ప్రతిపక్షం అన్నాక ఏదో హడావుడి వుండాలి. అందుకు అధికారపక్షం ఏదో ఒక పాయింట్ ను చేజేతులా అందించాలి. నిన్న మొన్నటి దాకా ప్రత్యేక హోదా అంశం అన్నది వైకాపాకు అక్షయ పాత్రలా కనిపించింది. దాని పైనే పోరు సాగించుకుంటూ వచ్చింది. కానీ జనానికి ఆ హోదా అంశం పెద్దగా పట్టలేదు. పాలకపక్షం తనకు వున్న మీడియా అండదండలతో ఆ అంశాన్ని విజయవంతంగా పక్కదారి పట్టించేసింది. పైగా కేంద్రం కూడా మొండిగా వుంది. హోదా సాధించలేకపోయింది అధికార పక్షం అని చాటడం తప్ప, మరో లక్ష్య సాధన ఏదీ హోదాపై పోరువల్ల కనిపించకుండా పోయింది.
ఇలాంటి సమయంలో, వరదలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ దొరికినట్లు దొరికింది ఓ ఫొటో. హోంమంత్రిని నిలదీస్తున్న లోకేష్ ఫొటొ. ఇప్పుడు వైకాపా రాజకీయం మొత్తం ఈ ఫొటో చుట్టూనే తిరుగుతూంది. వైకాపా ఈ అంశాన్ని పట్టుకుని వేలాడుతుంటే, రాద్దాంతం అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. నీ ఇక్కడ దీని ప్రభావం ఎలా వుంటుందో రెండు వర్గాలకు తెలుసు. అందుకే ఒక వర్గం దీన్ని గట్టిగా పట్టుకుంటే, మరో వర్గం దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని కిందా మీదా అవుతోంది.
ముఫై ఏళ్లకు పైగా ఇలాంటి సంఘటనే ఒకటి రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసింది. అప్పట్లో రాజీవ్ గాంధీ ట్రాన్సిట్ హాల్ట్ లో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చారు. అత్యంత విధేయతో, పిలవని పేరంటం అయినా అప్పటి సిఎమ్ అంజయ్య ఎయిర్ పోర్టుకు వెళ్లారు. దాంతో రాజీవ్ భగ్గుమన్నారని, తన కోసం ఎందుకు వచ్చారని అంజయ్యపై ఆగ్రహం వెలిబుచ్చారని వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తల ప్రభావం, ఆ నేపథ్యంలో వదిలిన తెలుగుదేశం ఆత్మగౌరవ నినాదం ఓ రేంజ్ లో తెలుగు జనాలపై ప్రభావం చూపించాయి.
ఇప్పుడు అసలే కాపులు రెండు వర్గాలుగా వున్నారు. తెలుగుదేశం అనుకూల, ప్రతికూల వర్గాలు. ఇప్పుడు ఈ ఫొటో అన్నది ఆ ప్రతికూల వర్గాలకు అస్త్రంగా మారిపోతుంది. ఇది సహజంగా వైకాపాకు బలంగా మారుతుంది. అందుకే తెలుగుదేశం పార్టీ నానా హడావుడి చేస్తోంది.
అయితే చెడు కూడా ఒకసారి మంచి చేస్తుంది. చాలా కాలంగా వినిపిస్తోన్న సంగతి ఏమిటంటే, హోం మంత్రి పదవి కాపు సామాజికవర్గం నుంచి కమ్మ సామాజికవర్గం వైపు మారుస్తారని. ఇటీవల ఈ పదవికి స్పీకర్ కోడెల పేరు కూడా వినిపించింది. ఇప్పుడు ఇంత గడబిడ అయిన నేపథ్యంలో చినరాజప్ప చేతి నుంచి హోంమంత్రి పదవిని తీయడానికి తెలుగుదేశం సాహసించకపోవచ్చు. అదే జరిగితే, వైకాపా మళ్లీ ఈ ఫొటో పట్టుకుని, హడావుడి మొదలు పెట్టే అవకాశం వుంది. సహజంగానే అది కాపుల్లోకి రాంగ్ సిగ్నళ్లు పంపిస్తుంది.
అందువల్ల ఈ పరిణామం వైకాపా సంగతేమో కానీ, చినరాజప్పకు మంచిదే అవుతుంది అనిపిస్తోంది.