అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత పదవిని శశికళ చేపట్టి కనీసం మూన్నాళ్లైనా కాలేదు.. అప్పుడే ముఖ్యమంత్రి పదవి దిశగా శరవేగంగా కదులుతున్నాయి ఆమె పావులు. జయ మరణానంతరం శశి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనే మాట కొంతమంది అన్నాడీఎంకే నేతల నుంచి వినిపిస్తూనే ఉన్నా.. పార్టీ సుప్రిమో బాధ్యతలు చేపట్టాకా ఈ దాడి మరింత పెరిగింది. పన్నీరును దించేసైనా.. శశిని ముఖ్యమంత్రిగా చేయాలనే వారు ఎక్కువవుతున్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షల్లోనే ఇలాంటి స్పందనలు వ్యక్తం కావడం విశేషం. పన్నీరు క్యాబినెట్ లో ఉంటూ.. శశికళ ముఖ్యమంత్రి కావాలని వారి సంఖ్య ఐదుకు పెరిగింది. ఇది వరకూ ఈ నంబర్ మూడుగా ఉండేది. క్యాబినెట్ లోని మంత్రుల నుంచి ఈ తరహా మాట వినిపిస్తూ ఉండటం.. నిప్పు రగులుకుంటోందనేందుకు తార్కాణంగా మారింది.
జయ మరణంతో ఆర్కే నగర్ స్థానం ఖాళీ అయ్యింది. అక్కడ నుంచి పోటీ చేయడానికి ఇప్పటికే శశికళ రంగం సిద్ధం చేసుకుంది. మంత్రులు ఈ మాట కూడా చెప్పారు. ఆర్కే నగర్ నుంచి శశికళే పోటీ చేయాలని వారు డిమాండ్ చేసేశారు!
వీరి ‘విజ్ఞప్తి’ ని శశి కాదనకపోవచ్చు కూడా! ఆర్కే నగర్ ఉప ఎన్నిక కన్నా ముందే, శశికళ సీఎం పీఠాన్ని చేపట్టినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. పన్నీరును ఎలా దించుతారు? అనేదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. పార్టీ అధ్యక్ష బాధ్యతలను శశి చేపట్టడం పట్ల ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని పన్నీరు.. శశి కోరింది కదా అని, సీఎం పీఠాన్ని అప్పగించేసి ‘నీ సుఖమే నే కోరుతున్నా…’ అంటూ వెళ్లిపోతాడా?
లేక పట్టుబట్టి.. పంచె లాగి.. పన్నీరును దించేస్తారా? అలా జరిగితే.. కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటుందా, పన్నీరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి వచ్చాడు, జయలలిత- శశికళ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులూ జరిగాయి. కేంద్రం అండ పన్నీరుకు ఉందనేందుకు ఆ ఐటీ దాడులే తార్కాణం. మొత్తానికి తమిళ రాజకీయాలు మరింత రసకందాయకంలో పడబోతున్నాయి!