మోదీ ‘మిత్రు’లందరికీ ఇదొక హెచ్చరిక!

ప్రధాని నరేంద్రమోదీ భారతీయ జనతా పార్టీలోనూ... కాంగ్రెస్ తరహా రాజకీయ పోకడలను తీసుకువచ్చారు. మితిమీరిన వ్యక్తిపూజకు భాజపాను కూడా వేదికగా మార్చేశారు. మిత్రుల సహకారం ఎంతమాత్రమూ అవసరం లేనటువంటి ఏకస్వామ్య ప్రభుత్వాన్నే ఆయన కేంద్రంలో ప్రస్తుతం నడుపుతున్నారు. మిత్రులంతా వదలి వెళ్లిపోయినా కూడా.. అధికారంలో ఉండగల మెజారిటీ భాజపా కు  మాత్రమే ఉన్న నేపథ్యంలో మోదీ.. మిత్రులెవ్వరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా పాలన సాగించడం జరుగుతోంది. నిర్ణయాల విషయంలో ఎవ్వరినీ ఖాతరు చేయకుండా మోదీ ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో.. చాలా సందర్భాల్లో నిరూపణ అవుతూనే ఉంది. ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలకు మరొక హెచ్చరిక వంటి పరిణామం ఇప్పుడు చోటు చేసుకుంటున్నది. లోతుగా గమనిస్తే.. మిత్రపక్షాలు అలర్ట్ కావాల్సిన వ్యవహారం ఇది. 

ప్రస్తుతం మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలకు భాజపా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికలలో భాజపాకు లభించిన అనుకూల ఫలితాలు అందించిన ధీమాతో.. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీకి కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనే ప్రస్తుతానికి వారి కుట్ర అని వార్తలు వస్తున్నాయి. ఈ వేడిమీదనే ఎన్నికలకు వెళితే.. తమ పార్టీకే పూర్తి మెజారిటీ దక్కుతుందనేది వారి ఆశ. 

ఈ వ్యూహం ద్వారా అర్థమవుతున్న సంగతి ఏంటంటే.. సుదీర్ఘ కాలంగా భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం అయిన శివసేనను ‘వదిలించుకోవాలని’ వారు ఇప్పుడు అనుకుంటున్నారు. నిజానికి భాజపా ఎన్డీయే అనే కూటమిగా మారడానికంటె ముందు కాలంనుంచి కూడా.. ‘హిందుత్వ’ అనే ఏకరీతి అజెండా కారణంగా.. శివసేనకు వారికి మధ్య మైత్రి కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలి కాలంలో మోదీ సర్కారు తీసుకుంటున్న కొన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాల విషయంలో శివసేన కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడుతుండడం, మిగిలిన మిత్రపక్షాల్లాగా మోదీ భజన చేయడంలో వారు ముందంజలో ఉండడం లేదు. పైగా తమ మాటలు, రాతల్లో మోడీ సర్కారును ఎడాపెడా చీల్చి చెండాడేస్తున్నారు. 

కానీ భాజపా ఖర్మకొద్దీ.. మహారాష్ట్రలో వారి బలం మీద కూడా ఆధారపడి మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతోంది. అందుచేత వారిని వదిలించుకోవడానికి అక్కడ మధ్యంతర ఎన్నికలు ఒక్కటే మార్గం అని భాజపా భావిస్తున్నట్లుంది. మరింత లోతుగా గమనించినప్పుడు.. సుదీర్ఘ కాలపు మిత్రులను ఇంత నిక్కచ్చిగా వదిలించుకోవాలని చూడడం మోదీ కర్కశత్వానికి ప్రతీకగానే భావించాలి. మిత్రులు ఎవరైనా సరే తన గురించి భజన చేసినంతవరకు మాత్రమే ఆయన సహిస్తారు.. లేదంటే.. వారిని వదిలించుకుంటారు. ఇది ఆయన వైఖరి అని స్పష్టం అవుతోంది. ఖచ్చితంగా తతిమ్మా మిత్రపక్షాలు అందరికీ ఇది హెచ్చరికేగా మరి !!

Show comments