మళ్ళీ అదే మాట.. లక్ష ఉద్యోగాలెలా.?

లక్ష కోట్లతో రాజధానిని కట్టేస్తానన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోన్న ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు ఇస్తామంటున్నారు నారా చంద్రబాబునాయుడుగారి పుత్రరత్నం నారా లోకేష్‌. అవును మరి, ఆవు చేలో మేస్తో.. దూడ గట్టున మేస్తుందా.? ఛాన్సే లేదు. కథలు ఇలాగే చెప్పాలి.! 

గడచిన మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌ కొత్తగా ఎన్ని ఉద్యోగాల్ని కల్పించింది.? అన్న ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పగలిగితే, ఆ తర్వాత కొత్తగా లక్ష ఉద్యోగాలు.. అందునా, ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాల గురించి నారా లోకేష్‌ ఎంత గొప్పగా అయినా చెప్పేసుకోవచ్చు. ఐటీ రంగంలో కొత్తగా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, ఐటీ రంగంలో అత్యున్నత ప్రగతి సాధిస్తున్న హైద్రాబాద్‌ని కలిగి వున్న తెలంగాణ ప్రభుత్వమే చెప్పడంలేదాయె. 

ఎంత ఐటీ శాఖ మంత్రి అయితే మాత్రం, వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా ఆకాశంలో విహరిస్తూ, నిరుద్యోగులకు నారా లోకేష్‌ గాల్లో ఉద్యోగాలు చూపించడం సబబు కాదు. కానీ, ఆయన మాత్రం మారరు. మారరుగాక మారరు. ఎందుకంటే, ఆయన చంద్రబాబుగారి పుత్రరత్నం. నారా లోకేష్‌కి మంత్రి పదవి దక్కినం తేలిక కాదు, ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు రావడమంటే. ఆ విషయం ఆయనగారికి ఎలా అర్థమవుతుందట.? ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగుల ఆవేదన ఇది. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకే 'ఉద్యోగాల' కల్పన కనా కష్టమయ్యింది. అందులోనూ కొంతమందికే ఛాన్స్‌ దక్కిందాయె. ఒకాయనకి మంత్రి పదవి ఆశ చూపితే, ఆ పదవి కోసం ఆశపడీ పడీ.. చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ కోటాలో, ఆయనగారి కుమార్తెకి మంత్రి పదవి కట్టబెట్టి, 'పాపం' కడిగేసుకునే ప్రయత్నం చేశారనుకోండి.. అది వేరే విషయం. 

ఎన్నికల్లో చంద్రబాబు హామీలిస్తే, అధికారంలోకి వచ్చాక తండ్రికి మించిన తనయుడు.. అనే స్థాయిలో నారా లోకేష్‌ హామీలు ఇచ్చేస్తున్నారన్నమాట. 

Show comments