అయిన వారికి ఆకులు... కాని వారికి కంచాలు

 ఫిరాయింపు దారులను ప్రోత్సహిస్తున్న బాబు

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిరాయింపుదార్లను ప్రోత్సహిస్తూ, పార్టీ అభ్యున్నతికి కష్టించి పనిచేసిన వారిని విస్మరిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్‌ రాజకీయాలను తీసుకోవచ్చని వాపోతున్నారు. చంద్రబాబు మార్క్‌ రాజకీయాలను తీసుకోవచ్చని వాపోతున్నారు. చంద్రబాబు మార్క్‌ రాజకీయంతో పార్టీ సీనియర్లు సైతం తీవ్ర విస్మయానికి గురవుతున్నారు.

జడ్పీ ఛైర్మన్‌గా గత మూడేళ్ళుగా వ్యవహరిస్నున్న నామన రాంబాబు ఆ పదవి నుండి బలవంతంగా చంద్రబాబు తొలగించారు. రాంబాబు అతి కష్టంమీద ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. అనూహ్యంగా జిల్లాపరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌ పెండ్యాల నళినీకాంత్‌ సైతం పదవికి రాజీనామా చేశారు. రాంబాబుతో పాటు నళినీకాంత్‌ కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించడం పార్టీవర్గాల్లో కలకలం రేపింది. మూడు సంవత్సరాలుగా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాంబాబుపై ఇటీవలి కాలంలో రాజీనామా చేయాల్సిందిగా అధిష్ఠానం తీవ్రస్థాయిలో వత్తిడి తెచ్చింది.

జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావు తదితరులతో ఈ విషయమై పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే రాజీనామా చేసేందుకు నామన రాంబాబు ఓ పట్టానా అంగీకరించకపోవడంతో విశాఖలో నిర్వహించిన మహానాడులో జడ్పీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయాల్సిందిగా స్వయంగా అధినేత చంద్రబాబు ఆదేశించడంతో రాంబాబుకు వైదొలగక తప్పలేదు!

ఇటీవల రాంబాబును జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని ఇచ్చి, జడ్పీ ఛైర్మన్‌ పదవి నుండి తొలగించదవద్దని, కావాలంటే రెండు పదవుల్లోనూ కొనసాగించాలని కూడా రాంబాబు కోరినప్పటికీ అధినేత అంగీకరించకపోవడంతో ఎట్టకేలకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అనూహ్యంగా పెండ్యాల నళినీకాంత్‌ సైతం వైస్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.

ముఖ్యంగా నళినీకాంత్‌ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆ సామాజికవర్గానికి చెందిన పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామన రాంబాబు కాపు సామాజికవర్గానికి చెందినవారు కాగా నళినీకాంత్‌ కమ్మ సామాజికవర్గం నుండి జడ్పీటీసీగా ఎన్నికై, వైస్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైస్‌ఛైర్మన్‌ రాజీనామాతో కమ్మ సామాజికవర్గం నుండి తీవ్ర నిరసన వ్యక్తమయ్యే ప్రమాదం ఉండటంతో తిరిగి ఆయననే వైస్‌ ఛైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు.

అలాగే కొత్త జడ్పీ ఛైర్మన్‌గా జగ్గంపేట జడ్పీటీసీ జ్యోతుల నవీన్‌ను నియమిస్తూ ప్రభుత్వం వెనువెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపైనే ఇపుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున జ్యోతుల నెహ్రూ పోటీచేసి విజయం సాధించారు. అలాగే జగ్గంపేట జడ్పీటీసీగా జ్యోతుల కుమారుడు నవీన్‌ ఎన్నికయ్యారు. అయితే ఇటీవల నెహ్రూె వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరారు.

నెహ్రూకు మంత్రివర్గ విస్తరణలో చోటు తథ్యమని, ఆ హామీతోనే పార్టీ ఫిరాయించారని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణలో నెహ్రూకు ప్రత్యామ్నాయంగా మరో అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ ప్రకారం నెహ్రూ తనయుడు నవీన్‌కు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవిని ఇచ్చేందుకు గాను నామన రాంబాబుచే రాజీనామా చేయించారు. వాస్తవానికి జ్యోతుల నెహ్రూ కుటుంబంపై ఫిరాయింపుదారులన్న ముద్రపడింది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన సమయంలో ఆ పార్టీలో నెహ్రూ చేరారు. ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్‌లో విలీనమయ్యింది. అనంతరం వైకాపా తీర్ధం పుచ్చుకుని జగ్గంపేట పమ్మెల్యేగా నెహ్రూఎన్నికయ్యారు. మళ్ళీ తెలుగుదేశంలో మంత్రిపదవిపై ఆశతో చేరి విమర్శలకు గురయ్యారు. ఇటువంటి కుటుంబానికి జిల్లా పరిషత్‌ పీఠాన్ని అప్పగించడం ద్వారా పార్టీ వర్గాలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారంటూ సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్ళే విమర్శిస్తున్నారు.

జిల్లా పరిషత్‌లో పలువురు జడ్పీటీసీలు అంకితభావంతో పనిచేస్తున్నారని, పార్టీ జెండాను భుజాన వేసుకుని క్రమశిక్షణకు మారుపేరుగా నిలచిన వారిని విస్మరించి, ఫిరాయింపుదార్లను ప్రోత్సహించడం పంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి అనాలోచిత చర్యలకు భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని తెలుగు తమ్ముళ్ళు హెచ్చరిస్తున్నారు.

Show comments