తప్పొప్పుకోలేక తప్పుచేస్తున్నారా.?

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ తనయుడు నిషిత్‌, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. అత్యంత ఖరీదైన కారు, అత్యంత వేగంతో అర్థరాత్రి వేళ నిబంధనల్ని ఉల్లంఘించి మరీ పరుగులు తీసింది.. ఆ కారే, నితీష్‌ మరణానికి కారణమయ్యింది. నిజానికి, ప్రమాదానికి కారు కారణమే అయినా, ఆ కారుని అంత వేగంగా నడిపి ప్రమాదం కొనితెచ్చుకున్నది మాత్రం మృతుడు నిషిత్‌ అన్నది నిర్వివాదాంశం. 

మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో అత్యాధునిక సౌకర్యాలున్నాయి. భద్రతా ప్రమాణాల విషయంలో ఆ సంస్థ అస్సలు రాజీ పడే ప్రసక్తే వుండదు. కానీ, ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. సెకెనులో సగం వంతు సమయంలోనే కారు ప్రమాదానికి గురయ్యింది. అంటే, అదుపు తప్పిన అర సెకెనులోనే కారు మెట్రోపిల్లర్‌ని ఢీకొట్టిందన్నమాట. 

205 కిలోమీటర్ల వేగం వద్ద స్పీడో మీటర్‌ ఆగిపోవడం చూస్తే, కారు అదే వేగంతో పయనిస్తున్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కానీ, పోలీసులు మాత్రం ఆ వేగం గంటకు 145 కిలోమీటర్లు మాత్రమేనని సంకేతాలు పంపుతున్నారు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణించి, ప్రమాదానికి గురైతే ఈ స్థాయిలో ప్రాణ నష్టం అసాధ్యమనీ, బెంజ్‌ కారుకి వుండే భద్రతా ప్రమాణాలు అలాంటివన్నది నిపుణుల వాదన. 

మొదటినుంచీ ఈ కేసులో కారుదే తప్పన్నట్టు కథనాలు తెరపైకొస్తున్నాయి. అది జస్ట్‌ ఓ యంత్రం మాత్రమే. అది పూర్తిగా దుర్వినియోగమయ్యిందిక్కడ. పోయిన ప్రాణం ఎలాగూ తిరిగిరాదు. కానీ, ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదంటే నిజానిజాలు వెలికిరావాలి. ప్రమాదానికి కారణం మానవ తప్పిదమన్న విషయం వెలుగుచూడాలి. కార్ల వేగానికి కళ్ళెం పడాలి. అంతే తప్ప, కారుదే తప్పంటూ తప్పించుకునే ప్రయత్నం జరగడం అస్సలేమాత్రం సమంజసం కాదు.

Show comments