బాబు ఇల్లిస్తేనే జగన్‌ వస్తాడా?

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హైదరాబాదులో కూర్చుని ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు జగన్‌కు ఆంధ్రాలో నివాసం లేదు. పార్టీ కార్యాలయమూ లేదు. జగన్‌ది జాతీయ పార్టీ కాకపోయినా మొన్నీమధ్య ఢిల్లీలో మాత్రం కార్యాలయం ప్రారంభించారు. కాని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో స్థిర నివాసం, కార్యాలయం ఉండాలనే ఆలోచన సీరియస్‌గా చేయడంలేదు. దీంతో ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేయడానికి మంచి అవకాశంగా ఉంది. ఈ పరిస్థితి పార్టీ నాయకులకూ ఇబ్బందిగానే ఉంది. టెక్నాలజీ, రవాణా, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు విపరీతంగా పెరిగిన ఈ కాలంలో ఎక్కడినుంచైనా రాజకీయాలు చేయొచ్చు. కష్టం కాదు. కాని జనం ఒప్పుకోరు కదా. తెలంగాణలో ఉంటూ ఆంధ్రాలో రాజకీయాలు చేయడం ఏ కోణంలో చూసినా తప్పే. ఇది జగన్‌ రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని విషయాలు చిన్నవేనని అనుకుంటాం. కాని అవే కొంపలు ముంచుతాయి. హైదరాబాదులో ఉంటూ జగన్‌ ఎన్ని పోరాటాలు చేసినా, చంద్రబాబు మీద ఎంతగా విరుచుకుపడినా ప్రయోజనం లేదు.

మాట మాట్లాడితే ఓటుకు నోటు కేసులో భయపడి చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయారని విమర్శలు చేస్తున్నారు. ఆయన ఎందుకు వెళ్లిపోయాడో అదేపనిగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఆంధ్రాలోనే ఉంటూ ప్రధాన ప్రతిపక్ష నేత హైదరాబాదులో ఉంటుండంతో టీడీపీ నాయకులకు విమర్శలు చేయడానికి అవకాశంగా ఉంది. ఎప్పుడైతే పరిపాలన మొత్తం రాజధానికి తరలిపోయిందో అప్పుడే జగన్‌ అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాల్సింది. రాష్ట్రం విడిపోయాక మొన్నటివరకు అసెంబ్లీ సమావేశాలు హైదరాబాదులోనే జరగడంతో ఆంధ్రాకు ఇప్పుడే ఎందుకులే అని జగన్‌ భావించి ఉండొచ్చు. మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తుండటంతో ఇల్లు కట్టుకోవడానికి, కార్యాలయం నిర్మించుకోవడానికి స్థలాలు వెతుకుతున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయవాడలో వైఎస్‌ జగన్‌ అధికారిక నివాసం కోసం విజయవాడలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశామని, ఇంకా స్పందన రాలేదని భూమన కరుణాకరరెడ్డి తాజాగా సెలివిచ్చారు. ప్రభుత్వం అది కేటాయిస్తే  విజయవాడకు షిఫ్ట్‌ అవుతారని అన్నారు. అధికారిక నివాసం కోసం ఈమద్యనే లేఖ రాశారేమో...! 

జగన్‌ అసెంబ్లీలో ప్రధాన, ఏకైక ప్రతిపక్ష నేత. కాబట్టి చంద్రబాబు ఆంధ్రాకు వెళ్లిపోయి, పరిపాలన కూడా అక్కడికి తరలించగానే అధికారిక నివాసం కోసం జగన్‌ పట్టుపట్టాల్సింది. ప్రతిపక్ష నేతకు నివాసం కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈమధ్య కొత్త అసెంబ్లీలో సమావేశాలు జరిగినప్పుడు ప్రొటోకాల్‌ ప్రకారం ప్రభుత్వం జగన్‌కు విజయవాడలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహాన్ని కేటాయించింది. దీన్నే అధికారిక నివాసంగా కేటాయించాలని వైకాపా లేఖ రాసింది. రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వసతి (క్వార్టర్లు) లేదు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్రజాప్రతినిధులు వసతి లేకుండా ఉండటం కష్టం కదా. హైదరాబాదులో ఏపీ అసెంబ్లీ జరిగినంత కాలం అక్కడ వసతి ఏర్పాటు చేశారు. అది మహానగరం కాబట్టి సాధ్యమైంది. వెలగపూడిలో ఆ అవకాశం లేకపోవడంతో తలా యాభై వేల రూపాయలు అలవెన్సుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్‌ విషయంలోనూ ఇదే చేద్దామనుకున్నారేమో ముఖ్యమంత్రి.

కాని ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత. అంటే కేబినెట్‌ హోదా కలిగి సీఎంతో సమానమైన వ్యక్తి. కాబట్టి నిబంధనల ప్రకారం జగన్‌కు వసతి కల్పించాల్సివుంటుంది. దీంతో రోడ్లు, భవనాల శాఖకు చెందిన విజయవాడలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ కేటాయించింది. ఇందులో అతిథుల కోసం ఐదు గదులు, విజిటర్స్‌ కోసం హాలు, వంటయిల్లు, పార్కింగ్‌ స్థలం మొదలైనవి ఉన్నాయి. ఈ అతిథి గృహాన్ని అధికారిక నివాసంగా  చంద్రబాబు ఇవ్వకపోతే  జగన్‌ షిఫ్ట్‌ అవరా? బాబు-జగన్‌ మధ్య వ్యక్తిగత వైరాన్నిబట్టి చూస్తే అతిథి గృహం ఇస్తారా? అనేది అనుమానమే. ఆంధ్రాకు ఎందుకు షిఫ్ట్‌ కాలేదని జనం ప్రశ్నిస్తే బాబు తనకు ఇల్లు ఇవ్వలేదని చెబుతారా? దాని కోసం ఎదురుచూడకుండా సొంత ఇల్లు కట్టుకుంటారా? చంద్రబాబు ఇల్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆంధ్రాలో ఉండటం జగన్‌కు కష్టమా?

Show comments