బాబూ యనమలా.. ప్రపంచం తల్లకిందులైపోద్దా.?

అడ్డగోలు విభజనతో కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిందనీ, పైగా ఇప్పుడు నియోజకవర్గాల పెంపుని వ్యతిరేకిస్తూ ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొత్త కుట్రలు పన్నుతున్నారనీ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ పని అనీ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసేశారు. 

నిజానికి, నియోజకవర్గాల పెంపు అంశం, కాంగ్రెస్‌ హయాంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించే క్రమంలో, విభజన చట్టంలో పేర్కొన్నారు. దాని ప్రకారమే ఇప్పటి నరేంద్రమోడీ సర్కార్‌, నియోజకవర్గాల పెంపు అంశాన్ని పరిశీలిస్తోంది కూడా.! 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు అంశం జరుగుతుందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత అయితే లేదు. కానీ, అయి తీరుతుందనే ఆశాభావంతో ప్రతిపక్షం వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీ 'కొనుగోలు' చేసిన విషయాన్ని ఎలా కాదనగలం.? 

అయినా, నియోజకవర్గాల పెంపుతో ఆంధ్రప్రదేశ్‌కి కలిగే లాభమేంటో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే చెప్పాలి. నియోజకవర్గాల పెంపు అనేది కేవలం, రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే. అంతకు మించి, దానివల్ల రాష్ట్రానికి పెద్దగా ఒరిగేదమీ వుండదు. పార్టీ ఫిరాయింపుల పుణ్యమా అని టీడీపీలో ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు ఎక్కువైపోయారు. అదీ ఆ పార్టీ అసలు సమస్య. 

ఇక, రాహుల్‌గాంధీ నియోజకవర్గాల పెంపుని వ్యతిరేకించలేదు. 'దానికన్నా ముఖ్యమైన అంశం ప్రత్యేక హోదా..' అని మాత్రమే రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలిసీ, ఇటు చంద్రబాబు అటు నరేంద్రమోడీ కలసికట్టుగా ప్రత్యేక హోదాకి పాతరేశారు. ప్రత్యేక ప్యాకేజీ.. అంటూ హడావిడి చేసి, దానికీ పాతరేసి, ప్రత్యేక సాయం.. అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వున్నదీ పాయె, వుంచుకున్నదీ పాయె.. అనే స్థితికి తీసుకొచ్చేశారు. 

మొత్తమ్మీద, అధినేత చంద్రబాబు మెప్పు కోసం యనమల రామకృష్ణుడు, నియోజకవర్గాల పెంపు అంశానికి సంబంధించి రాహుల్‌గాంధీపై గుస్సా అయిపోయారుగానీ, రాహుల్‌ని విమర్శిస్తే యనమల పెద్ద నాయకుడైపోతారా.? అసలు రాహుల్‌ వ్యాఖ్యల్ని అంత సీరియస్‌గా తీసుకుంటెన్నదెవరిక్కడ.?

Show comments