దుమారం రేపుతున్న 'ఆధార' వివాదాలు...!

ప్రస్తుతం దేశంలో రెండు వివాదాలు రోజుల తరబడి కొనసాగుతున్నాయి. రెండూ జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఒకటి రాష్ట్రానికి సంబంధించింది. మరొకటి దేశానికి, అంతర్జాతీయానికి సంబంధించింది. మొదటిది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించింది. రెండోది ఈమధ్య పాక్‌ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం  ఉగ్రవాద శిబిరాలపై చేసిన సర్జికల్‌ దాడులు. నిజానికి ఈ రెండు ఘటనలకు పొంతన లేకపోయినా ఒకే అంశంపై వివాదం రేగుతోంది. 

ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఫొటోలు, సరైన మెడికల్‌ రిపోర్టు విడుదల చేయాలని తమిళనాడులోని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తుండగా, భారత్‌ సైన్యం సర్జికల్‌ దాడులకు సంబంధించిన వీడియో విడుదల చేయాలని దేశంలోని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంటే జయలలిత క్షేమంగానే  ఉన్నారనే ప్రభుత్వ ప్రచారాన్ని తమిళనాడు ప్రతిపక్షాలు నమ్మడంలేదు. అలాగే సర్జికల్‌ దాడులు జరిగాయనే మోదీ సర్కారు ప్రచారాన్ని కొన్ని ప్రతిపక్షాలు నమ్మడంలేదు. కాని అటు అన్నాడీఎంకే ప్రభుత్వం, ఇటు మోదీ ప్రభుత్వం ఆధారాలు బయటపెట్టడానికి ఇష్టపడటంలేదు. ఇలా ఎందుకు జరుగుతోందనేది అర్థం కావడంలేదు. 

ఈ రెండు విషయాల్లోనూ పాలకులకు ఉన్న ఇబ్బందులేమిటో తెలియడంలేదు. పాలకులు ఆధారాలు విడుదల చేయకుండా బిగుసుకొంటున్న కొద్దీ జయలలిత ఆరోగ్య పరిస్థితి, సైన్యం దాడుల విషయంలో అనేక అనుమానాలు ప్రబలుతున్నాయి.  స్వల్ప అనారోగ్యంతో (జ్వరం, డీహైడ్రేషన్‌) గత నెల 22న చెన్నయ్‌లోని అపోలో అస్పత్రిలో చేరిన జయలలిత  ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం ఇప్పటివరకు బయటకు చెప్పడంలేదు. సరైన మెడికల్‌ బులిటన్లు, ఫోటోలు విడుదల చేయడంలేదు. సామాజిక మాధ్యమాల్లో భయంకరమైన వదంతులు వస్తున్నప్పటికీ అన్నాడీఎంకేగాని, ప్రభుత్వంగాని ఖాతరు చేయడంలేదు. 

లేనిపోని పుకార్లు సృష్టించి ఆందోళన కలిగిస్తున్నారంటూ పోలీసులు కొందరిని అరెస్టు చేస్తున్నారు. జయలలిత ఆస్పత్రి నుంచే పరిపాలన సాగిస్తున్నారని, అక్కడే తమతో సమావేశాలు నిర్వహించారని, అవసరమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రులు, అధికారులు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ ఫొటోలు విడుదల చేయడానికి అభ్యంతరం ఏమిటని డీఎంకే, ఇతర ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇన్‌చార్జి గవర్నరుగా వ్యవహరిస్తున్న మహారాష్ట్ర గవర్నరుకు ఫిర్యాదు చేశాయి. ఆయన వచ్చి వెళ్లినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. 

ఎవరెంత అడిగినా జయలలిత ఫొటోలు విడుదల చేయకపోవడం క్షమించరాని నేరమని డీఎంకే ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించింది. అన్నాడీఎంకే కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా 'అమ్మ' ఫొటోలు విడుదల చేయాలని, సరైన సమాచారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ జయలలితకు సంబంధించిన ఒక్క విషయం కూడా బయటకు రావడంలేదు. దీంతో రకరకాల ప్రశ్నలను లేవదీస్తూ, అనుమానాలు వ్యక్తం చేస్తూ తమిళ టీవీ ఛానళ్లే కాకుండా ఇంగ్లీషు ఛానెళ్లు కూడా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పత్రికలూ ప్రచురిస్తున్నాయి. 

జయలలిత సజీవంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. చివరకు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అసలు సమాచారం తెలియచేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జయ ఆరోగ్యానికి సంబంధించి సమగ్ర నివేదిక రేపు (6వ తేదీ) సమర్పించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం రేపు ఏం చేస్తుందో చూడాలి. ఇక ఉగ్రవాద శిబిరాలపై భారతసైన్యం సర్జికల్‌ దాడుల చేసిందనగానే దేశమంతటా ఆనందం వెల్లివిరిసింది. సైన్యం అత్యంత చాకచక్యంగా ఉగ్రతండాలపై దాడులు చేసి దాదాపు నలభై మందిని హతమార్చిందని, సైన్యానికి ఎలాంటి నష్టం కలగలేదని ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా ఆర్మీ అత్యున్నతాధికారి స్వయంగా మీడియా సమావేశం పెట్టి విషయం తెలియచేశారు. 

సర్జికల్‌ దాడులను వీడియో తీశామని కూడా చెప్పారు. భారత సైన్యం దాడులు జరపగానే అంతర్జాతీయంగా సంచలనం రేగింది. ఇక ఇండియాలోని మీడియా సంగతి చెప్పక్కర్లేదు. టీవీ ఛానెళ్లలో గంటల తరబడి, రోజుల తరబడి కథనాలు ప్రసారమయ్యాయి. చర్చోపచర్చలు జరిగాయి. ప్రింట్‌ మీడియా పరిస్థితి కూడా ఇదే. పేజీలకు పేజీలు కథనాలు ప్రచురించాయి. ఇక ప్రధాని మోదీపై ప్రశంసల జల్లుకు అంతు లేదు. ఓ పక్క సంబురాలు జరుగుతుండగానే సర్జికల్‌ దాడుల వీడియో విడుదల చేయండి అని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. 

కాని సర్కారు ఆ పని చేయడంలేదు. దాడులు జరిగాయని సైన్యం ప్రకటించగానే 'జరగలేదు' అని పాక్‌ ప్రకటించింది. దాని ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటే వీడియా విడుదల చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. చివరకు వీడియో కోసం గట్టిగా డిమాండ్‌ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను పాక్‌ మీడియా హీరోను చేసేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏమీ మాట్లాడటంలేదు. ఈ రెండు వివాదాలు సరైన ముగింపుకొస్తాయా?

Show comments