మంత్రివర్గ విస్తరణ... సీమ నేతల సతమతం!

ఒకరా ఇద్దరా.. వారిని కేవలం ఆశావహులు అంటూ తక్కువ చేయడానికి లేదు, ఎవరికి వారు తమకు మించిన అర్హులు లేరని భావిస్తున్నవాళ్లే! ఈసారి తమకు అవకాశం దక్కాల్సిందే అని కోరుకుంటున్న వాళ్లే!. పార్టీ కోసం త్యాగాలు చేశామని అంటున్న వాళ్లు కొందరైతే, పక్క పార్టీని ముంచి మరీ వచ్చాం కాబట్టి.. తమకు పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న వాళ్లు మరికొందరు. తమ నేపథ్యాన్ని చూసి పదవి ఇవ్వాలని బాబుకు విన్నవించుకుంటున్నది కొందరైతే.. భవిష్యత్తును దష్టిలో ఉంచుకుని తమకు పదవి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గుర్తించాలని చెప్పుకుంటున్నది మరి కొందరు. ఏపీ మంత్రివర్గ విస్తరణ అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో మళ్లీ అలజడి రేగుతోందిప్పుడు. ఎవరికి వారు తమ ఆరాటాలను చాటుకుంటున్నారు. మరి వీళ్లలో ఎవరి ఆశలు నెరవేరతాయి? ఎవరికి నిరాశ తప్పదు అనే అంశం సంక్లిష్టం అయినదే!

నందమూరి నటసింహానికి దక్కడం అసాధ్యమే!

ఇప్పటికే మంత్రిపదవి మీద తన ఆసక్తిని తనకు అయిన వారి మధ్యనే కాకుండా, పార్టీ నేతల మధ్యన కూడా చాటుకుంది నందమూరి నటసింహం. తనకు ఏ శాఖ కావాలో కూడా వారి ద్వారా బాబు చెవిన వేశాడట బాలయ్య. పర్యాటక శాఖ అయితే తను బాగా చేయగలనని, వెనుకటికి మెగాస్టార్ చిరంజీవి కేంద్రంలో ఆ పదవినే నిర్వహించాడని, అతడికి ఏ మాత్రం తీసిపోని తను కనీసం రాష్ర్టంలో అయినా పర్యాటక శాఖ మంత్రిగా వెలగాలనేది బాలయ్య కోరిక అని కొందరు తెలుగుదేశం నేతలు అంటారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి తనయుడను, తెలుగు టాప్ హీరోను, నటసింహాన్ని అయిన తను కేవలం ఎమ్మెల్యేగా ఉంటే ఏం బావుంటుంది.. మంత్రిపదవి ఉంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నందుకు కొంత తప్తి ఉంటుందనే లాజిక్‌ను కూడా బాలయ్య ప్రస్తావించినట్టుగా టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు.

అయితే ప్రస్తుత సమీకరణాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే, బాలయ్య కోరిక నెరవేరే అవకాశాలు ఏ మాత్రమూ లేవు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి నటసింహాన్ని అసలు మంత్రి పదవుల విషయంలో బాబు పరిగణించడం కూడా లేదని భోగట్టా. అందుకు ప్రధాన కారణం.. లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకొంటూ ఉండటమే!

లోకేష్‌కు పట్టాభిషేకం జరుగుతున్న వేళ బాలయ్యకు మంత్రి పదవి దక్కడం ఆల్‌మోస్ట్ అసాధ్యం. అల్లుడిని, మామను ఒకేసారి మంత్రివర్గంలోకి తీసుకొంటే అది చూసే వాళ్లకు బాగుండదు అనే లాజిక్‌తో బాలయ్య ఆశలపై బాబు నీళ్లు చల్లే అవకాశాలున్నాయి. నీ అల్లుడిని మంత్రివర్గంలోకి తీసుకొంటుండగా.. మళ్లీ నీకు మంత్రిపదవి ఆశించడం తప్పు కదా.. అని కూడా బాలయ్యను పక్కన పెట్టగల చతురత బాబుకు ఉందని వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి.. ప్రస్తుతానికి ఈ సీమ సింహానికి మంత్రి ఛాన్స్ దాదాపుగా లేనట్టే. 

ఫిరాయింపు దారుల కథేంటి?

రెడ్డి కోటా కమ్ ఫిరాయింపు కోటాలో భూమా నాగిరెడ్డి, ఫిరాయింపు కమ్ మైనారిటీ కోటాలో అత్తార్ చాంద్ భాషా.. వస్తే వద్దనం అనే మాటతో మరికొంత మంది వైకాపా ఫిరాయింపు దారులు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అయితే వీళ్లలో ఏ ఒక్కరి ఆశలు అయినా ఫలిస్తాయా? ఒకవేళ ఫలిస్తే.. దానికి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేవి ఆసక్తికరమైన అంశాలు. భూమా నాగిరెడ్డి పేరు మాత్రం మంత్రివర్గ విస్తరణ విషయంలో ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ వచ్చే వరకూ నమ్మకం లేని అంశమే ఇది. భూమాకు మంత్రి పదవిని ఇస్తే.. శిల్పావర్గం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే వాళ్ల నెత్తిన ఎక్కిన భూమా నాగిరెడ్డికి మంత్రిపదవి వస్తే.. శిల్పావర్గం పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇస్తే.. తెలుగుదేశం పార్టీకి నైతికంగా ఇబ్బందికరమైన అంశం అవుతుంది. అయితే నైతికతకు ఏనాడో తిలోదకాలు ఇచ్చేశారు కాబట్టి.. కొత్తగా పోయేదేమీ ఉండని తెలుగుదేశం అధినేత భావింవచ్చు.

అత్తార్ చాంద్‌భాషా విషయానికి వస్తే.. అతడికి మంత్రి పదవిని ఇస్తే, అనంతపురం జిల్లా తెలుగుదేశంలోని కొంతమంది భగ్గుమంటారు. అత్తార్ అనామకుడని అతడిని చేర్చుకోవడంపై వారు అసంతప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు మంత్రిపదవి వస్తే.. వాళ్లు తీవ్ర నిస్పహకు లోనవుతారు. మైనారిటీ శాఖకు మంత్రిని నియమిస్తే.. ఆ విషయంలో అత్తార్, కష్ణా జిల్లాకు చెందిన జలీల్ ఖాన్ మధ్య పోటీ ఉంటుంది. వీరిలో ఎవరిపై బాబు ఎవరికిచ్చిన హామీని నిలబెట్టుకుంటాడో చూడాల్సి ఉంది. 

పాత కాపుల పరిస్థితి ఏమిటి?

పార్టీనే నమ్ముకుని ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పక్కచూపులు చూడలేదు.. మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ బాబుకు ధీనంగా తమ వ్యథలను వినిపిస్తున్న వాళ్లు కొందరున్నారు. ఇలాంటి వారిలో ముందు వరసలో ఉన్నవాళ్లు పయ్యావుల, పార్థసారధి తదితరులు. ఒకవేళ ఫిరాయింపు దారులు రేసులో లేకపోతే వీరిలో ఎవరికో ఒకరికి పదవులు లభించేవో ఏమో కానీ.. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని చూస్తే పాత కాపులకు దేక్కదేమీ కనిపించడం లేదు.

కొసరు ఆశలు కొందరికి ఉన్నాయ్!

భూమాను చేర్చుకున్నప్పుడు సహనం వహించినందుకు బోనస్‌గా మాకో మంత్రిపదవి అని.. శిల్పావర్గం. ఆదినారాయణ రెడ్డిని చేర్చుకోవడంపై అభ్యంతరం చెప్పలేదు కాబట్టి మాకు పదవి కావాలని .. రామసుబ్బారెడ్డి వర్గం. ఎమ్మెల్సీ ఇచ్చారు సరే.. కడప జిల్లాకు ఒక మంత్రి కూడా లేకపోతే ఎలా? కాబట్టి నాకు ఆ పదవి ఇవ్వాలని సతీష్ రెడ్డి వంటి వాళ్లు బాబు ముందు తమ విన్నపాలను చాన్నాళ్లుగానే వినిపిస్తున్నారు. ఆయా సందరా్భల్లో వీళ్లకు ఆ మేరకు బాబు హామీలు కూడా ఇచ్చారు కూడా. అయితే చూద్దాం.. చేద్దాం.. అనే మాటలు ఇలాంటి సందర్బాల్లో ఆయనేక అసలు గుర్తుకు రాకపోవచ్చు.

ఉన్న వాళ్ల సంగతేమిటి..?!

రాయలసీమ నాలుగు జిల్లాల వరకూ చూసుకొంటే అసలు ఒక్క ఎమ్మెల్యేను కూడా కొత్తగా క్యాబినెట్‌లోకి చేర్చుకోకుండానే బాబు ఈసారి విస్తరణను పూర్తి చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేకాదు.. ఎవరి పదవులైనా ఊడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి అయితే కడప నుంచి మంత్రులు లేరు, చిత్తూరు నుంచి చంద్రబాబు, బొజ్జల ఉన్నారు. కర్నూలు నుంచి కేఈ, అనంత నుంచి పరిటాల, పల్లెలు మంత్రులుగా ఉన్నారు. వీరిలో ఊడితే గీడితే.. పల్లె పదవికే గండం ఉంది.

అవిశ్రాంతంగా చంద్రబాబును కీర్తిస్తూ.. ‘‘నారావంశం’’ అనే మాటను ఎంతగా వీలైతే అంతగా ఉపయోగిస్తూ, జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ... కావాల్సినన్ని ఊకదంపుడు మాటలు చెబుతూ.. ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులేస్తూ.. తన విధేయతను చూపించుకుంటున్న పల్లె చేతిలో ఇప్పుడు అరడజను శాఖలున్నాయి. వీటిలో ఏవైనా కోత పెడతారా.. లేక మొత్తానికే చుట్టేసి, ఈయనను మాజీమంత్రిగా చేస్తారా? చూడాల్సి ఉంది. భూమాకు మంత్రి పదవి ఇచ్చిన పక్షంలో పల్లె లేదా బొజ్జల ఎవరో ఒకరి మీద వేటు పడే అవకాశం ఉంది. రెడ్డిని రెడ్డితో బ్యాలెన్స్ చేసే రాజకీయంలో భాగంగా అది జరగవచ్చు.

ఇక కేఈ కష్ణమూర్తి సీనియర్‌గా పదవిని నిలుపుకోగలడు కానీ.. ఆయనకు కీలకమైన రెవెన్యూ శాఖ ఉంటుందా? అనేది సందేహమే. ఇప్పటికే ఆ శాఖలో లోకేష్ బాబు జోక్యం ఒక రేంజ్‌లో ఉందని సమాచారం. దీనిపై కేఈ అసహనంతో ఉన్నాడని బహిర్గతం అయ్యింది. ఈ విస్తరణలో కేఈకి శాఖ మార్పిడి అవకాశం ఉండవచ్చు. రెవెన్యూను పూర్తిగా తమ మాటకు తలొంచే వాళ్లకు అప్పగించవచ్చు. 

పరిటాల సునీత మాత్రం సేఫే. ఆమె పని తీరు మీద విమర్శలు ఉన్నా, బాబుగారి ర్యాంకుల్లోనే ఆమె వెనుకబడినా.. పార్టీకి పూర్తి సపోర్టివ్‌గా ఉండే కమ్మవాళ్ల ఇగో శాటిస్ ఫ్యాక్షన్ కోసమైనా సునీతను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉండవు. పరిటాల రవిని పులి, సింహం అనే.. తెలుగుదేశం అభిమానుల మధ్య ఆ టెంపోను కొనసాగించడానికి బాబు ఇష్టపడవచ్చు. 

అండర్ డాగ్స్ ఉంటారా?

అనూహ్యంగా కొంతమంది చంద్రబాబు దగ్గర పదవులు సంపాదించుకోవడం కొత్తేమీ కాదు. రెండేళ్ల కిందట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు బాబు క్యాబినెట్‌లో అస్సలు ఊహించని మొహాలే ఎక్కువగా కనిపించాయి. ఆ ఎంపిక వెనుక బాబు లెక్కలు ఆయనకున్నాయి. మరి ఈ లెక్కల మేరకు ఇంతటి టఫ్ ఫైట్‌లో కూడా అనూహ్యంగా పదవులు సొంతం చేసుకోగల సమర్థులు ఎవరైనా వెలుగులోకి వచ్చినా, ఊహించని విధంగా ఎవరైన మంత్రి పదవులును పొందినా పొందవచ్చు. 

Show comments