శశి.. బీజేపీ.. బేరసారాలు?

ఒకసారి కాదు.. నోరు తెరిస్తే అదే మాట, మీడియా ముందుకు వచ్చిందంటే అదే పాట! పన్నీరు వెనుక డీఎంకే ఉండి ఆడిస్తోందనేది చిన్నమ్మ శశికళ పదే పదే చెబుతున్న మాట. ఇదంతా డీఎంకే కుట్ర అని ఆమె మరోసారి ఆరోపించారు. ఇదే పాటనే పదే పాడుతున్నారు. అయితే ఇక్కడే శశికళ చాణక్యం బయటపడుతోంది.

శశి సీఎం పదవిని అధిష్టించడానికి సర్వం సిద్ధం అయ్యిందన్న వేళ దానికి అడ్డు పుల్ల వేసింది ఎవరో జగద్విఖ్యాతం. తమ ప్రమేయం ఏమీ లేకుండా.. అంతా జరిగిపోతుండటాన్ని జీర్ణించుకోలేని బీజేపీ గవర్నర్ తో గేమ్ మొదలుపెట్టించింది. శశికి అడ్డుపుల్ల వేసింది. శశికి ప్రజామోదం ఉందా? జయ సమ్మతం ఉందా? అనేవి తర్వాతి ప్రశ్నలు. అలాగే కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి కూడా తీర్పులింకా రాలేదు! అలాంటప్పుడు.. సాంకేతికంగా సీఎం కావడానికి అర్హతలు కలిగిన శశి చేత ప్రమాణ స్వీకారం చేయించడం గవర్నర్ విధి. అయితే ఇక్కడ బీజేపీ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నించిందనేది చిన్నపిల్లాడికి కూడా ఇట్టే అర్థం అవుతోంది.

అయితే ఎటొచ్చీ ఇది శశికళకే అర్థం కావడం లేదనామాట.. ఈ విషయాన్ని అంతా నమ్మేయాలనమాట! ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ శశికళ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ రాజకీయ పార్టీలు ఇప్పటికే బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. గవర్నర్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ తన ప్రయోజనాల కోసం వెదుకులాడుకుంటోందని.. విశ్లేషకులు స్పష్టంగానే చెబుతున్నారు. అయితే శశి మాత్రం ఇదంతా డీఎంకే కుట్ర , కరుణానిధి గేమ్ ఆడిస్తున్నాడు అంటోంది!

వీల్ చెయిర్ లో ఉన్న కరుణానిధికి గానీ, ఢిల్లీ వరకూ వెళ్లొచ్చిన స్టాలిన్ కు గానీ.. శశిని సీఎంగా అయ్యేందుకు అడ్డుకునేంత సీన్ లేదు. రేపు పన్నీరు సెల్వం గనుక బల నిరూపణకు రెడీ అయితే.. అప్పుడు డీఎంకే ఆయనకు మద్దతును ఇవ్వొచ్చుగాక, ఇప్పటికే జరగాల్సిన శశి ప్రమాణ స్వీకారోత్సవంను ఆపేంత సీన్ కరుణ పార్టీకి లేదు. అయినా కూడా.. శశి డీఎంకేను నిందిస్తోందంటే, బీజేపీకి ఆమెకూ జరుగుతున్న బేరసారాల ఫలితం కాదా ఈ మాటలన్నీ? ఒకవేళ వీరి మధ్యన చర్చలు జరుగుతుండకపోతే.. ఈ పాటికి ఈ విషయంలో శశికళ వర్గం బీజేపీపై మామూలుగా రంకెలు వేసేదా? అసలు కథ అతి త్వరలోనే వెలుగులోకి వస్తుందిలే! 

Show comments