గోదావరి పుష్కర దుర్ఘటనను ఏపీ గవర్నమెంటు లైట్ తీసుకుంది కానీ జనాలు మాత్రం ఆ పీడకలను అంత సులభంగా మరిచిపోవడం లేదు. 29 మంది ప్రాణాలు పోతే.. పుష్కరాలన్నాకా ప్రాణాలు పోవా? అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాణాలు పోయే తొక్కిసలాటకు కారణం.. చంద్రబాబుగారి ప్రచార ఆర్భాటమే అని, షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం చేసిన ప్రయత్నం వికటించి అంతమంది ప్రాణాలు బలి తీసుకున్నారనే వాదన ఉండనే ఉంది. పుష్కర దుర్ఘటనపై సరైన విచారణ చేయించకపోవడం, సీసీటీవీ పుటేజీలు మాయమయ్యాయని ప్రకటించడం.. వంటి ప్రకటనలు ప్రభుత్వ తీరుపై మరింత అసహనాన్ని పెంచుతున్నాయి.
అదిగాకా గోదావరి పుష్కర దుర్ఘటన జరిగి కచ్చితంగా ఏడాదే అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఇప్పుడు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నారు. గోదావరి పుష్కర దుర్ఘటన జరిగిన ఏడాదికే వచ్చిన కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఏడాది కిందటి సంఘట నుంచి పాఠాలు నేర్చారు ప్రజలు.
పుష్కరాల్లో కృష్ణలో స్నానమాచరించి.. పుణ్యం పొందడానికి సిద్ధం అవుతున్న సామాన్య ప్రజానీకం ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు పుష్కర స్నానం ఆచరిస్తే ఆ రోజున మాత్రం ప్రధాన ఘాట్ ల దరిదాపుల్లోకి కూడా రాకూడదనే భావనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర స్నానం చేసే రోజున, ఆయన స్నానం చేసే ఘాట్ వద్ద బోలెడంత హడావుడి ఉంటుందని, గోదావరి పుష్కరాల సందర్భంలోలా ఇప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణకో.. మరో దానికే ప్రాధాన్యతను ఇస్తే.. మళ్లీ ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో.. అనేది సామాన్యుల భయంగా తెలుస్తోంది.
పుణ్యానికి అని వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకు.. ఈ పుష్కరాలకూ చంద్రబాబే అతి పెద్ద వీఐపీ కాబట్టి.. ఆయన సాన్నం చేసే రోజున ఆ వైపుకు పోకపోతే మంచిది.. అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది కృష్ణా పుష్కర స్నానానికి వెళ్లాలని భావిస్తున్న గ్రామీణులు ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నారు. బాబుగారి స్నానం అయిపోతే.. మొత్తం 12 రోజుల పుష్కరాల్లో ఎప్పుడో ఒక రోజున స్నానమాచరిస్తే సరిపోతుందని వారు అంటున్నారు!
మొత్తానికి గోదావరి పుష్కరాల దుర్ఘటన.. దానికి దారి తీసిన పరిణామాలు ప్రజల్లో చాలా అవగాహననే నింపినట్టుగా ఉన్నాయి. ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు.. ఏపీ కి అతి పెద్ద వీఐపీ బాబుగారు స్నానం ఆచరించే రోజున ఆ దరిదాపులకు వెళ్లొద్దు.. అని పుష్క యాత్రికులు తమలో తాము తీర్మానించుకొంటున్నారు.