బ్యాచిలర్ల చేతుల్లోనే సగం భారతదేశం!

ఏం మార్చాలన్నా బ్యాచిలర్ గానే మార్చగలవు... పెళ్లైతే కనీసం టీవీ రిమోట్ తో చానల్ కూడా మార్చలేవని అంటారు... మరి పెళ్లైన వాళ్లు ఏదీ సాధించడం లేదు అనలేం కానీ, రాజకీయాల్లో మాత్రం బ్యాచిలర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే భారత రాజకీయ రణరంగంలో బ్యాచిలర్ల హవా కొనసాగుతుండగా.. ఇప్పుడు ఈ క్లబ్ లోకి మరో బ్యాచిలర్ జాయిన్ అయ్యాడు. ఆయనే యోగి ఆదిత్యనాథ్. దేశంలోనే అత్యధిక జనాభాగల రాష్ట్రం పగ్గాలను చేపట్టబోతున్నానాడీయన. తద్వారా మరో బ్యాచిలర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నట్టుగా అవుతోంది.

ఇటీవలే జయలలిత మరణంతో తగ్గిన బ్యాచిలర్ స్కోరు యోగితో బ్యాలెన్స్ అవుతోంది. తన ఇరవై మూడవయేటే సన్యాసం తీసుకున్నారు ఆదిత్యనాథ్. సన్యాసిగానే రాజకీయాల వైపు వచ్చారు. మఠాధిపతి అయ్యారు. ఐదుసార్లు వరసగా ఎంపీగా ఎన్నికయ్యారు, ఇప్పుడు ఏకంగా యూపీ ముఖ్యమంత్రి అవుతున్నారు.

కేవలం ఆదిత్యనాథ్ మాత్రమే కాదు.. ఉత్తరాఖండ్ కొత్త సీఎం త్రివేంద్ర రావత్ కూడా సోలోనే. వీళ్లద్దరూ న్యూ జాయినింగ్. వీళ్లు మాత్రమే గాక.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం దీదీ, హర్యానా సీఎం ఖట్టర్, అస్సోం సీఎం సోనోవాల్ లు కూడా అవివాహితులే. జయలలిత ఉండి ఉంటే.. వీరి క్లబ్ లో సభ్యుల సంఖ్య ఇంకా ఎక్కువయ్యేది.

మరి అవివాహిత ముఖ్యమంత్రులే కాదు... రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్న వాళ్లూ ఉన్నారని వేరే చెప్పనక్కర్లేదు. యూపీ మాజీ సీఎం మాయ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, కేంద్రమంత్రి ఉమాభారతి వంటి వాళ్లు కూడా అవివాహితులే. ఈ కేటగిరికి చెందిన వ్యక్తే కానీ, ప్రధాని మోడీ కథ కాస్తంత భిన్నం. వివాహాం అయ్యింది, విడాకులు తీసుకోలేదు... కానీ మోడీ సోలోనే! మొత్తానికి దేశంలో సంసారుల కన్నా, సోలోల పరిస్థితే బాగున్నట్టుంది.

Show comments