'మేనత్త'లా ఉంటే గెలుపు వరిస్తుందా?

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తాను గెలుస్తాననే అనుకుంటాడు. అందుకు ఆయన/ఆమెకు ఉండాల్సిన కారణాలుంటాయి. తాము ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో ఆ పార్టీ విధానాలు, పార్టీ అధినేత ఇమేజ్‌, వ్యక్తిగతంగా తనకు ప్రజల్లో ఉన్న ఆదరణ...ఇలాంటివన్నీ గెలుపునకు కారణమవుతాయి. కాని ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ఒక మహిళ తనలో తన మేనత్త పోలికలు ఉన్నందువల్ల తాను గెలుస్తానని నమ్ముతోంది. ఇందుకు కారణం? రాజకీయంగా ఆమెకు ఎటువంటి చరిత్ర లేకపోవడమే కాకుండా ఆమెకు ఏ రాజకీయ పార్టీ అండదండలు లేవు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోందన్నమాట. ఈమె దీపా జయకుమార్‌. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు. జయ మరణంతో ఖాళీ అయిన చెన్నయ్‌లోని ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 12న జరగబోయే ఉప ఎన్నికలో ఆమె పోటీ చేస్తోంది. ఎవ్వరి అండదండలూ లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగినందుకు మెచ్చకోవాల్సిందే. కాని గెలుపు అనుమానమేనని పరిశీలకులు చెబుతున్నారు.

జయలలిత అపోలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు దీపా జయకుమార్‌ తెర మీదికి రావడంతో జయలలితకు ఓ మేనకోడలుందని జనాలకు తెలిసింది. ఆమె రాజకీయాలకు, ఆస్తిపాస్తుకు తాను, తన తమ్ముడు వారసులమని ప్రకటించింది. జయలలిత మరణించగానే ఆమె స్నేహితురాలు శశికళపై ఒంటికాలిపై లేచింది. జయ మరణం వెనక లోగుట్టను బయటపెడతానంది. అప్పట్లో మీడియా ఆమెకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో ఇంటర్వ్యూలు  వచ్చాయి. ఆమెలో జయలలిత పోలికలు ఎక్కువగా ఉండటంతో శశికళ వ్యతిరేకులు, జయ అభిమానులు దీపకు బ్రహ్మరథం పట్టారు. ఆమె పేరుతో అభిమాన సంఘాలు పెట్టారు. ఆమె ఇంటిముందు పడిగాపులుగాసి రాజకీయాల్లోకి రావాలని అభ్యర్థించారు. దీపలో అమ్మను చూసుకుంటున్నామన్నారు. దీపను చిన్నమ్మకు గట్టి పోటీదారుగా తయారుచేస్తామన్నారు. తన రాజకీయరంగ ప్రవేశాన్ని ఎవ్వరూ ఆపలేరని ప్రకటించిన మేనకోడలు సొంత పార్టీ పెట్టబోతున్నట్లు  ప్రకటించినా చివరకు  రాజకీయ ఫోరం ఏర్పాటు చేసింది. అప్పట్లో  ఆమె ఇంటి దగ్గరే కాకుండా, నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. ఫెక్సీలు ఏర్పాటు చేశారు. శశికళకు అన్ని రకాలుగా సమర్థత ఉందని ఆమె మద్దతుదారులు చెప్పుకున్నట్లుగానే దీప సర్వ సమర్థురాలని ఆమెకు మద్దతు ఇచ్చినవారు చెప్పుకున్నారు. 

ఈ పరిణామాలన్నీ మేనకోడలిలో ఒకవిధమైన నమ్మకం పెంచాయి. తాను మేనత్తలా ఉండటం అదృష్టమని, తనలో వారు జయను చూసుకుంటున్నారు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఆదరిస్తారని అనుకుంది. దీపలో జయ పోలికలుండటం, ఆమె అమ్మ మేనకోడలు కావడంతో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు శెల్వం ఆమెన తమ వర్గంలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. మొదట శశికళకు మద్దతు ఇచ్చి ఆ తరువాత తిరుగుబాటు జెండా ఎగరేసిన పన్నీరుకు దీప మద్దతు ఇచ్చింది. దీంతో ఆమె ఆయన శిబిరంలోకి వెళుతుందని అనుకున్నారు. కాని ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక ప్రకటించిన తరువాత తాను స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె పన్నీరు వర్గంలో చేరివుంటే అందులో సీనియర్లు ఉన్నారు కాబట్టి పోటీ చేసే అవకాశం రాకపోయేది. మేనత్తలా ఉన్న తాను పోటీ చేస్తే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని ధీమాగా ఉన్న దీప పన్నీరును కాదనుకుంది. ఆయన మీద కూడా ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆమె జయ పోలికలను నమ్ముకొని ప్రచారం చేస్తోంది. కాని మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కడంలేదు.

జనం ఆసక్తి అంతా శశికళ, పన్నీరు వర్గాల పోటీ మీదనే ఉంది. బలమైన అన్నాడీఎంకేలో విభేదాలు రావడం, రెండు వర్గాలుగా విడిపోవడం, ఎన్నికల  చిహ్నాన్ని స్తంభింపచేయడం, పార్టీ పేరు కూడా ఉపయోగించుకోకుండా నిషేధం విధించడం...ఇదంతా ఆసక్తికరం, ఉత్కంఠభరితం. ఈ నేపథ్యంలో దీపను జనం పట్టించుకోవడంలేదు. ప్రజలకు చెప్పుకోవడానికి కూడా ఆమెకు ఏమీ లేదు. 'నిన్ను చూస్తే అమ్మను చూసినట్లే అనిపిస్తోంది' జనం అంటున్నారు. కాని ఎంతవరకు ఓట్లు పడతాయో తెలియదు. ఆమె పెట్టిన రాజకీయ వేదిక మూడునాళ్ల ముచ్చటగా ముగిసిందనిపిస్తోంది. ఆమె భర్తే దాన్నుంచి వెళ్లిపోయాడు. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు భర్త, సోదరుడి అండ లేకుండాపోయింది. ఎన్నికల అఫిడవిట్‌లో దీప భర్త పేరు కూడా రాయలేదట..! బరిలో ఉన్న అభ్యర్థులు అవినీతిపరులని, అందుకే ప్రజలు తనను ఎన్నికుంటారని చెబుతోంది. మండుతున్న ఎండలో ప్రచారం చేస్తూ అలసిసొలసిపోతున్న దీపా జయకుమార్‌ భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి...!

Show comments