జగన్‌ ఢిల్లీ టూర్‌.. వణుకుతున్న టీడీపీ.?

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారంటే చాలు, అధికార తెలుగుదేశం పార్టీలో 'వణుకు' మొదలవుతుంటుంది. 'బీజేపీ - టీడీపీ మైత్రీ బంధాన్ని విడగొట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారు.. మేం విడిపోతే, మా ప్లేస్‌లోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ ఆరాటపడ్తోంది..' అంటూ జగన్‌ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ టీడీపీ నుంచి ఆరోపణలు దూసుకొస్తున్న విషయం విదితమే. ఇప్పుడూ అదే జరుగుతోంది. 

వైఎస్‌ జగన్‌ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారనీ, ప్రధాని నరేంద్రమోడీతో రహస్య భేటీకి ప్లాన్‌ చేశారనీ, టీడీపీ అనుకూల మీడియా కథనాల మీద కథనాలు వండి వడ్డించేస్తోంది. నిజానికి వైఎస్‌ జగన్‌, ఢిల్లీకి వెళితే అందులో రహస్యం ఏమీ వుండదు. ఏ కేంద్ర మంత్రితో అపాయింట్‌మెంట్‌ దొరికినా, అంతా ఓపెన్‌గానే జరుగుతుంటుంది. ప్రధానితో భేటీ అవడమంటే, ఇక్కడ రహస్యంగా దాచడానికి ఏముంటుందట.? 

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలో చంద్రబాబు, తనకు రాజకీయంగా బద్ధశతృవు అయిన కాంగ్రెస్‌ పార్టీతో 'తెరచాటు' మంతనాలు జరిపారు. ఈ విషయాన్ని స్వయంగా ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం పార్లమెంటులో వెల్లడించిన విషయం విదితమే. బహుశా, చంద్రబాబు అండ్‌ టీమ్‌ ఆందోళన అదే అయి వుండొచ్చేమో.! కానీ, ఇక్కడ బీజేపీ - టీడీపీకి మిత్రపక్షం. కేంద్రంలో, ఇద్దరు మంత్రులున్నారు టీడీపీ నుంచి. కేంద్రంలో ఎప్పుడేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం టీడీపీకి వుండనే వుంది. అయినా, వైఎస్‌ జగన్‌ ఢిల్లీ టూర్‌ అంటే టీడీపీలో అదే భయం కొనసాగుతోందంటే, అర్థమేంటట.? 

ఇక, జగన్‌ ఢిల్లీ పర్యటన విషయానికొస్తే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించేలా చేసి, వారికి మంత్రి పదవులిచ్చారంటూ ప్రధానికి జగన్‌ ఫిర్యాదు చేయనున్నారట. ప్రత్యేక హోదాతోపాటు, పోలవరం ప్రాజెక్టు ఇతర విభజన అంశాలపైనా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రంతో జగన్‌ చర్చలు జరపనున్నారట. ఇదీ వైఎస్సార్సీపీ వెర్షన్‌. అయితే, ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని కేంద్రం తెగేసి చెబుతున్నప్పుడు ఇంకా జగన్‌, ప్రత్యేక హోదా పేరుతో ప్రధానిని కలవడం వల్ల ఉపయోగం ఏంటన్నదీ ఆలోచించాల్సిన విషయమే. 

ఏదిఏమైనా, వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ, టీడీపీలో 'కంగారు' స్పష్టంగా కన్పిస్తోంది. దానికారణం జగన్‌ మాత్రమే కాదు, బీజేపీ వ్యూహాలు కూడా. టీడీపీ మిత్రపక్షం కదా అని, వైఎస్సార్సీపీని రాజకీయ శతృవుగా బీజేపీ చూడటంలేదు. కొన్ని సందర్భాల్లో వైఎస్సార్సీపీని బీజేపీ, బీజేపీని వైఎస్సార్సీపీ విమర్శిస్తున్నా, ఇరు పార్టీల మధ్యా అనధికారిక 'అవగాహన' అయితే వుందన్న వాదనలూ లేకపోలేదు. అదే టీడీపీ నేతల టెన్షన్‌కి కారణం.

Show comments