గాల్లో అమరావతి కట్టేస్తున్న చంద్రబాబు.!

అమరావతి అటకెక్కింది. నో డౌట్‌, 2018 నాటికి 'అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం..' అని గతంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఒట్టి బూటకం. శరవేగంగా రాజధాని నిర్మాణం.. అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తోన్న హంగామా అంతా ఉత్తదే. అమరావతిలో, 2019 ఎన్నికల నాటికి ప్రస్తుతమున్న తాత్కాలిక సచివాలయం తప్ప, ఇంకో కొత్త కట్టడం వచ్చే అవకాశమే కన్పించడంలేదు. 

అదేదో మాకీ సంస్థ అట, ఇంకోటేదో సంస్థ అట.. కోట్లు వెచ్చించి మరీ ఆయా కంపెనీల నుంచి డిజైన్లు తెప్పించుకున్నారు. 'నన్ను చూసి ఉచితంగా డిజైన్లు ఇచ్చేశారు..' అని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు, వాటన్నిటినీ అటకెక్కించేశారు. ఆయా సంస్థల డిజైన్లు ఎంత గొప్పగా వున్నాయంటే, 'ఆంధ్రప్రదేశ్‌ అనే రాష్ట్రంలో అణు బాంబుల తయారీ కోసం కర్మాగారాల్ని నిర్మిస్తున్నారట..' అని అమరావతి డిజైన్లు చూసి, పాకిస్తాన్‌లో మీడియా కథనాలు రాసేంతలా. 

'థర్మల్‌ పవర్‌ స్టేషన్లకు చెందిన టవర్లు.. ఇంకేవో ఆ తరహా నిర్మాణాలు..' ఇవీ అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబుగారు తెప్పించుకున్న డిజైన్ల తీరు. దాంతో, కథ మొదటికి వచ్చింది. డిజైన్ల వ్యవహారమే ఓ కొలిక్కి రాకపోతే, నిర్మాణ ఖర్చు మాటేమిటి.? దానికి నిధుల సేకరణ మాటేమిటి.? ఇదంతా ఓ ప్రసహనం. చంద్రబాబుగారి గాలి మాటలు తెలుసు గనకనే, అసలు రాజధాని అమరావతికి సంబంధించి 'డీపీఆర్‌ ఇచ్చేదాకా నిధులు ఇవ్వలేం' అని కేంద్రం తేల్చేసింది. 

గత కొద్ది రోజులుగా అమరావతి విషయాన్ని చంద్రబాబు పూర్తిగా పక్కన పడేశారు. ప్రస్తుతం ఫోకస్‌ అంతా పోలవరం మీద పెట్టారు. పేరుకే పోలవరం, పోలవరం పేరుతో.. పట్టిసీమ లాంటి ఎత్తిపోతల పథకం పురుషోత్తపట్నం దగ్గర ప్లాన్‌ చేస్తున్నారు. తద్వారా పోలవరం అటకెక్కడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! పోలవరం పనుల్లో బిజీగా వున్నారు గనుక, అమరావతిపై కొంత ఫోకస్‌ తగ్గినట్లుందనే కవరింగ్‌ అధికార పార్టీ నుంచి వస్తుండడం గమనార్హమిక్కడ. 

ఇక, పెద్ద పాత నోట్ల రద్దు - దేశంలో నెలకొన్న కరెన్సీ సంక్షోభం చంద్రబాబుకి భలేగా కలిసొచ్చింది. అంతా ఇప్పుడు ఈ విషయం గురించే మాట్లాడుకుంటుండడంతో, అమరావతి సోదిలోకే లేకుండా పోయిందని చంద్రబాబు భలే సంబరపడ్తున్నారట. 

అయినా, రాజధాని నిర్మించే పద్ధతి ఇది కానే కాదు. రెండున్నరేళ్ళు పూర్తయిపోయింది. తాత్కాలిక సచివాలక నిర్మాణంతో సరిపెట్టారు. అది కూడా ఇంకా పూర్తిస్థాయిలో ఓ కొలిక్కి రాలేదు. ఇక, రాజధాని నిర్మాణానికి దిక్కేదీ.? గాలి మాటలు, గాలిమాటల్లానే వుంటాయి.. ఆ మాటల నుంచి చేతల్ని ఆశించడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.!

Show comments