సర్వేల లోగుట్టు ప్రజలకు ఎరుక?

లోకం పోకడ తెలియని కోయిల ముందే కూసింది అంటే అర్థం వుంది. అయ్యో అమాయకపు పిట్ట అని సరిపెట్టుకోవచ్చు. కానీ అన్నీ తెలిసి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను శాసించాలని, ఐఎఎస్ లను తన అదుపాజ్ఞలలో వుంచుకోవాలని తహతహలాడుతూ, అందుకు అణుగుణంగా కథనాలు వంటి వార్చే మీడియా అర్జెంట్ గా సర్వే చేయించి, ఫలితాలు ఇవీ అని జనం చెవుల్లో మైకులు పెట్టి ఊదుతుంటే? ఎమనుకోవాలి? రెండున్నరేళ్ల తరువాత అవసరమైన ప్రచార పటాటోపం ఇప్పుడే చేస్తుంటే ఏమని అర్థం చేసుకోవాలి? దీని వెనుక అసలు పరమార్థం ఏమై వుంటుంది?

మరీ ఇన్ని ప్రశ్నలు అవసరం లేదు..సమాధానం కోసం బుర్రలు బద్దలు కొట్టుకోనక్కర లేదు. ఇదో బహుళార్థక సాధక ప్రాజెక్టు. బాబుపై ఆంధ్ర జనాలకు మోజు పెరిగింది కానీ, తరగలేదనీ, జగన్ అనేవాడి పట్ల జనం ఆదరణ అమాంతం పడిపోయిందని, పవరు స్టారుకు అసలు పవరు అందే పరిస్ఢితే లేదని, అన్నింటికి మించి నోట్ల రద్దుతో తలకాయనొప్పులు పడుతున్న జనం ఎక్కడ బాబును కూడా వ్యతిరేకిస్తారో అని, అలాంటి పరిస్థితి ఏర్పడుకుండా పడుతున్న ముందు జాగ్రత్త ఈ బహళ ప్రయోజనాల్లో కొన్ని మాత్రమే.

అన్నింటా స్పష్టమైన ముద్ర

ఎక్కడా బాబుపై ఈగ వాల కూడదు, ప్రజలు బాబును ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. ఇలాగే చూడాలి. ఒకవైపే చూడాలి. మరోలా చూడకూడదు అన్న వ్యూహరచన ఈ సర్వే అడుగడుగునా కనిపిస్తోంది. సింపుల్ గా ఒక్కటి చూడండి. నోట్ల రద్దుకు కారణం ఎవరు? అంటే 86శాతానికి పైగా మోడీ అన్నారు. 13 శాతానికి పైగా బాబు అన్నారు. అదే కనుక, నోట్ల రద్దును బాబు సమర్థించడాన్నిమీరు సమర్థిస్తున్నారా? అని అడిగిచూడండి..అడగరు. ఈ సర్వేశ్వరుల వ్యవహారం ఇలాగే వుంటుంది. తమకు ఏ విధమైన సమాధానం కావాలో, అందుకు అనుగుణంగా ప్రశ్నలు డిజైన్ చేయడం అన్నది ఈ సర్వేజనాల ప్రత్యేకత.

నోట్ల రద్దుకు తానే కారణం అని తన లేఖే కారణం అని బాబు గొంతు చించుకుంటారు. కానీ సర్వేలో మాత్రం బాబు కారణం కాదు మోడీ అని తేలుతుంది. తెలంగాణలో కూడా బాబు గతంలో ఇలాంటి వైఖరే కనబర్చారు. తన లేఖ కారణంగానే తెలంగాణ వచ్చిందని అప్పట్లో తెలంగాణలో చెప్పేవారు. ఆంధ్రకు వచ్చిన తరువాత తెలంగాణ విభజనకు కాంగ్రెస నే కారణం అనేవారు. ఇప్పుడు నోట్ల పై కూడా ఇలాంటి డ్యాన్సే ఆడుతున్నారు.

మోడీ భారమైపోయాడా?

2014 ఎన్నికల వేళ మోడీ, రాజ్ నాధ్ సింగ్ చుట్టూ చంద్రబాబు ఎన్ని ప్రదక్షిణలు చేసారో జనం ఇంకా మరిచిపోలేదు. పదే పదే ఢిల్లీ వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి, మొత్తానికి మోడీతో పొత్తు సాధించిన సంగతి గుర్తున్నదే. కానీ ఇప్పుడు మోడీ భారమైపోయినట్లు కనిపిస్తోంది. గడచిన కొన్నాళ్లుగా భాజపాను ఆంధ్రలో బదనామ్ చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది.

ఆంధ్రలో భాజపాతో వున్న ఆబ్లిగేషన్ ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే.ఆయనకు ఏమీ పెద్దగా సమస్య లేదు. భవిష్యత్ లో కేంద్రంలో భాజపా రాకపోయినా, ఆంధ్రలో బాబు వున్నంతకాలం వెంకయ్య హవా నడుస్తుంది. అందువల్ల ఇక భాజపాను ఎంత బద్ నామ్ చేసినా, వెంకయ్య ఏమీ ఫీలవరు. అయితే అలా తాము వదిలేసిన భాజపా మాత్రం మరెవరికీ పనికి రాకూడదు. అందుకే ఆ పని తమ ఔట్ సోర్సింగ్ రాజకీయ వేత్త పవన్ కళ్యాణ్ పై పెట్టారు.

ఆయన అదే పనిగా భాజపాను, కేంద్రాన్ని, ఎంపీలను విమర్శించడం మొదలు పెట్టారు. ఆ విధంగా భాజపాను నానా భ్రష్టు పట్టించి, ఎవరికీ పనికి రాకుండా చేస్తే, వైకాపా ను ఢీకొని తెదేపా అధికారంలోకి వచ్చేయచ్చు. హోదా, విభజన, జోన్ ఇలాంటి వాటి విషయంలో పాపాలు అన్నీ భాజపా ఖాతాలోకి తోసేసి బాబు పునీతుడైపోవచ్చు. 

పవన్ తమతోనే

భాజపాను ఎలాగైతే వేరు కాపురానికి సాగనంపాలని చూస్తున్నారో, అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను బయటకు వెళ్లకుండా చూస్తున్నారు. పవన్ పార్టీ పోటీ చేయాలి. కానీ స్వంతగా కాదు, తేదేపాతో పొత్తు పెట్టుకుని, అంటే 2014లో భాజాపా ఓట్లు ఏ విధంగా తమ ఖాతాలోకి లాక్కున్నారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఓట్లు అలా తమ ఖాతాలోకి వేసుకోవాలన్నది తేదేపా ప్లాన్. అలా జరగాలంటే, జనసేనకు వేరు కాపురం అయిడియా రాకూడదు. అలా జరగాలంటే, జనసేన బలం అంతంత మాత్రమే. అది అధికారం అందుకోవడానికి అస్సలు పనికి రాదు అని పదే పదే నొక్కి వక్కాణించాలి. అంటే బాపనోడి దగ్గర వున్న మేకపిల్ల ను  మేక కాదు, కుక్క అని పదే పదే చెప్పి నమ్మించినట్లు నమ్మించాలి.

వదిలేయచ్చుగా?

నిజమే పవన్ కు బలం లేదు అనుకుందాం. మూడు శాతమో, నాలుగు శాతమో ఓట్లు మాత్రమే వస్తాయనుకుందాం. మరి అతగాడిని వదిలేయచ్చుగా. భీష్ముడిని చంపడానికి శింఖండిని ముందు వుంచుకున్నట్లు జగన్ కు అడ్డంగా పవన్ ను వుంచడం ఎందుకు? ఎక్కడ పవన్ వైపు వెళ్లిపోతారో అని కాపులను దువ్వడం ఎందుకు?  సర్వేశ్వరుల ఆలోచన, సర్వేల్లో వెల్లడయిన విషయాలు, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు అనుగుణంగా వున్నాయని, రాష్ట్ర రాజకీయాలతో జస్ట్ అంతంత మాత్రం పరిచయం వున్న వారికి కూడా అర్థమైపోతుంది. 

కళ్లు మూసుకుని

పిల్లి కళ్లు మూసుకుని, తనను ఎవరూ చూడడం లేదనుకుంటుంది. తెలుగుదేశం అనుకూల మీడియా వ్యవహారం కూడా అలాగే వుంది. తమ ఆలోచనలు, తమ సర్వే లొగుట్టు జనం కనిపెట్టలేరనుకుంటోంది. కానీ జనం తెలివి మీరారు. ఎటొచ్చీ కొంత వరకు మీడియా మాటలు ఇంకా నమ్ముతున్నారు. ఆ నమ్మకం మీద భరోసా వుంచి అల్లిన కట్టుకథలు తప్ప, ఈ సర్వే మరేమీ కాదు. 23 ఊళ్లలో, జస్ట్ కొన్ని పదుల మంది అభిప్రాయాలు తెలుసుకునేందుకు, తమకు అనుకూలమైన సమాధానాలు రాబట్టేందుకు, తమ చిత్తానికి ప్రశ్నలు తయారుచేసి, ఫైనల్ ప్రొడక్ట్ ఇదంటూ జనం చేతిలో పెట్టే ప్రయత్నం తప్ప ఇది మరేమీ కాదు అని క్లియర్ గా అర్థమైపోతోంది.

Show comments