విశాఖ రైల్వే జోన్‌కు రెడ్‌ సిగ్నల్‌?

పార్లమెంటు బడ్జెటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రేపు (ఫిబ్రవరి 1) ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి బడ్జెట్‌ ప్రత్యేకత తెలిసిందే కదా. రైల్వే బడ్జెటు కూడా సాధారణ బడ్జెటులోనే కలిసి వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇతర అంశాలు ఎలా ఉన్నప్పటికీ బడ్జెటుపై అక్కడి ప్రజల ప్రధానమైన ఆశ విశాఖపట్నం రైల్వే జోన్‌. ఇది విభజన చట్టంలో ఉన్న అంశమే. ఇప్పటివరకు దీనిపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రేపటి బడ్జెటులో దీని ప్రస్తావన ఉంటుందేమోనని ప్రజలు ఆశగా ఉన్నారు. ఈ ఆశ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంతవరకు ఉందో చెప్పలేంగాని పార్లమెంటు సమావేశాలకు సన్నాహకంగా ఆయన టీడీపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో మాత్రం రైల్వే జోన్‌పై గట్టిగా పట్టుబట్టాలని చెప్పారు. 'దేన్నీ వదిలేది లేదు' అని ఎంపీల సమావేశంలో చెప్పినట్లు 'పచ్చ' పార్టీ అనుకూల పత్రిక రాసింది. వదలకూడని అంశాలు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రైల్వే జోన్‌, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత. ఈ రెండింటినీ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే సాధించాలని బాబు ఎంపీలకు చెప్పారు. 'యస్‌ బాస్‌' అని వారూ అన్నారు. టీడీపీ అనుకూల పత్రిక మరో పని చేసింది. జనవరి 26న ప్రత్యేక హోదా కోసం వైకాపా గొడవ చేసింది కదా.

అందుకని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితే ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి ప్రత్యేక హోదా ఇక రాదని, అది ముగిసిపోయిన అధ్యాయమని మరోసారి చెప్పించింది. గతంలో ఆ పత్రికకు చెందిన టీవీ ఛానెల్లో 'బిగ్‌ డిబేట్‌' పేరుతో హోదా ఎందుకు రాదో, రాకపోయినా కేంద్రం ఏపీకి ఏవిధంగా సాయం చేస్తున్నదో వెంకయ్య నాయుడు సుదీర్ఘంగా వివరించారు. ఈ ఇంటర్వ్యూలోనూ అదే సారాంశం. ఇందులో వెంకయ్య చెప్పిన రెండు విషయాలు గమనించదగ్గవి.

ఒకటి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత. రెండు రైల్వే జోన్‌. ప్యాకేజీ పేరుతో ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించి ఐదు నెలలైంది. ఇంతవరకు చట్టబద్ధత ప్రకటించలేదు. ఇది చంద్రబాబుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక హోదా వేస్ట్‌ అనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ప్యాకేజీకైనా కేంద్రాన్ని కమిట్‌ చేయించాలి. ఇప్పటివరకు ఆ పని చేయించలేకపోయారు. ఇప్పటికి కేంద్రాన్ని అనేకసార్లు అడిగినా ఉలుకుపలుకూ లేదు. దీనిపై వెంకయ్య నాయుడు వివరిస్తూ 'ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించలేదని అంటున్నారు. చట్టబద్ధత అంటే ఏమీ లేదు. కేబినెట్‌ ఆమోదమే. ఆర్ధిక శాఖ ఫైలు సిద్ధం చేసింది. త్వరలోనే జరిగిపోతుంది. అప్పుడు వీళ్లు ఏం మాట్లాడతారో చూద్దాం. ఐదు నెలలు కాదు. ఆరు నెలలు గడిచినా మునిగిపోయిందేమీ లేదు'...అని చెప్పారు.

దీన్నిబట్టి ఏమర్థమవుతోంది? చట్టబద్ధత అనేది ఆందోళన చెందాల్సిన విషయం కాదని వెంకయ్య అభిప్రాయం. పైగా ఏపీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు.  గత ఐదు నెలల్లో అనేక కేబినెట్‌ సమావేశాలు జరిగాయి. ప్యాకేజీకి ఎందుకు ఆమోదం తెలపలేదు? ఈ జాప్యానికి కారణమేమిటి? దీనిపై వివరిస్తే ప్రజలకు అవగాహన కలుగుతుంది. ఇక రైల్వే జోన్‌ గురించి చెబుతూ 'రైల్వే జోన్‌ కొంత సంక్లిష్టమైంది. దానిపైనా పరిశీలన జరుగుతోంది' అని చెప్పారు. అంటే రేపటి బడ్జెటులో రైల్వే జోన్‌ ప్రస్తావన ఉండదని చెప్పడమన్నమాట. దీన్ని ఈమధ్యలో ఎప్పుడైనా ప్రకటిస్తారా? వచ్చే ఏడాది బడ్జెటుకు వాయిదా వేస్తారా? తెలియదు. ఒకవేళ వచ్చే బడ్జెటు అనుకుంటే అదే చివరి అవకాశంగా భావించవచ్చు. వచ్చే ఏడాదంతా ఎన్నికల హడావిడే సరిపోతుంది.  రైల్వే జోన్‌ అంశం కూడా ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశంగా కేంద్రం ఎప్పటినుంచో చెబుతోంది.

మూడేళ్ల తరువాత కూడా వెంకయ్య నాయుడు రైల్వే జోన్‌ సంక్లిష్టమైన వ్యవహారమని చెబుతున్నారంటే దీనికి 'రెడ్‌ సిగ్నల్‌' పడుతుందేమోనని అనుమానం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో తెలియదు. ప్రత్యేక హోదా పోయింది. చట్టబద్ధత, రైల్వే జోన్‌పై అనిశ్చితి. మొదటి ఏడాది రెవిన్యూ లోటు ఇంతవరకు పూర్తిగా భర్తీ చేయలేదు. బీజేపీ నాయకులు  మూడు విషయాలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకటి పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు రుణం ఇప్పించడం. రెండు పోలవరం కింద మునిగిపోనున్న తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం. కొన్ని కేంద్ర విద్యా సంస్థలను కేటాయించడం. చట్టబద్ధత, రైల్వే జోన్‌ విషయంలో ఇంకా జాప్యం జరిగినా చంద్రబాబు సర్దుకుపోతారా?

Show comments