కుట్ర కోణం: కొత్త కథ కాదు కదా.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలోని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లో వర్షపు నీరు కలకలం రేపిన విషయం విదితమే.

అతి తక్కువ కాలంలో అత్యంత భారీగా ఖర్చు చేసి నిర్మించిన నిర్మాణాల్లోని 'డొల్లతనం'పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, 'నాణ్యతాలోపం' అన్న విమర్శని తట్టుకోలేకపోతోంది అధికార తెలుగుదేశం పార్టీ.

ఇంతకీ, వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి వర్షపు నీరు ఎలా వచ్చింది.? ఈ ప్రశ్న చుట్టూ ప్రతిపక్షం వైఎస్సార్సీపీ అనేక అనుమానాల్ని వ్యక్తం చేసింది. అంతే, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రంగంలోకి దిగారు. సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రాథమికంగా ఈ ఘటనకు కారణం, పైప్‌ లైన్‌ని ఎవరో కోసివేయడమేనని తేల్చేశారు.

భవనం పైనున్న 'ఏసీ పైప్‌లైన్‌'ని ఎవరో కుట్రపూరితంగా కోసి పారేశారన్నది స్పీకర్‌ కోడెల వాదన. అసెంబ్లీ అధికారులు, నిర్మాణ సంస్థకు చెందిన ఇంజనీర్లు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన కోడెల, కుట్ర కోణం దాదాపుగా బయటపడిందనీ, పూర్తి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగుచూస్తాయని సెలవిచ్చారు.

ఒకవేళ కుట్రకోణమే నిజమైతే, అది ఇంకా దారుణమైన ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించాల్సి వుంటుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే పరిపాలనా సముదాయంలో, అందునా అసెంబ్లీ భవనంలో ఇలాంటి భద్రతా లోపాలకు ఆస్కారమెలా వుంటుంది.? ఆస్కారం ఏర్పడిందంటే, ప్రతిపక్ష నేత మీద ఏమన్నా కుట్ర జరుగుతోందా.? అన్న అనుమానాలు మళ్ళీ పుట్టుకొస్తాయి.

తప్పు మీద తప్పు.. ఒకదాని మీద ఇంకో తప్పు దొర్లుతూనే వున్నాయి రాజధాని అమరావతి.. అందునా వెలగపూడిలో నిర్మించిన పరిపాలనా సముదాయాల విషయంలో. ఎందుకిలా.? ఏమో, ఆ పైవాడికే తెలియాలి.

Show comments