అన్ని పార్టీలను వేధిస్తున్న సమస్య ఒక్కటే...!

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పార్టీ ఎన్నికల ఆలోచనే చేస్తోంది. ఎన్నికలకు సుమారుగా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ కసరత్తు జోరుగా సాగిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు వాటి పరిస్థితిని బట్టి వివిధ సమస్యలు ఉన్నప్పటికీ దాదాపుగా అన్ని పార్టీలను వేధిస్తున్న సమస్య ఒకటుంది. అదే 'ఎన్నికల్లో పొత్తు'. పార్టీలన్నీ పొత్తులపై యమ ఆలోచిస్తున్నాయి. బహుశా తెలుగు రాష్ట్రాల్లో టీఆర్‌ఎస్‌ మినహా మిగిలిన పార్టీలన్నింటికీ పొత్తులు అవసరం కావొచ్చు.

అయితే ఒకే పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా? అంటే చెప్పలేం. ఉదాహరణకు.... తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పొత్తుల గురించి ఆలోచిస్తోంది. కాని ఆంధ్రాలో ఆ పార్టీ ఇప్పటివరకు పొత్తుపై ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు లేవు. తెలంగాణలో టీడీపీతో సంబంధాలు తెంచుకున్న బీజేపీ ఆంధ్రాలో పొత్తు కొనసాగిస్తోంది. పొత్తుల విషయంలో పార్టీలకు ఉమ్మడి విధానమంటూ లేదు. ఆయా రాష్ట్రాల్లో ఉండే పరిస్థితిని బట్టి వ్యవహరిస్తాయి. 

తెలంగాణలో టీడీపీ నాయకులు అవసరమైతే కాంగ్రెసుతోనైనా పొత్తు పెట్టుకుంటామంటున్నారు. ఎందుకు? టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యం కాబట్టి ఆ పార్టీతో పొత్తుకు అభ్యంతరం లేదంటున్నారు. అదే టీడీపీకి ఆంధ్రాలో కాంగ్రెసు శత్రువు. తెలంగాణలో టీడీపీ, బీజేపీ విడిపోయినా ఆంధ్రాలో ఇప్పటివరకైతే కలిసున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా? చేయవా? అనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో వైఎస్సార్‌ కాంగ్రెసు పరిస్థితిపై ఎలాంటి వార్తలూ లేవు. కాని ఆంధ్రాలో అది పొత్తులపై కసరత్తు చేస్తోంది. పొత్తు లేకుండా వైకాపా గెలవడం సాధ్యం కాదని ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సలహా ఇచ్చారు. వైకాపా కమలం పార్టీకి దగ్గరవుతున్నట్లు ఈమధ్య ఎక్కువ ప్రచారం జరుగుతోంది. దీనిపై టీడీపీ నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 

బీజేపీతో విడిపోతే గెలుపు సాధ్యం కాదనే అభిప్రాయంతో ఉన్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు కొనసాగించాలని టీడీపీ, కొత్తగా పొత్తు పెట్టుకోవాలని వైకాపా అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి కాబట్టి ఆ పార్టీ కీలకంగా మారిందని అనుకోవచ్చు. ఇక పవన్‌ కళ్యాణ్‌ 'జనసేన' రంగంలోకి దిగితే దాంతో పొత్తు కోసం పార్టీలు పోటీ పడతాయేమో...! బీజేపీ జగన్‌ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలొస్తున్నప్పటికీ అది పవన్‌ పార్టీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

గతంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడిని తీవ్రంగా విమర్శించారు. బీజేపీకి పవన్‌ దూరం కావడానికి వెంకయ్యే కారణమనే అభిప్రాయం ఆ పార్టీలోని ఓ వర్గంలో ఉంది. ఇప్పుడు వెంకయ్య అడ్డు తొలగిపోయింది కాబట్టి పవన్‌ను కమలం పార్టీ వైపు తిప్పుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం కాపుల ఓట్లు కొల్లగొట్టాలనే వ్యూహం.

ఇది ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందో తెలియదు. ఒకవేళ అయితే చంద్రబాబుకు ఇబ్బందే. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పొత్తులు లేకుండా మనుగడ సాగించడం, ఎన్నికల్లో పోటీ చేయడం అసాధ్యం. ఆ రెండు పార్టీలూ పొత్తులపై ఆలోచిస్తున్నాయి. ఆ రెండు కలిసి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకపోవచ్చు. పవన్‌గాని, జగన్‌గాని కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకోవల్సివస్తే సీపీఎంకు ప్రాధాన్యం ఇస్తారు.

పవన్‌ గతంలో బహిరంగ సభల్లో ప్రసంగించినప్పుడు సీపీఎంవైపు మొగ్గు చూపారు. పవన్‌ ఓకే అంటే సీపీఎం ఎగిరి గంతేస్తుంది. ఈ పార్టీ గతంలో జగన్‌కు కూడా అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు పొత్తుల బాధ లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను పూర్తిగా ఊడ్చేస్తామని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. పాత పార్టీలైనా, కొత్తగా పుట్టే పార్టీలైనా పొత్తులు లేకుండా రాజకీయాలు చేయలేవు

Show comments