సారీ...ఇది స్టేట్ లెవెల్ న్యూస్ కాదు

ఒకప్పుడు డైలీ పేపర్లకు మెయిన్ ఎడిషన్ ఒక్కటే వుండేది. అందువల్ల అన్ని వార్తలు అన్ని ప్రాంతాలకు తెలిసేవి. ఇప్పుడు పెద్ద పేపర్, చిన్న పేపర్ అంటూ రెండు పుట్టుకువచ్చాయి. అందువల్ల లోకల్ న్యూస్ లోకల్ కే పరిమితం అయింది. ఇదెక్కడి లాజిక్ నో అర్థం కాదు కానీ, ఏ ఊరి వార్త ఆ ఊరి వాళ్లకు ఎలా గూ తెలుస్తుంది. తెలియాల్సింది పక్క ఊరి వాళ్లకే. కానీ మన పత్రికలు ఎవరి వార్తలు వారికే అందిస్తూ, పక్కింట్లో ఏం జరుగుతోందో, ఆ పక్కవారికి తెలియకుండా జాగ్రత్త చేస్తున్నాయి. 

సరే, ఇదంతా చాలా డిస్కషన్ చేసే విషయం. దాన్ని పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, ఏ జిల్లాకు ఆ జిల్లా వార్తలు యథాప్రకారం ఇచ్చేస్తూ, మెయిన్ ఎడిషన్ ను మాత్రం పదికాలాల పాటు ‘పచ్చ’ గా వుండేలా చూసుకుంటున్నారు.  తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే వార్తలను, నిధుల లేమి, అభివృధ్ధి అడుగంటడం, లోకల్ కుంభకోణాలు ఇవన్నీ పొరపాటున మెయిన్ ఎడిషన్ కు తీసుకురావడం లేదు. ఇలాంటిదే ఈరోజు అమరావతి ఎడిషన్లలో వచ్చిన వార్త ఇది.

కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అధికార పార్టీ నేతలు వేల కోట్లకు పడగలెత్తారట. ఆ రెండు జిల్లాల్లో కాల్ మనీ, ఇసుక, రియల్ ఎస్టేట్, ఇతరత్రా దందాలు అన్నింటి ద్వారా వేల కోట్లు ఆర్జించేసారట ఎందరో నాయకులు. వీరందరూ పైసా ఆదాయ పన్ను చెల్లించలేదట. దాంతో వీళ్లందరి బాగోతాలు సేకరించి, ఆదాయపన్ను శాఖ దాడులు చేయాలనే ఆలోచనలో వుందట. 

గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో వంద కోట్ల వెంచర్ వున్న అధికారపార్టీ నాయకుడు బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తూ వేల కోట్లు ఆర్జించారట. తరచు వివాదాలకు కేంద్రంగా మారే అధికారపార్టీ నాయకుడు  ఒకరు కూడా బెంగుళూరులో వందల కోట్ల ఆస్తుల కూడ బెట్టారట.

డెల్టా ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు తమ తమ బినామీల దగ్గర, వ్యాపార భాగస్వాముల దగ్గర వందల కోట్లు దాచి వుంచారట. డెల్టా ప్రాంతానికి చెందిన ఒక అధికార పార్టీ నేత ఇసుక వ్యాపారంలో కోట్లకు కోట్లు ఆర్జించారట.  విజయవాడ నగరానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ నాయకులు మద్యం సిండికేట్, కాల్ మనీలో వందల కోట్లు ఆర్జించారట. అధికార పార్టీ నాయకుడు ఒకరు బిల్డర్లను బెదిరించి బినామీల పేర్లతో ప్లాట్లు రాయించుకుని కోట్లకుకోట్లు ఆర్జించారట. అలాగే ఇంకో కృష్ణా జిల్లా నేత ఒకరు ఇసుక, మద్యం వ్యాపారులను బెదిరించి కోట్లకు కోట్లు మూమూళ్లు వసూలు చేసారట

ఇక ఇద్దరు వైకాపా నేతలు, ఒక కాంగ్రెస్ నేత కూడా యథాశక్తి సంపాదించారట. ఇప్పుడు వీళ్లంతా ఆదాయపన్ను శాఖ ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడిపోతున్నారట. ఇదీ వార్త,.

ఒక జిల్లా, అది కూడా ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం కీలకంగా వున్న జిల్లా, లక్షల కోట్ల రాజధాని తయారవుతున్న జిల్లా. అలాంటి జిల్లాలో ఇలాంటి వేల కోట్ల అక్రమ ఆర్జనలు వుంటే, అది జస్ట్ లోకల్ వార్త..మెయిన్ ఎడిషన్ వార్త కానే కాదు. అనవసరంగా ఇతర జిల్లాల వారు చదివి తెలుసుకుని, అధికారపార్టీ జనాలు ఎలా వేల కోట్లు వెనకేసుకుంటున్నారో అన్నది మిగిలిన ప్రాంతాల వారికి కూడా ఎక్కడ తెలిసిపోతుందనో భయం.

అందుకే అధికారపార్టీని బద్ నామ్ చేసేవి, ఇరుకున పెట్టేవీ ఏవీ మెయిన్ ఎడిషన్ వార్తలు కావు.

Show comments