మసిగుడ్డ కాల్చి మొహాన వేసేశాడు

ఆయన మసిగుడ్డ కాల్చి మొహానవేసేశాడు. అంటే.. తాను చేయదలచుకున్న ఆరోపణలు చేసేసి, నిందలు వేసేశాడు. ఇక ఇవతలివాళ్లే.. దాన్ని శుభ్రం చేసుకుని తమ మంచితనాన్ని నిరూపించుకోవాలి.

ఇదంతా దేన్ని గురించా అనుకుంటున్నారా? రెండు తెలుగు రాష్ట్రాలను, ప్రధానంగా హైదరాబాదు నగరాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం గురించే! ఈ డ్రగ్స్ రాకెట్ లు పరిధిమించి చెలరేగిపోతుండడంలో కొందరు పోలీసు అధికారులకు కూడా పాత్ర ఉన్నదని ఏపీ డీజీపీ సాంబశివరావు చేసిన కామెంట్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. ఎక్కువ భాగం డ్రగ్స్ వ్యవహారం హైదరాబాదు కేంద్రంగానే నడుస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హైదరాబాదు ఎక్సయిజ్ పోలీసులకు షాక్ లాగా తయారయ్యాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారోనని వారు మధన పడిపోతున్నారు. 

ఒకవైపు పోలీసుల విచారణ తీరు గురించి, సినిమా పరిశ్రమ మీద ఎక్స్ ట్రా ఫోకస్ పెట్టడం గురించి, దర్శకుడు రాంగోపాల్ వర్మ కామెంట్లు చేయగానే.. మాజీ ఎక్సయిజ్ అధికార్లు రంగంలోకి వచ్చారు. వర్మ మీద పోలీసు కేసు పెడతాం అని.. ఆయన ఖచ్చితంగా అరెస్టు అవుతారని వారు అంటున్నారు. వర్మ మాటలు.. పోలీసుల విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని అంటున్నారు. అయితే అదే సమయంలో ఎక్సయిజ్, పోలీసు శాఖలోని కొందరు అధికార్ల గురించి సాక్షాత్తూ ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఇంకా తీవ్రమైనవి. పోలీసు అధికార్లే డ్రగ్ దందాలకు సహకరిస్తున్నారని అర్థం వచ్చేలా ఆయన చెప్పారు. 

డీజీపీ చెప్పిన కోణంలో చూసినప్పుడు బయటపడుతున్న కీలక నేరాల విషయంలో ఎంతో కొంత పోలీసు పాత్ర కూడా బయటపడుతోంది. ఇదివరకటి రోజుల్లో ఎలా ఉండేదో కానీ.. ఇప్పుడు మారుతున్న ఆధునిక యుగపు టెక్నాలజీ పోకడల్లో ఏదీ దాగడం లేదు. మొన్నటికి మొన్న నయీమ్ ఎన్ కౌంటర్ కాగానే.. అతనితో దందాలు, నేరాలు చేయించిన వారిలో, అనంతరం అతనికి దన్నుగా ఉండి కాపాడిన వాళ్లలో పోలీసు అధికార్లు పలువురు ఉన్నారనే పుకార్లు వచ్చాయి.

ఇప్పుడు డ్రగ్ దందాలకు సహకరిస్తున్నారంటూ డీజీపీ చెప్పిన మాటలు కూడా అలాంటివే. మరి వర్మ మాటలపై అత సీరియస్ అయిపోయిన ఎక్సయిజ్ అధికార్లు, ఇలాంటి విమర్శల పట్ల ఎలా స్పందిస్తారు. ఏ పోలీసు అధికారికీ ఏ చిన్న సమాచారమూ లేకుండానే భాగ్య నగరంలో ఇంత పెద్ద సంఖ్యలో పబ్ లు, బార్లు డ్రగ్స్ ను విక్రయిస్తుండడం ఆచరణ సాధ్యమేనా? లేదా, ఎవరి వాటాలు వారికి ముడుతున్నాయి గనుక.. దొరికే వరకూ దొర అనుకునే చందంగా మిన్నకుండిపోతున్నారా? అని ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి డీజీపీ చేసిన వ్యాఖ్యలు.. డ్రగ్ వ్యవహారంలో ప్రజల ఆలోచనల్ని సమూలంగా మరో వైపుకు మళ్లించాయని అనుకోవచ్చు. 

Show comments