జైట్లీ జీ.. భక్తులకు నచ్చేశారులెండి!

’ 22,500 ఏటీఎం మిషన్లు పనిచేసే స్థితికి తెచ్చేస్తున్నాం.. ఇంకెంత జస్ట్ ఇంకో లక్షా డెబ్బై ఏడు వేల ఐదువందల ఏటీఎం మిషన్లు పని చేసేలా చేయడమే మిగిలి ఉంది! వాటిల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసి, కొత్త నోట్లు పెట్టామంటే.. అయిపోయినట్టే.. ఇందులో కూడా షరతులు వర్తిస్తాయనుకోండి..!’’ ఇదీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన!

ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టుగా.. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వాళ్లను కేబినెట్ మంత్రులుగా చేసుకుంటే ఇలానే ఉంటుంది పరిస్థితి! నవంబర్ ఎనిమిదో తేదీన మారకంలో ఉన్న నోట్ల రద్దును అనౌన్స్ చేశారు. పద్దెనిమిదో తేదీన ఆర్థిక మంత్రి మీడియా ముందుకు వచ్చి చేసిన ప్రకటన ఇది!

సవాలక్ష షరతులతో పది శాతం ఏటీఎం మిషన్లలో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసే పనిని మొదలుపెట్టామని గురువారం ఆయన ప్రకటించాడు. ఇది ఇంకా మొదలుపెట్టిన పని మాత్రమే! గురువారానికి ఈ పదిశాతం మిషన్లూ పనిచేయడం మొదలుపెట్టవచ్చు.. అని మాత్రమే ఆయన వ్యాఖ్యానించాడు. ఈ పనిలో ఎన్నిక ఆటంకాలు ఉంటాయో, ఇవి నిజంగా ఎప్పటి నుంచి పని చేయడం మొదలుపెడతాయో.. ఆయన కూడా ష్యూరిటీ ఇవ్వలేదు!

పది రోజులు గడిచాకా.. పది శాతం ఏటీఎంలు పని చేయడం గురించి విత్త శాఖ మంత్రివర్యులు మాట్లాడుతున్నారు. ఒకవైపు జనాలు పనులు, ఉద్యోగాలు వదులుకుని ఏటీఎంల ముందు బారులు తీరిన నేపథ్యంలో,ప్రణాళిక లేని పని చేశారంటూ అన్ని వర్గాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. ఆదాయం పదో శాతానికి పడిపోయిందని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని చెబుతూనే, ఇంకా పది శాతం ఏటీఎం మిషన్లు పనిచేయడం గురించినే ప్రకటనలు!

ఈ పదిశాతం ఏటీఎంల నుంచి కూడా విచ్చలవిడిగా డబ్బులు డ్రా చేసుకోవడానికేం ఉండదు.. రెండు వేల రూపాయల పరిమితి మేరకే డ్రా చేసుకోవాలి. 

ఇక బ్యాంకుల్లో నగదు మార్పిడికి మొదట నాలుగు వేల రూపాయల పరిమితి పెట్టి, ఆ తర్వాత దానికి మరో ఐదు వందలు పెంచారు.. దాన్ని తిరిగి రెండు వేల రూపాయలకు తగ్గించారు! ఇదేంటి సార్.. అంటే ఆర్థికశాఖా మాత్యులు చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. ‘నిధులు దుర్వినియోగం జరగకూడదు..’ అని ఆ పరిమితిని రెండు వేల రూపాయలకు తగ్గించామని ఆయన తెలిపారు! భక్తులకు బాగా నచ్చే మాట ఇది.

Show comments