుడు గెలిపిస్తే ఏంచేస్తారని కూడా ప్రజల్లో భావం నిండుకుని వారివల్ల పెద్ద ముప్పు ఉండదన్న ఆలోచన కూడా బాబు మెదలో మెదిలి ఇలా చేస్తున్నారంటున్నారు. సరే ఎవరి మతలబులు వారికున్నాయి. టోటల్ ఫలితం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి మరో మూడేళ్లు ఓపిక పట్టాల్సిందే.

Show comments