పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం 'కాటమరాయుడు' సినిమా చేస్తున్నాడు. చేస్తున్నాడంటే, చేస్తున్నాడంతే. ఆ సినిమా ఎక్కడదాకా వచ్చింది.? అనడక్కండి.. అదో సస్పెన్స్. నిర్మాత శరద్ మరార్, సంగీతం అందిస్తున్నది అనూప్ రుబెన్స్, దర్శకుడు కిషోర్‌కుమార్ పార్దసాని అలియాస్ డాలీ అని మాత్రం అందరకీ తెలుసు. ఆ తర్వాత పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే సినిమా చేస్తాడు.
సినిమా సంగతుల్ని పక్కన పెట్టి, రాజకీయాల విషయానికొద్దాం. జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ ఏం చేస్తున్నాడట.? ప్రస్తుతానికి కాకినాడలో త్వరలో నిర్వహించబోయే బహిరంగ సభ గురించి సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నాడని ఆనోటా ఈనోటా విన్పిస్తోంది. ఇంతకీ ఆ సన్నిహితులెవరు.? అని మాత్రం అడక్కూడదు. మళ్ళీ ఇది ఇంకో సస్పెన్స్. ఎందుకంటే, జనసేన పార్టీకి సంబంధించినంతవరకు పవన్‌కళ్యాణ్‌కి సన్నిహితులంటూ ఎవరూ లేరు మరి.
సెప్టెంబర్ 9వ తేదీన కాకినాడలో పవన్‌కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తారన్న ప్రచారమైతే జరుగుతోంది. దానికి ఎన్నో రోజులు టైమ్ లేదు. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయి వుండాలి. కానీ, ఒక్క పిలుపు ఇస్తే రాత్రికి రాత్రి లక్షల మంది అభిమానులు గుమికూడిపోతారని పవన్‌కి తెలుసు గనుక, ఏమో.. రానున్న రోజుల్లో ఆ సభపై క్లారిటీ వస్తుందేమో.!
ఇక, జిల్లాల పర్యటనల మాటేమిటి.? తిరుపతి బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్, తాను త్వరలో జిల్లాల పర్యటన చేపడ్తాడని చెప్పిన తర్వాత, ఆ దిశగా చాలా ప్రశ్నలే తెరపైకొచ్చాయి. పర్యటనలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బోల్డంత ఖర్చుతో కూడుకున్న పని. పర్మిషన్లు వంటివి అవసరం. టీడీపీనీ, బీజేపీనీ తిడతానంటే పర్మిషన్లు రావు. తిరుపతి బహిరంగ సభ విషయంలో పవన్ ఏం మాట్లాడతాడో తెలియక పోలీసులు అనుమతిచ్చారుగానీ, లేదంటే పై నుంచి వచ్చే ఒత్తిళ్ళతో ఆ సభ జరిగేదే కాదు.
అసలు భవిష్యత్తులో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వుండదు.. అని కేంద్రం సంకేతాలు ఇస్తున్న వేళ, ప్రత్యేక హోదా రానే రాదు.. ప్యాకేజీతోనే సరిపెట్టుకోవాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెబుతున్న ప్రస్తుత తరుణంలో.. పవన్‌కళ్యాణ్ ఇంకెన్నాళ్ళు జనసేనాధిపతిగా మౌనంగా వుంటారట.? తిరుపతిలో మొన్నే మాట్లాడేశాం కదా.. అంటే, ఈలోగా చాలానే జరిగాయి. ఇంతకీ, పవన్‌కళ్యాణ్ ఎక్కడ.? ఆ ఒక్కటీ అడగొద్దంతే.