పవన్‌కళ్యాణ్‌.. మీకైనా అర్థమవుతోందా.?

'మనం ఏం అర్థం చేసుకోవాలంటే..' 

- ఇది జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ సరికొత్త ఊతపదమేమో.! 

పార్టీ ఫిరాయింపుల గురించీ, దళితులపై దాడుల గురించీ, ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఆందోళనకారుల గురించీ.. పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ పదే పదే 'మనం ఏం అర్థం చేసుకోవాలంటే..' అన్న మాటని ప్రస్తావించారు. అక్కడినుంచే ఆయా విషయాలపై పవన్‌కళ్యాణ్‌ స్పందించడం మొదలుపెట్టారు. కానీ, ఆయా విషయాల గురించి పవన్‌కళ్యాణ్‌కి ఎంతవరకు అవగాహన వుంది.? అన్న విషయం ఆయన మాటల్ని వింటే తేలిగ్గానే అర్థమయిపోతుంది. 

'పార్టీ ఫిరాయింపులనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు..' అంటూ ఓ చిన్న 'పాజ్‌' ఇచ్చారు పవన్‌కళ్యాణ్‌. ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడారు.? అన్నదాని గురించి ఆలోచిస్తే ఎవరికీ ఏమీ అర్థం కాదు. 'ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు..' అన్న మాట రావడమంటేనే, ఆ విషయంలో తాను స్పందించడానికి ఏమీ లేదని ఆయన చెప్పేసినట్లే. గతంలో జరిగింది కాబట్టి, ఇప్పుడూ జరుగుతోందని పార్టీ ఫిరాయింపులకు ఆయన మద్దతిచ్చేశారనుకోవాలి. 

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా వుంటుంది. ఆ నిరసన మార్గాలు అనేకం వుంటాయి. నిరాహార దీక్షలు, పాదయాత్రలు, ఆందోళనలు, ధర్నాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే.! ముద్రగడ పద్మనాభం, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వమేమో ఆయన చేస్తున్న పాదయాత్రకు అనుమతిచ్చేది లేదంటోంది. పవన్‌కళ్యాణ్‌ మాత్రం అనుమతివ్వాలంటారు. మరి, ఆ విషయమ్మీద గట్టిగా మాట్లాడాలి కదా.? మాట్లాడరాయె. 

పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్‌ బాధితుల వ్యవహారంలోనూ పవన్‌ పూర్తిస్థాయిలో కన్‌ఫ్యూజ్‌ అయిపోయారు. అక్కడ బాధితుల తరఫున మాట్లాడాలనుకుంటూనే, ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనడానికి ఇష్టపడలేదాయన. ఇంకెందుకు, ఆయా అంశాలపై పవన్‌ స్పందించడం.? దళితులపై దాడుల విషయంలోనూ పవన్‌కళ్యాణ్‌ది ఇదే తీరు. 

పార్టీ నిర్మాణం జరగలేదనీ, ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నామనీ చెబుతోన్న పవన్‌కళ్యాణ్‌, తనకోసం వస్తోన్న వేలాదిమందిని చూసయినా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాల్సి వుంది. ఆయనేదో చెబుతారనీ, ఆయన రాజకీయ పార్టీ విధి విధానాలు అర్థమయ్యేలా వివరిస్తారనీ, ఆయా అంశాల పట్ల స్పందిస్తారనీ.. ఇలా పవన్‌ అభిమానులైనా ఎదురుచూస్తారు కదా.? మరి, ఏదీ పవన్‌కళ్యాణ్‌ నుంచి వారికి 'భరోసా'.! 

'ఆయనేం మాట్లాడతారో ఆయనకే తెలియదు..' అన్న భావన ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లోనే పెరిగిపోతోంది. నేర్చుకుంటున్నా.. నేర్చుకుంటున్నా.. అంటూనే, పవన్‌కళ్యాణ్‌ తనకు తానే అర్థం కాకుండా పోతే ఎలా.!

Show comments