ఏపీలో బీజేపీ మెడకి ప్రత్యేక 'ఉచ్చు'.!

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి రానుందా.? ఈ పాపంలో భాగం పంచుకుంటూ, ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజానీకాన్ని వంచనకు గురిచేస్తుంది.? రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయి.? 

ఇలా పలు ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటిదాకా అంత తీవ్ర స్థాయిలో 'ఒత్తిడి' లేదన్నది కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఈ స్థాయిలో ప్రత్యేక హోదా గురించిన చర్చ జరుగుతోందంటే అది వైఎస్‌ 'ఆత్మ' కేవీపీ రామచంద్రరావు పుణ్యమే. రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు మెంబర్‌ బిల్లుని కేవీపీ పెట్టకపోయి వుంటే, 'ప్రత్యేక హోదా సంజీవని ఏమీ కాదు..' అన్న చంద్రబాబు మాటల చుట్టూనే రాజకీయం 'మమ' అన్పించేసేది. 

కారణాలేవైతేనేం, ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. రేపు ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదులు విధుల్ని బహిష్కరిస్తున్నారు. ఉద్యోగ సంఘాలపైనా ప్రత్యేక హోదా ఒత్తిడి పెరుగుతోంది. విద్యార్థి సంఘాలూ ఉద్యమబాట పడ్తున్నాయి. ఇంకోపక్క, రేపు రాజ్యసభలో కేవీపీ ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం వుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ తమ ఎంపీలకు విప్‌ కూడా జారీ చేసింది. 

తాజా పరిణామాల్ని ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేతలు కూడా కాస్త సీరియస్‌గానే పరిశీలిస్తున్నారు. బీజేపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అయితే, ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందనీ, ఈ ఎపిసోడ్‌లో విపక్షాల ఒత్తిడి ఫలించినట్లేననీ, అధికార తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా విషయంలో మునుపటికన్నా కాస్త జోరు పెంచిందనీ, ఈ పరిస్థితుల్లో వెనక్కి తగ్గితే బీజేపీకి కాస్తో కూస్తో నష్టం కలిగే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.  Readmore!

ఇప్పటిదాకా ఏపీ బీజేపీ నేతలు ఎవరూ ప్రత్యేక హోదాకి అనుకూలంగా మాట్లాడలేదు. ఇప్పటిదాకా.. అంటే, 2014 ఎన్నికల తర్వాత. అసలు ప్రత్యేక హోదా అన్న పదాన్ని తెరపైకి తెచ్చిందే బీజేపీ. నమ్మించి గొంతు కోయడం.. అన్న చందాన బీజేపీ, ప్రత్యేక హోదా అంశానికి పాతరేసిందనుకోండి.. అది వేరే విషయం. పరిస్థితులు ఈ స్థాయికి బీజేపీని దిగజార్చేస్తాయని ఏపీ బీజేపీ నేతలు ఇప్పటిదాకా అంచనా వేయలేకపోయారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ఇంకా అదే మొండిపట్టుదలతో బీజేపీ అధిష్టానం వుంటే, 'మా దారి మాదే..' అనేందుకూ కొందరు బీజేపీ నేతలు సమాయత్తమవుతున్నారట. ఇదిలా వుంటే, బీజేపీ నేత, మంత్రి మాణిక్యాలరావు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అవసరమే లేదని తెగేసి చెబుతుండడం గమనార్హం. 

ఏదిఏమైనా, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరగడం ఖాయం. రేపే, కీలకమైన ఘట్టం చోటుచేసుకునే అవకాశముంది. గతంలోలా రేపు కూడా బీజేపీ, రాజ్యసభలో ప్రైవేటు బిల్లుని దాటవేస్తే, ప్రత్యేక హోదా ఉద్యమానికి మరింత ఆజ్యం పోసినట్లే అవుతుంది. ఆ మంటల్లో ముందుగా కాలి బూడిదైపోయేది భారతీయ జనతా పార్టీయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

Show comments

Related Stories :