పద్మావతీ.. అసలు కథేంటీ.?

ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ ఏదన్నా సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా వుంటాయి. గతంలో ఆయన రూపొందించిన చిత్రాలు అలాంటివి మరి. ఆయన ఎంచుకునే కథలు, వాటిని ఆయన తెరకెక్కించే విధానం.. ఇవన్నీ అబ్బో సూపర్బ్. మెగా మేకర్‌గా సంజయ్‌ లీలా భన్సాలీకి బాలీవుడ్‌లో పేరు ప్రతిష్టలున్నాయి. తాజాగా, ఇప్పుడాయన పేరు ఇంకోసారి దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కారణం, ఆయన తెరకెక్కిస్తున్న 'పద్మావతి' సినిమానే. 

ఇంతకీ, ఈ 'పద్మావతి'లో ఏముంది.? ప్రస్తుతానికైతే ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. కానీ, సినిమా వివాదస్పదమయ్యింది. ఇది చారిత్రక గాధ.. అని సంజయ్‌ లీలా భన్సాలీ చెబుతుండడంతోనే వివాదం తెరపైకొచ్చింది. రాజ్‌పుట్‌ వంశానికి చెందిన పద్మావతి పేరు పెట్టి, ఇది 'చారిత్రక సత్యాల ఆధారంగా తీస్తున్న సినిమా' అని సంజయ్‌ లీలా భన్సాలీ చెబుతున్నాడు. అసలు, భన్సాలీ చెబుతున్న కథకీ, చరిత్రకీ పొంతనే లేదన్నది సినిమాని వ్యతిరేకిస్తున్నవారి వాదన. 

సినిమాలో ఏమందో సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.. ఈలోగా ఈ రచ్చ ఏంటి.? అంటాడు భన్సాలీ. అలా వివాదం ముదిరి పాకాన పడింది. 'పద్మావతి' టీమ్‌ మీద ఇటీవల దాడి కూడా జరిగింది. చిత్తార్‌ఘడ్‌ రాజు రావల్‌ రతన్‌సింగ్‌ భార్య పద్మావతి అందచందాల గురించి తెలిసి, ఆమె కోసం పరితపించిపోతాడు ముస్లిం అల్లావుద్దీన్‌ ఖిల్జీ. ఖిల్జీ - రతన్ సింగ్ యుద్ధంలో తలపడ్తారు. రాజులన్నాక రాజ్యాలు, ఆ తర్వాత యుద్ధాలు మామూలే కదా. ఖిల్జీ చేతిలో రతన్‌ సింగ్‌ ఓడిపోవడం, ఆ తర్వాత పద్మావతి ఆత్మాహుతికి పాల్పడం జరిగిపోతాయి. 

అయితే, చరిత్రలో పద్మావతి మహోన్నతమైన వ్యక్తిత్వమున్న స్త్రీ కాగా, ఆమెను అసభ్యకరంగా సినిమాలో చూపిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సంజయ్‌ లీలా భన్సాలీ వెర్షన్‌ ఇంకోలా వుంది. ఆమె ఘనత గురించి ఇంకా ఘనంగా చెప్పే చిత్రమే తప్ప, ఎక్కడా కించపర్చే సన్నివేశాలు వుండవని ఆయన అంటున్నాడు. ఎవరి గోల వారిదే. 'సినిమా కథేంటో చెప్పాలి.. అందులో పద్మావతి పాత్ర గురించి మాకు తెలియాలి.. అసలు సినిమా కథే మార్చెయ్యాలి.. పద్మావతి టైటిల్‌ కూడా మార్చెయ్యాల్సిందే..' అనే డిమాండ్లు తెరపైకొస్తున్నాయి ఆందోళనకారుల నుంచి. 

ఇంత గోల ఎందుకు.? ఇది కల్పిత కథ.. అనేస్తే సరిపోతుందన్నది భన్సాలీకి కొందరు ఇస్తోన్న సలహా. కానీ, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'పద్మావతి' సినిమాకి సంబంధించి ఏ వివాదాన్నయినాసరే ధైర్యంగా ఫేస్‌ చేస్తాను తప్ప, రాజీ పడే ప్రసక్తే లేదని భీష్మించుక్కూర్చున్నాడాయన. మరి, ఈ వివాదం ఎలా కంచికి చేరుతుంది.? వేచి చూడాల్సిందే.

Show comments