ముద్రగడ పాదయాత్రపై ఉక్కుపాదం!

కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఈనెల 26వ తేదీ నుండి ఛలో అమరావతి పేరుతో చేపట్టనున్న పాదయాత్రపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు పోలీసు యంత్రాంగం ముద్రగడ వ్యూహానికి, ప్రతివ్యూహ రచన చేస్తోంది. పాదయాత్రకు పిలుపునిచ్చి ప్రభుత్వంలో దుమారం రేపిన ముద్రగడ పాదయాత్రకై అడుగు ముందుకేసే అవకాశం ఇవ్వకుండా, అరెస్ట్‌ అస్త్రాన్ని ప్రయోగించే దిశగా పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది.

పాదయాత్ర రోజు వరకు వేచిచూడకుండా అంతకు ఒకటి, రెండురోజుల ముందుగానే ముద్రగడను హౌస్‌అరెస్ట్‌ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఉద్యమాల తేదీలను ముందుగానే వెల్లడించి, ముహూర్తం ప్రకారం ముందుకెళ్ళే సమయంలో ముద్రగడను పోలీసులు గృహ నిర్భందం చేసిన సందర్భాలు గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన్ను గృహ నిర్భంధంలో ఉంచే అవకాశాలున్నట్టు భోగట్టా! కాపు జేఏసీ నేతలను కూడా ఆయా జిల్లాల్లో ఎక్కడికక్కడే గృహనిర్భంధం చేసే అవకాశాలున్నాయి.

ముద్రగడ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, కిర్లంపూడిలో మళ్ళీ పోలీసు బలగాలను మొహరించేందుకు ప్రభుత్వంరంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో చెక్‌పోస్ట్‌లు, తనికీలు, అరెస్ట్‌ల వంటివి పునరావృతం కాతప్పదని స్పష్టమవుతోంది. ఇదిలావుంటే చట్ట ప్రకారం పాదయాత్రకు అనుమతి తీసుకోవల్సిందేనని జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ముద్రగడను హెచ్చరించారు. పాదయాత్రకు అనుమతి లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టంచేశారు.

దీనిపై ముద్రగడ కూడా తగిన రీతిలో సమాధానం చెప్పారు. తాను ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వాన్ని అనుమతి కోరేది లేదని చెబుతున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలకు ఎవరి అనుమతి తీసుకున్నారో చెప్పాలని ముద్రగడ డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ పాదయాత్ర చేసి తీరుతామని, రిజర్వేషన్ల కోసం సాగించే తమ పోరాటంలో ఇదే చివరి పోరాటమని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు.

పాదయాత్రకు ఓవైపు సన్నాహాలు జరుగుతుండగా, ఇదే సమయంలో తునిహింసకు సంబంధించిన కేసుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తున్నట్టు స్పష్టమవుతోంది. తుని దుర్ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో నిందితుల అరెస్ట్‌లకు రంగం సిద్ధమవుతోందా? అన్న ప్రచారం ఆయావర్గాల్లో జరుగుతోంది. ఇదిలావుండగా పాదయాత్ర తేదీ దగ్గరపడే కొద్ది సంబంధిత వర్గాలలో టెన్షన్‌ పెరుగుతోంది.

ఈనెల 26వ తేదీన ఛలో అమరావతి పాదయాత్రను కిర్లంపూడిలో ప్రారంభిస్తారు. 4జిల్లాల పరిధిలో 116 గ్రామాల మీదుగా యాత్ర సాగుతుంది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి రాజధాని అమరావతి వరకు సాగేయాత్రలో పెద్దఎత్తున కాపు సోదరులు పాల్గొనాలని, యాత్ర ప్రారంభం రోజైన 26వ తేదీన కిర్లంపూడికి తరలిరావాలని కోరారు. ఆరోజు కిర్లంపూడిలో యాత్రను ప్రారంభించి, రాజుపాలెం మీదుగా పాదయాత్ర సాగిస్తారు.

తూర్పుగోదావరి జిల్లాలోని వీరవరం, రామచంద్రపురం, గోనాడ, రామవరం, నీలాద్రిరావుపేట, తాళ్ళూరు, మల్లేపల్లి, గండేపల్లి, మురారి, రాజానగరం, చక్రదార బంధం, రాధయ్యపాలెం, శ్రీకృష్ణపట్నం, భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, శాటిలైట్‌ సిటీ, జిఆర్‌కె గార్డెన్‌, మోరంపూడి, కోటిపల్లి బస్టాండ్‌లో పాదయాత్ర సాగిస్తారు. రోడ్‌ కం రైలు వంతెన మీదుగా కొవ్వూరు చేరుకుని, అక్కడి నుండి పశ్చిమగోదావరి జిల్లాలో అడుగిడతారు.

నిరవధిక పాదయాత్రలో భాగంగా గుంటూరుజిల్లా చేరుకుని వెలగపూడి (అమరావతి) వరకు పాదయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ముద్రగడ పాదయాత్ర ప్రారంభించే రోజు వరకు వేచిచూడకుండా ముందస్తు అరెస్ట్‌లకే పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా జిల్లాల పోలీస్‌స్టేషన్ల పరిధిలో కాపునేతలకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

పాదయాత్రలో పాల్గొని కేసుల్లో ఇరుక్కోవద్దంటూ హెచ్చరిస్తున్నారు. కాపు జేఏసీ నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముద్రగడ అరెస్ట్‌ కంటే ముందుగానే కొందరు కీలక నేతలను ముందస్తు అరెస్ట్‌లని నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది.

Show comments