కొండని తవ్వి ఎలుకని పట్టేశాం

'ఒట్టు నిజం.. కొండని తవ్విన మాట వాస్తవం.. ఎలుకని పట్టుకున్న మాటా వాస్తవం..' 

- పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేంద్రం, ఆ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న వైనమిది.! 

విపక్షాల విమర్శలు మామూలే. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. గతంలో బీజేపీ రాజకీయం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోంది.. ఇతర రాజకీయ పార్టీలూ రాజకీయం చేస్తాయి. తప్పదు మరి, రాజకీయ పార్టీలు చెయ్యాల్సింది రాజకీయమే. దానికి 'సేవ' అని కవరింగ్‌ ఇవ్వడం రాజకీయ పార్టీలకు అలవాటే.! ఆ సంగతి పక్కన పెడితే, పెద్ద పాత నోట్ల రద్దుతో కేంద్రం ఏం సాధించింది.? అన్న ప్రశ్నకు ఇప్పటిదాకా నరేంద్రమోడీ సర్కార్‌ 'సరైన' సమాధానమే ఇవ్వలేదు. 

పార్లమెంటు సాక్షిగా విపక్షాలు ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక తప్పించుకుపోయేందుకు నానా తంటాలూ పడ్డారాయన. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. తీవ్రవాదం అంతమైపోతుందన్నారు.. అవినీతి మటుమాయమైపోతుందన్నారు.. నల్లధనం మొత్తం వెలికితీయబడ్తుందన్నారు. ఏదీ ఎక్కడ.? తీవ్రవాదం అలాగే వుంది, అవినీతి ఇంకా పెరిగిపోయింది, నల్లధనం సంగతి సరే సరి.! 

పోనీ, మొత్తంగా బ్యాంకులకు చేరిన పెద్ద పాత నోట్ల విలువ ఎంత.? అంటే, దానికీ సరైన సమాధానం దొరకదు. సరే, కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన 'పెద్ద నోట్లు' ఇప్పుడు పూర్తిగా చెలామణీలోనే వున్నాయా.? అంటే, దానికీ సమాధానమిచ్చే స్థితిలో కేంద్రం లేదు. పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందిప్పుడు. మీడియా మేనేజ్‌మెంట్‌ అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు.. దేశంలో నరేంద్రమోడీ దెబ్బకి 'నిజం, నిజంలా కన్పించడం' మానేసింది. 

ఇదిగో, పెద్ద పాత నోట్ల రద్దు ఫలితం.. అంటూ అప్పుడప్పుడూ కేంద్రం నుంచి ఏదో ఒక స్టేట్‌మెంట్‌ మాత్రం బయటకొస్తూనే వుంది. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత వెలికి తీయబడిన అక్రమ వ్యక్తిగత ఆదాయం.. అంటూ సుమారుగా ఐదు వేల కోట్ల లెక్క చెబుతోంది కేంద్రం. ఐటీ శాఖ దాడుల్లో వెలుగు చూసిన మొత్తం.. అంటూ ఓ ఇరవై వేల కోట్ల దాకా లెక్క తేలుతోంది. మరి, నల్లధనం లక్షల కోట్లలో వుందని గతంలో బీజేపీ చెప్పిన మాటలేమయ్యాయి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. 

లక్షల కోట్ల లెక్కల్ని పరిగణిస్తే, ఇప్పుడు కేంద్రం చెబుతున్న ఐదు వేల కోట్లు.. ఇరవై వేల కోట్లు అసలు లెక్కల్లోకొచ్చే అమౌంట్‌ కానే కాదు. కానీ, కొండనైతే తవ్వేశారు కదా.. ఈ చిట్టి ఎలక కోసం. అందుకే ఈ చిట్టి చిట్టి లెక్కలన్నమాట.

Show comments