కర్నూలులో వైఎస్సార్‌ సీపీ సానుభూతి అస్త్రం!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీ తరపు నుంచి చెరుకుల పాడు శ్రీదేవి రెడ్డి పోటీ చేస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా ప్రకటించేసింది. ఇటీవలే ఈ నియోజకవర్గం వైకాపా ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణహత్యకు గరి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారాయణ రెడ్డి సతీమణిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెరపైకి తెస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమెనే పోటీ చేస్తుందని వైకాపా నేతలు చెబుతున్నారు.

గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరపు నుంచి పోటీ చేశాడు నారాయణ రెడ్డి. విశేషం ఏమిటంటే చాలామంది కాంగ్రెస్‌ నేతల కన్నా ఎక్కువ ఓట్లను సాధించాడాయన. విజయనగరం జిల్లా నుంచి పోటీ చేసిన బొత్స తర్వాత కాంగ్రెస్‌ తరపు నుంచి పోటీచేసి అత్యధిక ఓట్లను సాధించనది నారాయణ రెడ్డే. రఘువీరారెడ్డి లాంటి వాళ్ల కన్నా చెరుకుల పాటు ఎక్కువ ఓట్లను సంపాదించాడు.

వైకాపా బలంగా ఉన్నచోట కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిగా అన్ని ఓట్లను సాధించాడంటే చెరుకులపాడు నారాయణ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన బలానికి తోడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లోనే పోటీ చేసి ఉండుంటే పత్తికొండ ఫలితాలు మరో రకంగా ఉండేవేమో.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చెరకులపాడు శ్రీదేవి రెడ్డిని వైకాపా తరపున పోటీ చేయించాలని వైకాపా డిసైడ్‌ చేసినట్టుంది. మరి అవతల తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి తనయుడు పోటీ చేయడం ఖాయమే. తన భర్తను డిప్యూటీ సీఎం కేఈ తనయుడే హత్య చేయించాడని చెరుకులపాడు శ్రీదేవి రెడ్డి ఆరోపిస్తున్నారు కూడా. నారాయణ రెడ్డి హత్య నిందితుల్లో కేఈ తనయుడి పేరు కూడా ఉంది. అయితే అతడి అరెస్టుపై పోలీసులు ఏమాటా చెప్పడం లేదు.

Readmore!

ఆ సంగతలా ఉంటే.. చెరుకులపాడు శ్రీదేవి రెడ్డి వైకాపా తరపు నుంచి బరిలోకి దిగితే పత్తికొండ నియోజకవర్గ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. నారాయణ రెడ్డి వ్యక్తిగత బలం, సానుభూతి వైకాపా సహజ ఓటర్‌ శ్రీదేవి రెడ్డికి తోడయ్యే అవకాశం ఉంది. హత్యారాజకీయం చెలరేగిన ఈ నియోజకవర్గం ఫలితం 2019లో ఎలా ఉండబోతోందో.

Show comments