'కమలం' నేత నాలిక మడత పడిందెందుకు?

   రాజకీయాల్లో గల్లీ నాయకులే కాదు ఢిల్లీ నాయకులూ అర్థంపర్థం లేకుండా మాట్లాడతారు. చిన్నా చితక నాయకులంటే తెలిసీతెలియక మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కాని ఢిల్లీలో కూర్చుని జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపే నాయకులు, రాష్ట్రాలకు ఇన్‌చార్జిలుగా ఉన్నవారు కూడా పద్ధతీపాడు లేకుండా మీడియా సమావేశాల్లో మాట్లాడుతుంటారు. వాళ్లు మాట్లాడే తీరు చూస్తే 'వీళ్లకు బుర్ర ఉందా?'..అనే అనుమానం కలుగుతుంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే జనం నవ్వుతారనే ఇంగితం కూడా ఉండదు. విమర్శలు రాగానే 'నా మాటలను మీడియా వక్రీకరించింది' అనే రెడీమేడ్‌ డైలాగ్‌ కొడతారు. ఒక్క కమ్యూనిస్టు పార్టీల్లో మినహా మిగిలిన అన్ని బూర్జువా పార్టీల్లోనూ నాలిక మడతేసే సవాలక్ష మంది నాయకులున్నారు. సిద్ధార్ధనాథ్‌ సింగ్‌ అనే కమలం పార్టీ నాయకుడు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి. అప్పుడప్పుడు వచ్చి పార్టీ సమావేశాలు నిర్వహించి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొంతకాలంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. ఎందుకు?

     పవర్‌స్టార్‌ బీజేపీని, కేంద్రాన్ని విమర్శిస్తున్నాడు కాబట్టి. మొన్నటివరకు బీజేపీతో అంటకాగి ఇప్పుడు విమర్శిస్తుండటంతో సిద్థార్థనాథ్‌ సింగ్‌కు ఒళ్లు మండింది. ఈమధ్య రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించాడు. పవన్‌ వైఖరి మారింది కాబట్టి ఈయన విమర్శించడం సబబే. కాని ఎందుకో తాజాగా నాలిక మడతేశాడు. మడతేయడమంటే మాట మార్చడం. పవన్‌ను తీవ్రంగా విమర్శించిన సింగ్‌ తాజాగా 'జనసేనతో మా పార్టీ స్నేహం కొనసాగుతుంది' అని ప్రకటించాడు. దీని వెనక రాజకీయం ఏమిటో....! 'పవన్‌తో మాకు ఎటువంటి రాజకీయ విభేదాలు లేవు. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం' అని సిద్ధార్ధనాథ్‌ సింగ్‌ చెప్పారు. ఇది ఈయన సొంతంగా చెప్పాడో, ఢిల్లీ నాయకత్వం సలహా మేరకు అన్నారో తెలియదు. ఇదే సిద్ధార్థనాథ్‌ సింగ్‌ గతంలో ఆంధ్రాకు వచ్చినప్పుడు అసలు 'జనసేన' ఎక్కడుంది? అని ప్రశ్నించారు.  'జనసేన ఎన్‌డీఏలోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వెళ్లింది?' అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మళ్లీ సాఫ్ట్‌గా మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో తెలియదు. టీడీపీతో సంబంధాలపై అనుమానాలున్నాయి.

     పవన్‌ పార్టీ నివురుగప్పిన నిప్పులా ఉందనే భావన ఉందేమో. ఒకవేళ టీడీపీతో బంధం తెగితే బీజేపీకి తప్పనిసరిగా ఓ బలమైన నాయకుడి అండ కావల్సిందే. ప్రస్తుతానికి పవన్‌ తప్ప మరొకరు లేరు. అనవసరంగా ఆయనపై అదేపనిగా విమర్శలు చేసి శత్రువును చేసుకోవడం ఎందుకని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నదేమో. అందువల్ల సిద్ధార్థనాథ్‌ సింగ్‌ స్వరం మార్చి ఉండొచ్చు. పవన్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ నాయకుడు చెప్పినా మళ్లీ బీజేపీపై, కేంద్రంపై విరుచుకుపడేందుకు పవన్‌ కళ్యాణ్‌ సిద్ధమవుతున్నాడు. జనవరి 3వ తేదీ శ్రీకాకుళంలో పవన్‌ బహిరంగ సభ జరగబోతోంది. ఆయన మాట్లాడబోయే అంశాల్లో పోలవరం ప్రాజెక్టు, దానికి నాబార్డు రుణం ప్రధానాంశంగా ఉంటుందని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. మొన్నటివరకు 'జనసేన' పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి మిత్రుడు. ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉన్న వ్యక్తి.

     కాషాయం పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ హీరోను స్వయంగా బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పవన్‌ కాకినాడ సభ తరువాత బీజేపీకి పరమ శత్రువైపోయాడు. రంగు, రుచి, వాసన లేని జనసేనను ఒక రాజకీయ పార్టీగా గుర్తించింది బీజేపీ. నామరూపాలు లేని పార్టీని  'మిత్రపక్షం'గా గుర్తించగా, మీడియా దాన్నొక రాజకీయ పార్టీగా ప్రచారం చేసింది. ఉనికిలో లేని జనసేనను బీజేపీ ఒక రాజకీయ పార్టీగా గుర్తించిందనేది వాస్తవం. ఎన్‌డీఏలో 45 పార్టీలున్నాయి. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి టీడీపీ, జనసేన ఉన్నాయి. వికీపీడియాలోని ఎన్‌డీఏ పేజీలో 45 మిత్ర పక్షాల (ప్రాంతీయ పార్టీలు) పేర్లు, వాటి రాష్ట్రాల పేర్లు, ఎన్నికల్లో అవి సాధించిన సీట్ల వివరాలున్నాయి. జనసేనను ప్రాంతీయ పార్టీగా గుర్తించబట్టే జాబితాలో దాని పేరుంది. ప్రముఖ ఆంగ్ల పత్రికలు ఎన్‌డీఏ అలయన్స్‌ జాబితా ప్రచురించాయి. వాటిల్లోనూ జనసేన పేరుంది. పత్రికల్లో ఆ జాబితా వచ్చిందంటే బీజేపీ ఇచ్చిన అధికారిక సమాచారం మేరకే ప్రచురిస్తారు కదా. అంటే జనసేన తమ మిత్రపక్షమని బీజేపీ తెలియచేసింది.  నిజానికి జనసేన  ఉనికిలో ఉన్న పార్టీ కాదు. అది కేవలం రిజిస్టర్డ్‌ పొలిటికల్‌ పార్టీ. దాని విశ్వరూపం ఏమిటనేది ఎన్నికల్లో తెలియాల్సిందే. 

Show comments