వైఎస్సార్సీపీ 'సోషల్‌' దండయాత్ర.!

సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపుదామనుకున్న తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద షాక్‌ ఇచ్చేలా వుంది. 'అధికార పార్టీపై మీ అభిప్రాయాలు మీరు మీకు నచ్చిన విధంగా చెప్పుకోవచ్చు.. సోషల్‌ మీడియాలో ఎవరైనా తమ అభిప్రాయాల్ని చెప్పుకునే వీలుంది.. వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. చంద్రబాబు సర్కార్‌ తీరుకి వ్యతిరేకంగా గళం విప్పండి..' అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపునివ్వడంతో, ఒక్కసారిగా ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరిగినట్లయ్యింది. 

'పొలిటికల్‌ పంచ్‌' అనే ఫేస్‌బుక్‌ పేజీ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ అరెస్ట్‌తో సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపేశామని అధికార పార్టీ నేతలు చంకలు గుద్దేసుకున్నారు. కానీ, ఇరవై నాలుగ్గంటలు తిరగకుండానే ఎక్కడ అరెస్ట్‌ చేశారో, మళ్ళీ అక్కడే అతన్ని వదిలేశారు. దాంతో, ఈ వ్యవహారంలో అధికార పార్టీ అభాసుపాలయిపోయిందనే విషయం అందరికీ అర్థమయిపోయింది.! 

నెటిజన్లు తమ అభిప్రాయాల్ని చెప్పడానికి సోషల్‌ మీడియాని ఓ వేదికగా చేసుకుంటున్నారు. సినిమాలు, రాజకీయాలు, ఇతరత్రా అంశాలు.. ఒకటేమిటి, వివిధ అంశాలపై తమ అభిప్రాయాల్ని సోషల్‌ మీడియాలో కుండబద్దలు గొట్టేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో చిన్న చిన్న తప్పిదాలు, తప్పుడు సమాచారాలు సర్వసాధారణమైపోయాయి. మరోపక్క, వెటకారాలు, మితిమీరిన వివాదాస్పద వ్యాఖ్యలూ.. మామూలే. అయినాసరే, సోషల్‌ మీడియాని బ్యాన్‌ చేసేద్దామనుకుంటే కుదిరే పనేనా.? 

ఇప్పటిదాకా ఒక లెక్క.. రేపట్నుంచి ఇంకో లెక్క. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పిలుపునివ్వడం, సోషల్‌ మీడియాలో రెచ్చిపోమని కోరడంతో, ఇకపై అధికార పార్టీపై 'దండయాత్ర' తప్పకపోవచ్చు. జగన్‌ మీద సెటైర్లు వేస్తూ, సోషల్‌ మీడియాని నిస్సిగ్గుగా వాడేసుకున్న టీడీపీ, తనదాకా వచ్చేసరికి.. నీతులు, నైతిక విలువల గురించి మాట్లాడేస్తోంది. మొత్తమ్మీద, రవికిరణ్‌ అరెస్ట్‌ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సోషల్‌ మీడియా అనే కొరివితో తలగోక్కోవడమంటే ఎలా వుంటుందో, ముందు ముందు టీడీపీకి మరింత గొప్పగా అవగతం కానుంది.!

Show comments