శశి శాసిస్తుంది.. తమిళనాడును పాలిస్తుంది!

విశ్వాస పరీక్ష గట్టెక్కితే..బెంగళూరు పరప్పణ అగ్రహార లోని సెంట్రల్ జైల్ నుంచి తమిళనాడు పాలించబడుతుందనేది స్పష్టం అవుతుంది. డబ్బులే ఎరగా వేసిందో.. లేక సహజంగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై ఆమెకు సమ్మోహన శక్తే ఉందో కానీ.. జైలుకు వెళ్లినా అంతా శశి అనుకున్నట్టుగానే సాగుతోంది. అసలు జయ మరణానంతరమే పన్నీరును కాదు, పళనిని సీఎంగా చేయాలనేది శశి ప్రయత్నమట. అయితే ఆ పరిస్థితుల్లో అది కుదరలేదంతే! 

తర్వాత తనే ముఖ్యమంత్రి కావాలని భావించింది. అదీ కుదరక చివరకు తను ముందుగా అనుకున్న పళనిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. పరిస్థితి చూస్తుంటే పళని విశ్వాస పరీక్ష నెగ్గడం కూడా పెద్దగా కష్టంలా కనిపించడం లేదు! ఒక్కో ఎమ్మెల్యేకు ఐదు కోట్ల చొప్పున ఆఫర్ చేశారని, అందులో మూడు కోట్ల చెల్లింపులు ఇప్పటికే జరిగిపోయాయని.. రెండు కోట్లు మాత్రం విశ్వాస పరీక్ష తర్వాత అందేలాగా డీల్ కుదిరినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం ఆరువందల కోట్లతో తమిళనాట ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోందని సమాచారం.

ప్రత్యర్థులు ఏమీ తక్కువ వాళ్లు కాదు, వారూ ఎంతో కొంత ఎరవేసే యత్నం చేసి ఉంటారు. ఎందుకో వాళ్లు నెగ్గలేదు.. శశికళ వర్గం నెగ్గినట్టుగా కనిపిస్తోందంతే! పళనిస్వామి ముఖ్యమంత్రిగా నిలబడితే ఇంకా అంతా శశికళ శాసనమే అని.. కేసుల వ్యవహారంతో సహా అన్నీ కూడా అడ్డం తిరిగే అవకాశం ఉందనే అనుకోవాలి. శశి ఆదేశిస్తుంది.. పళని పాటిస్తాడు, ఈ విధంగా తమిళనాట శశి పరోక్ష పాలన సాగే అవకాశం ఉండొచ్చు.

అంతే కాదట.. తన అక్క కొడుకు టీటీవీ దినకరన్ ను జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడానికి కూడా శశి ప్రణాళిక రచించినట్టుగా వార్తలు వస్తున్నాయి! అంతేకాదట.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాకా అతడిని సీఎంగా చేయాలనేది కూడా ఆమె భావనట. మరి అంత దూకుడుగా వెళ్తుందా? అనేది సందేహమే అయినా.. శశి తీరును పరిశీలిస్తే వెళ్లినా వెళ్లొచ్చు! తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనేది తర్వాతి సంగతి!

Show comments