కృష్ణయ్యా.. అలా ముంచేశావేంటయ్యా.!

'నేను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాడు.. నాకు పాత మిత్రుడు.. రాడికల్‌ వింగ్‌లో ఉన్నప్పుడు పరిచయం.. ఏడాది క్రితం నేను అతనితో మాట్లాడాను.. లొంగిపోవాలనుకున్నాడు.. అంతలోనే ఇలా జరిగింది..' 

- టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య వ్యాఖ్యలివి. 

ఇంతకీ, కృష్ణయ్య ఎవరి గురించి చెప్పారో తెలుసా.? ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్‌ నయీం గురించి. షాకింగ్‌ డైలాగ్‌ కదా ఇది.! ఆర్‌.కృష్ణయ్య అంటే టీడీపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, బీసీ నేతగానూ తెలుగు రాష్ట్రాల్లో పేరున్న వ్యక్తి. తెలంగాణలో పార్టీకి అంత సీన్‌ లేదని గ్రహించిన చంద్రబాబు, బీసీ కార్డుని తెరపైకి తీసుకొచ్చి, ఆర్‌.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటిదాకా టీడీపీలో లేని వ్యక్తిని టీడీపీలోకి తీసుకొచ్చి, ముఖ్యమంత్రిగా నిలబెట్టడమేంటి.? అని అంతా ఆశ్చర్యపోయారు. 

గత ఎన్నికల్లో కృష్ణయ్య గెలుపు కోసం నయీం పెద్దమొత్తంలో ఆర్థిక సహాయం అందించాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నయీం చేసిన పలు సెటిల్‌మెంట్లలో కృష్ణయ్యకు వాటా వుందనే ఆరోపణలూ విన్పిస్తున్న వేళ, ఇదిగో.. కృష్ణయ్య.. వివరణ ఇచ్చుకోవడంలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'నేనేమీ నయీంతో సెటిల్‌మెంట్లు చేయలేదు.. నాకు ఎన్నికల్లో ఆర్థిక సహాయమూ చేయలేదు..' అంటూనే, 'నేను ముఖ్యమంత్రినవ్వాలని నయీం బలంగా కోరుకున్నాడు..' అని చెప్పడంలోనే కృష్ణయ్యకీ, నయీంకీ వున్న సన్నిహిత సంబంధాలేమిటో బయటపెట్టేశారు. పైగా, లొంగిపోవాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని నయీం, కృష్ణయ్యకు చెప్పడమేంటట.? ఇది ఇంకా పెద్ద విచిత్రం. 

పేరుకి టీడీపీ ఎమ్మెల్యేనే అయినా, చాలాకాలంగా ఆయన టీడీపీకి దూరంగా వుంటున్నారు. ఇదిగో, ఇప్పుడిలా టీడీపీని నిండా ముంచేసేలా.. సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్‌.కృష్ణయ్య. 

Show comments