మోడీజీ.. లక్షల కోట్లు ఏమైపోతున్నాయ్‌

తెలంగాణకి లక్షన్నర కోట్లు.. ఆంధ్రప్రదేశ్‌కి రెండున్నర లక్షల కోట్లు.. ఇదీ కేంద్రం చెబుతున్న లెక్క. సాక్షాత్తూ కేంద్ర మంత్రులే ఈ లెక్కలు చెబుతోంటే, నిజంగానే ఆ లెక్కలకు తగ్గట్టుగా తెలుగు రాష్ట్రాలకి దక్కాయనే అనుకోవాల్సి వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారంటే, ఆ ప్రకటనకి చట్టబద్ధత వున్నట్లేనని అప్పట్లో బీజేపీ నేతలు చెప్పుకున్నారు.

నిజమే, జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రులు, రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర మంత్రులు ఏ ప్రకటన చేసినా, దానికి చట్టబద్ధత వున్నట్లుగానే పరిగణించాలి. అయితే, అది 'నైతికత' కోణంలో మాత్రమే వర్తిస్తుంది. కానీ, రాజకీయాల్లో నైతికతకి విలువెక్కడ.? ఛాన్సే లేదు.

రాజ్యసభ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ప్రకటిస్తే, దానికి చట్టబద్ధత లేదంటూ లైట్‌ తీసుకున్న బీజేపీ, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాక కేంద్ర మంత్రులు మాటలు చెబితే చాలు, ఆ మాటలకు చట్టబద్ధత వున్నట్లే చెబుతున్నాయి. రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో, అలా దిగజారుడు రాజకీయాలు చేయడంలో బీజేపీ ఇంకెంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

పార్లమెంటుకి తొలిసారి ఎంపికవుతూనే, ప్రధానమంత్రి అయ్యారు నరేంద్రమోడీ. ఇంతటి ఘనతను సొంతం చేసుకున్న నరేంద్రమోడీ, పార్లమెంటులో అడుగు పెడుతూనే, తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంటు పట్ల అపారమైన గౌరవ మర్యాదలు తనకున్నాయనీ, పార్లమెంటుని దేవాలయంగా భావిస్తానంటూ 'నేలను' ముద్దాడారు.

మరి, అదే పార్లమెంటులో ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నరేంద్రమోడీ ఎందుకు తుంగలో తొక్కినట్లు.? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకి సంబంధించిన విషయమే కాదు, చట్ట సభల పట్ల రాజకీయ నాయకులకి, ముఖ్యంగా అధికారంలో వున్నవారికి ఎంత గౌరవం వుందో ఈ ఒక్క సందర్భం ఓ సాక్ష్యంగా మాత్రమే కన్పిస్తుంది.

ప్రత్యేక హోదాపై చర్చలు జరుగుతున్నాయని ఓ సారి, ఆ ప్రత్యేక హోదాకి ఆస్కారమే లేదని ఇంకోసారి.. పార్లమెంటు సాక్షిగా బీజేపీ సర్కార్‌ ఎన్నిసార్లు 'రెండు నాల్కల' ధోరణి ప్రదర్శించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేక హోదా సంగతలా వుంటే, ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ అదే 'మాయ' ప్రదర్శిస్తోంది నరేంద్రమోడీ సర్కార్‌.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. రెండూ కొత్త రాష్ట్రాలే. అభివృద్ధి చెందిన రాజధాని హైద్రాబాద్‌ కారణంగానే తెలంగాణ కొంతమేర సమస్యల సుడిగుండం నుంచి తప్పించుకోగలిగింది. అలాగని, తెలంగాణలో సమస్యలు లేవని కాదు. తెలంగాణలో హైద్రాబాద్‌ తప్ప, మరో నగరం ఆ స్థాయిలో అభివృద్ధి చెంది లేదు. నిజానికి, తెలంగాణలో అన్ని జిల్లాలూ అభివృద్ధికి దూరంగానే వున్నాయి ఒక్క 'హైటెక్‌ నగరం' హైద్రాబాద్‌ తప్ప.

ఇక, ఆంధ్రప్రదేశ్‌ దుస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రెండు రాష్ట్రాలుగా ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం వేరుపడి మూడేళ్ళయిపోయింది. ప్రదానిగా నరేంద్రమోడీ గద్దెనెక్కి కూడా మూడేళ్ళు పూర్తయిపోయాయి. కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటిదాకా 'ఉమ్మడి సమస్యలు' అలాగే వున్నాయి.

రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల మధ్య వివాదం, అధికారుల మధ్య వివాదం.. ఒకటేమిటి, చెప్పుకుంటూ పోతే వివాదాల సుడిగుండంలో తెలుగు రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయన్నది నిర్వివాదాంశం. కానీ, కేంద్రం జోక్యం చేసుకోదుగాక చేసుకోదు. వివాదాల పరిష్కారం సంగతి పక్కన పడేసి, తెలుగు రాష్ట్రాలకు లక్షల కోట్లు కేటాయించేశామంటూ నరేంద్రమోడీ సర్కార్‌ గొప్పగా చెప్పుకుంటోంది.

దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి.. అన్ని రాష్ట్రాలకీ నిధుల కేటాయింపు జరుగుతోంది. కొత్తగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి అదనంగా కేంద్రం చేస్తున్న సహాయం ఏమైనా వుందా.? అన్న ప్రశ్నకు మాత్రం నరేంద్రమోడీ సర్కార్‌ దగ్గర సమాధానమే దొరకదు. కానీ, లక్షల కోట్లు కేటాయించేశాం.. అంటూ 'పాడిందే పాటరా పాచిపళ్ళ దాసుడా..' అన్న చందాన అరిగిపోయిన రికార్డ్‌ని ప్లే చేయడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది.

జాతీయ రహదార్లకు సంబంధించిన ప్రాజెక్టులు, జాతీయ విద్యా సంస్థలు.. ఇవన్నీ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకూ దక్కేవే. ఇందులో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై నరేంద్రమోడీ చూపించిన 'స్పెషల్‌ ఇంట్రెస్ట్‌' ఏంటి.? అన్నది బీజేపీ నేతలకే తెలియాలి.

కేంద్రం ప్రకటించిన నిథులు తెలుగు రాష్ట్రాలకు దక్కాయన్న కేంద్ర మంత్రుల మాటలు నిజమైతే, తెలుగు రాష్ట్రాల స్థాయిలో విపరీతమైన అవినీతి జరిగివుండాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్న లెక్కలు నిజమైతే, తెలుగు రాష్ట్రాల పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ కనీ వినీ ఎరుగని రీతిలో అవినీతికి పాల్పడి వుండాలి. లేకపోతే, లక్షల కోట్లు ఏమైపోతాయ్‌.? మోడీజీ, ఈ ప్రశ్నకు బదులేది.?

Show comments