ఎక్కడైనా ఎవరైనా గెలిచారా.. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా సాధించారా.. ఎక్కడైనా ఏదైనా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిందా.. అది కచ్చితంగా మా ఘనతే! దానితో తెలుగుదేశం పార్టీకి బీరకాయ పీచు సంబంధం లేకపోయినా.. ఎక్కడో దానికి చంద్రబాబు గైడెన్స్ కచ్చితంగా ఉండే ఉంటుంది! అఖరికి ఇంకా అమెరికా ఎన్నికల పోలింగ్ కూడా జరగకనే.. హిల్లరీ ప్రమాణ స్వీకారోత్సవానికి బాబుకు ఆహ్వానం దక్కింది.. హిల్లరీ –బాబు చాలా క్లోజు, దీంతో పాటు చెల్సియా- లోకేష్ లు కూడా సన్నిహితులే అని జోడించేసి.. వదిలారు!
మరి తెలుగుదేశం పార్టీకి ఇలాంటి విద్యయేమీ కొత్తగా అబ్బిందేమీ కాదు! ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. పాజిటివ్ అయితే తమకు, నెగిటివ్ అయితే ప్రత్యర్థులకు అన్వయించుకుని మాట్లాడటంలో పసుపు పార్టీ నేతలు పండిపోయారు.
ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే… యూపీలో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే.. ఈ పండితులు గతంలో చేసిన వ్యాఖ్యానాలు ఇప్పుడు గుర్తుకు రాకమానవు. ఇప్పుడు కాదు.. క్రితం సారి యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిందే.. ఆ ఎన్నికల ఫలితాల రోజున తెలుగుదేశం నేతల ఆనందాన్ని చూడాలి!
మాయవతే వరసగా రెండో సారి అధికారంలోకి రావొచ్చు.. ఎస్పీ అండర్ డాగ్ మాత్రమే అనే పరిణామాల మధ్య సంచలన రీతిలో సమాజ్ వాదీ పార్టీ గెలవడాన్ని ఏపీలో తెలుగుదేశం నేతలు భలే ఎంజాయ్ చేశారు. ఆల్ మోస్ట్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి అప్పట్లో బాబుగారు ఏమైనా ఎస్పీ కి గైడెన్స్ ఇచ్చారా.. ఎన్నికల్లో ఎలా గెలవాలో నేర్పించారా..లేక సైకిల్ గుర్తు ను ఇచ్చి వాళ్లకు అదృష్టాన్ని అరువుగా ఇచ్చి ఎరువేశారా..? అనే డౌట్లేమీ వద్దు కానీ, తెలుగుదేశం నేతలు పెట్టిన పోలిక మాత్రం చిత్రంగానే ఉంది.
అదేమనగా.. ‘యూపీలో అఖిలేష్.. ఏపీలో లోకేష్’’ అప్పట్లో తెలుగుదేశం ఇచ్చిన నినాదం! యూపీలో సమాజ్ వాదీ పార్టీదీ సైకిల్ గుర్తే.. ఏపీలో మాదీ సైకిల్ గుర్తే.. ములాయం తనయుడి పేరు అఖిలేష్, చంద్రబాబు తనయుడి పేరు లోకేష్.. ‘అఖిలేష్- లోకేష్’ ఎలా ఉంది ఈ రైమింగ్.. అక్కడ అక్కడ అఖిలేష్ గెలిచాడు కాబట్టి.. ఏపీలో లోకేషే… అని ఎన్టీఆర్ భవన్ లో బల్లగుద్దిన చప్పుళ్లు చాలానే వినిపించాయప్పట్లో!
చంద్రబాబు ఇంకా.. రన్నింగ్ లో ఉన్నారు కదా, అని అన్నా, తమ్ముళ్లు ‘అఖిలేష్- లోకేష్’ అని మురిసిపోయారు! ఆ తర్వాత ఎన్నోజరిగాయి.. కీలకమైన ఏపీ విభజన జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
మరి రేపటి ఎన్నికల్లో మళ్లీ ములాయం పార్టీ గెలిస్తే.. అఖిలేష్ మళ్లీ సీఎం అయ్యి ఉంటే.. తెలుగుదేశం పార్టీ క్రితం సారి యూపీ ఎన్నికల ఫలితాలప్పుడు స్పందించినట్టుగానే స్పందిచేదేమో! కానీ.. అక్కడ సైకిల్ పార్టీ కిల్ అయిపోతోంది! తండ్రీ కొడుకుల మధ్య విబేధాలు.. రచ్చకు ఎక్కాయి. ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నేతలు ‘యూపీలో అఖిలేష్ – ఏపీలో లోకేష్’ అనే మాట అనలేరు పాపం! యూపీ పరిణామాలపై స్పందించామని కోరగా.. ఆ సైకిల్ కూ మా సైకిల్ కు సంబంధం లేదని.. కొంతమంది తెలుగుదేశం నేతలు అంటున్నారు.
అయితే ములాయం ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం.. బాబు ఇప్పటికే నందమూరి కుటుంబాన్ని పార్టీకి కిలోమీటర్ దూరంలో పెట్టేశాడు. ఒకవేళ ములాయం తన సవతి సోదరుల మీద కూడా మమకారం పెట్టుకున్నట్టుగా బాబు కూడా ఎన్టీఆర్ 11 మంది సంతానాన్ని చుట్టూ పెట్టుకుని ఉంటే.. కథ వేరే రకంగా ఉండేది ఈ పాటికే! ఈ విషయంలో బాబు విజన్.. లోకేష్ ను సేఫ్ గానే ఉంచుతున్నట్టే!