అఖిల ప్రియా.. ఏం సెప్తిరి.!

ఎంతైనా చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేస్తున్నారు కదా.. ఆయనగారికి మాత్రమే పరిమితమైన కొన్ని 'వైపరీత్యాలు' మిగతా మంత్రులకీ తేలిగ్గానే వంటబట్టేస్తాయ్‌.! అనూహ్యంగా ఎమ్మెల్యే అయిన అఖిల ప్రియ, అంతే అనూహ్యంగా మంత్రి అయ్యారు. ఆమె ఇప్పుడు అచ్చంగా, చంద్రబాబులా మాట్లాడుతున్నారు. చంద్రబాబు తానే కంప్యూటర్లను కనిపెట్టానన్నట్లు మాట్లాడుతుంటారు. అభివృద్ధికి తానే కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పుకుంటుంటారు. అఖిలప్రియ కూడా ఇప్పుడు అదే రూట్‌లో పయనిస్తున్నారు. 

టీడీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డి, టీడీపీకి గుడ్‌ బై చెప్పి, వైఎస్సార్సీపీలో చేరుతున్న విషయం విదితమే. కర్నూలు జిల్లాలో శిల్పా వర్సెస్‌ భూమా రగడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వైఎస్సార్సీపీకి గుడ్‌ బై చెప్పి, భూమా కుటుంబం టీడీపీలో చేరాక, ఆ పార్టీలో ఇమడలేక శిల్పా బ్రదర్స్‌ పడ్డ పాట్టు అన్నీ ఇన్నీ కావు. ఇక ఇలా కాదనుకుని, శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీలోకి జంప్‌ చేసేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 

ఈ వ్యవహారంపై మంత్రి హోదాలో స్పందించిన అఖిలప్రియ, నంద్యాల నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ మారుతున్నారని సెలవిచ్చారు. అఖిల ప్రియ నియోజకవర్గం ఆళ్ళగడ్డ. పోనీ, మంత్రి అయ్యాక నంద్యాలను ఉద్ధరించేస్తున్నారని అనుకుందామన్నా.. ఆమె మంత్రి అయ్యిందే ఈ మధ్యన. ఆ లెక్కన, నంద్యాలలో ఈ మధ్యకాలంలోనే అంత గొప్ప అభివృద్ధి ఎలా జరిగిపోయిందబ్బా.? 

ఇంకా నయ్యం, తాను మంత్రి అయ్యా నంద్యాల నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గమనో, లేదంటే సింగపూర్‌ స్థాయిలో నంద్యాలను అభివృద్ధి చేసేశాననో చంద్రబాబు తరహాలో కబుర్లు చెప్పేయలేదు. ఏమో, ముందు ముందు ఆ కబుర్లూ అఖిల ప్రియ నోట వింటామేమో.! ఎందుకంటే, డైరెక్షన్‌ అంతా చంద్రబాబుదే కదా.!

Show comments