మౌనమోడీ.. పెదవి విప్పుతారట.!

మౌనమోడీ.. అవును, ఇది పార్లమెంట్‌ వెర్షన్‌.! ఈ మోడీ ఇప్పుడు పార్లమెంటులో ఎట్టకేలకు పెదవి విప్పాలని నిర్ణయించుకున్నారట. 'ఇలాగైతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చెయ్యడం బెటర్‌..' అని సాక్షాత్తూ బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ వ్యాఖ్యానించిన తర్వాత, నరేంద్రమోడీ పార్లమెంటులో మాట్లాడకుండా ఎలా వుంటారు.? 

అసలంటూ ప్రజాస్వామ్యాన్నే నరేంద్రమోడీ అవమానిస్తున్నారు, ప్రధాని అయి వుండీ ఆయన పార్లమెంటులో ఎందుకు మాట్లాడటంలేదు.? అన్న ప్రశ్నలతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. జనం కోసం కాకపోయినా, పార్టీ కోసమైనా మాట్లాడేస్తే పోలా.? అనుకున్నట్టున్నారు నరేంద్రమోడీ. నేటితో పార్లమెంటు సమావేశాలు ముగియనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆఖరి రోజు ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడతారట. 

అయితే, నరేంద్రమోడీ మాట్లాడేది పెద్ద పాత నోట్ల రద్దు గురించాలా.? లేదంటే, కాంగ్రెస్‌ని ఇరుకునపెట్టే అగస్టా కుంభకోణం గురించా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. పెద్ద పాత నోట్ల రద్దుపై మాట్లాడటానికి నరేంద్రమోడీ దగ్గర మేటర్‌ లేదు. ఇది క్లియర్‌. కాబట్టి, అగస్టా గురించే ఆయన మాట్లాడొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ప్రధాని పెద్ద పాత నోట్ల రద్దుపై మాట్లాడకపోతే, చివరి రోజు పార్లమెంటు సమావేశాలు కూడా సజావుగా సాగనివ్వకూడదని విపక్షాలు భావిస్తున్నాయి. 

ఇదిలా వుంటే, పార్లమెంటు సమావేశాల్ని పొడిగించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తుండడంతో, ఆ దిశగా కీలక నిర్ణయం ఈ రోజు ఏమన్నా వస్తుందా.? అన్న ఉత్కంఠ కూడా నెలకొంది.  Readmore!

ఏదిఏమైనా, దేశ చరిత్రలో ఓ ప్రధాని ఓ పార్లమెంటు సెషన్‌లో పూర్తిగా మాట్లాడకపోవడమంటే అది సరికొత్త చెత్త రికార్డుగానే భావించాలేమో.!

Show comments