'పవర్‌' భక్తుడు మళ్ళీ వచ్చేశాడు.!

పవన్‌కళ్యాణ్‌కి అరివీరభయంకరమైన భక్తుడొకరున్నాడు. అతనెవరో కాదు, ఒకప్పటి కమెడియన్‌, ఇప్పటి నిర్మాత.. బండ్ల గణేష్‌. పవర్‌స్టార్‌ పేరు చెబితే చాలు, బండ్ల గణేష్‌లో వైబ్రేషన్స్‌ ప్రారంభమయిపోతాయి. పవన్‌కళ్యాణ్‌ గురించి మాట్లాడాల్సి వస్తే తన మీద తానే అదుపు కోల్పోతాడు. అలాంటి బండ్ల గణేష్‌ గత కొంతకాలంగా సైలెంటయ్యాడు. అనూహ్యంగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ అయిపోయినట్లే, అనూహ్యంగా సైలెంటయిపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 

ఎలాగైతేనేం, బండ్ల గణేష్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఓ దర్శకుడి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన దేవుడైన పవన్‌కళ్యాణ్‌ మీద పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఇంకో హీరోకి సారీ చెప్పాడు, మరో హీరోతో విభేదాలపై క్లారిటీ ఇచ్చాడు. అన్నట్టు, ఓ హీరోకి తన బలం గురించి చెబుతూ, వార్నింగ్‌ కూడా ఇచ్చేశాడండోయ్‌. 

ఇక, తన దేవుడు పవన్‌కళ్యాణ్‌, ముఖ్యమంత్రి అవడం ఖాయమంటూ బండ్ల గణేష్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. అసలు తాను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదనీ, ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడవనీ, రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలన్నదే తన ఉద్దేశ్యమనీ నిన్నటికి నిన్న పవన్‌కళ్యాణ్‌ తాజాగా క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే. నిజానికి పవన్‌కళ్యాణ్‌కి, ఎన్నికల్లో పోటీ చెయ్యాలన్న ఆలోచనా లేదు, అంత ధైర్యమూ ఆయనకి లేదు. మరెలా ముఖ్యమంత్రి అవుతారట.? 

ఏమోగానీ, బండ్ల గణేష్‌కి మాత్రం తన దేవుడు పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతాడనే గట్టి నమ్మకం వుంది. ఎవరి నమ్మకం వాళ్ళది.! భక్తుడు కదా, ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలా.?

Show comments