ప్రశాంతంగా ఉండనివ్వని 'ప్రశాంత్‌'...!

ఏ పార్టీలోనైనా సరే రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండరు. అనుక్షణం ఏవో టెన్షన్లు వారిని వెంటాడుతుంటాయి. సాధారణ ఎన్నికలు మరో ఏడాదో, ఏడాదిన్నరో ఉందనగానే ప్రశాంతత పూర్తిగా కరువైపోతుంది. ఇప్పుడు అన్ని పార్టీలతోపాటు వైఎస్సార్‌సీపీలోని నాయకులకూ ప్రశాంతత లేకుండాపోయింది. ముఖ్యంగా సీనియర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

వీరికి ప్రశాంతత లేకుండా చేసింది ఎవరూ? అధినేత జగన్మోహన్‌ రెడ్డియా? కాదు... వైకాపా రాజకీయ వ్యూహకర్త, సలహాదారు అయిన ప్రశాంత్‌ కిషోర్‌. ఆయనకు భారీగా పారితోషికం ముట్టజెప్పి వ్యూహకర్తగా పెట్టుకున్నది ఎందుకు? అవసరమైన వ్యూహాలు రచించి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు. ఆయన వ్యూహాలు కేవలం అధికార పార్టీని దెబ్బ కొట్టేందుకే కాదు. పార్టీలో సమూల మార్పులు చేసేందుకు కూడా.

ఈ క్రమంలో కొందరు పార్టీ నాయకులు సైతం నష్టపోక తప్పదు. ఇప్పుడు అదే జరగబోతోందని సమాచారం. పార్టీలో పలువురు సీనియర్లను పక్కన పెట్టాలని, యువరక్తం ఎక్కించాలని ప్రశాంత్‌ కిషోర్‌ అధినేతకు నివేదిక ఇచ్చారు. ఎవరెవరికి ముప్పుందో ప్రస్తుతానికి తెలియదుగాని, తలలు పండిన కొందరు నాయకులు పక్కకు జరగక తప్పదు. అంటే వీరికి టిక్కెట్లు ఇవ్వకపోవచ్చు. సహజంగానే సీనియర్లు టిక్కెట్లు ఆశిస్తారు. ఎక్కడెక్కడినుంచో వచ్చి పార్టీలో చేరేది టిక్కెట్లు ఆశతోనే.

అలాంటివారి ఆశలకు గండిపడే అవకాశముంది. నలభై నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలను పక్కకు పెట్టాలని, కోర్‌ కమిటీని ప్రక్షాళన చేయలని ప్రశాంత్‌ సలహా ఇచ్చారు. ఈ నలభై మందిలో ఉత్తరాంధ్రలోని ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు అధికార ప్రతినిధులూ ఉన్నారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులు కుంభకోణాల్లో పాత్రధారులట...! 130 నియోజకవర్గాల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిఫార్సు చేశారు.

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఇంకెన్ని సిఫార్సులు చేస్తారో...! ఏపీలో ప్రస్తుతానికి వైకాపా ఒక్కటే వ్యూహకర్తను నియమించుకుంది. ఎలాగైనాసరే వచ్చే ఎన్నికల్లో అధికారానికి రావడమే లక్ష్యంగా ప్రశాంత్‌ నియామకం జరిగిందనేది తెలిసిందే. ప్రశాంత్‌ నియామకం తరువాత అధికార టీడీపీలో జంకు ఉన్నప్పటికీ లైట్‌గా తీసుకున్నట్లు నాయకులు వ్యవహరిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఫెయిలైన ప్రశాంత్‌ ఏపీలోనూ ఫెయిలవుతాడని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైఎస్‌ జగన్‌ మరో రాహుల్‌ గాంధీ కావడం ఖాయమన్నారు. మంత్రి అన్నంతమాత్రాన అపజయం రాదు కదా. ఏపీలో ప్రశాంత్‌ విజయం సాధించినా, అపజయం మూగట్టుకున్నా దాని ప్రభావం ఆయన భవిష్యత్తుపై పడుతుంది. వైకాపాను గెలిపిస్తే భవిష్యత్తులో ఆయనకు మరింత ఆదరణ లభిస్తుంది.

అపజయం ఎదురైతే వ్యూహకర్తలు అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతుంది. యూపీలో ఫెయిల్యూర్‌ పూర్తిగా ప్రశాంత్‌ కిషోర్‌ది అని చెప్పలేం. కర్ణుడి చావుకు ఆరుగురి శాపాలు కారణమన్నట్లుగా యూపీలో ప్రశాంత్‌ను నాయకులు పనిచేయనివ్వకపోవడం, ఆయన సలహాలు పాటించకపోవడం, తమకు తోచినట్లు చేయడంవంటి ఎన్నో కారణాలున్నాయి.

జగన్మోహన్‌ రెడ్డి వ్యూహకర్తకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారో లేదో తెలియదు. ఆయన వివిధ అంశాలపై నివేదికలు ఇస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఆ నివేదికలను జగన్‌ ఎంతవరకు అమలు చేస్తారో చూడాలి.

Show comments