డైరీ ఆఫ్‌ డీడీ : జేమ్స్‌బాండ్‌ చంద్రబాబు!

ఇవాళ నాకు బెజవాడ కనకదుర్గ అమ్మవారిని సేవించు భాగ్యము కలిగినది. కింద క్రిష్ణమ్మ.. పైన దుర్గమ్మ... ఇరువురినీ ఒకే సారి దర్శించవచ్చును కదా.. అని చాలా ఉత్సాహముగా వెళ్లితిని. కానీ నాకు కిందా మీదా ఎడాపెడా ఉత్సాహభంగము మరియు ఆశా భంగము కలిగినవి. కింద క్రిష్ణలో చుక్కనీరు కానుపించుట లేదు. మొత్తం నది అంతయూ ఇసుక మైదానముల వలె ఉన్నది. విశాలమైన నదీమధ్యములో అచ్చటచ్చటా... కొన్ని చెలమల వలే నీటి గుంటలు ఉన్నవి. ఎండిపోయిన క్రిష్ణమ్మను చూసినంతనే నా గుండె చెరువై పోయినది. 'కటకటా! క్రిష్ణమ్మ లో ఉన్న ఈ నీటి గుంటలలోనే మరొక నెలరోజులలో పుష్కరముల పేరిట కోట్ల మంది ప్రజలు వచ్చి బురద స్నానములు ఆచరించవలసి ఉండునా' అని మనసు దురపిల్లినది. 

అంతలోనే నా పక్కనుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ.. 'పట్టిసీమలో నీళ్లొదిలాడంట బాబాయ్‌... చంద్రబాబు నీళ్లు తెచ్చేస్తాళ్లే' అనుకొనుట వినిపించినది. ఆహా చంద్రబాబు నాయుడు కార్యకుశలత మరియు నీటి తేత (తెచ్చుటకు నామవాచక రూపము తేత అగును... తీయుటకు నామవాచకము తీత అయినట్లు) సమర్థతల గురించి జనమునకు ఎంతటి విశ్వాసము ఉన్నదో కదా అని మనసు ఆనందడోలికలలో ఊగులాడినది. మొత్తానికి క్రిష్ణానదికి పుష్కరములు వచ్చుచున్నప్పుడు.. క్రిష్ణ పుణ్య స్నానములకు తరలివచ్చు ప్రజానీకమునకు కనీసం గోదావరి నీటిలోనైనా మునుగు భాగ్యమును కల్పించుట చంద్రబాబు ఘనతయే అని అవశ్యముగా చెప్పవలెను. 

ఇక దుర్గమ్మ చెంతకు వత్తుము. దుర్గమ్మ దర్శనము పూర్తగు సమయానికి నాకు కళ్లమ్మట నీళ్లు ధార కట్టినవి. అమ్మవారి దర్శన భాగ్యము ప్రాప్తించుట చేత నాలో అసంకల్పింతముగా జనించిన ఆనందభాష్పములేమో అని భ్రమించి ఆ నీటిని చూపుడువేలితో అందుకుని నాలుకపై ఉంచి రుచిచూచితిని! అవి ఆనందబాష్పములు కావు.. దుఃఖబాష్పములే అని ధృవీకరణ అయినది. ఎందుకనగా.. ఇవి ఉప్పగా ఉన్నవి. ఆనందబాష్పములు తీయగా ఉండునని నా మెదడులోని జ్ఞానకోశములో ఉన్నది. ఇంతకూ దుఃఖము ఎందుకు కలిగినట్లు? 

అవును- బోధపడినది. దుర్గమ్మ ఆలయ ప్రాంగణములో ఎచ్చటా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపించుట లేదు. అంతా అవినీతి మరియు వ్యాపారపోకడల పంకిలములో అనగా బురదలో అమ్మవారు కూర్చుండిఉన్నట్లుగా ఉన్నది. నా ఒక్కడికే కాదు కాబోలు... మన రెండు తెలుగు రాష్ట్రములకు మొదటి పౌరుడు అయిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భక్తశిరోమణి, ఆలయయాత్రా ధురీణ నరసింహన్‌ కు కూడా అలాగే అనిపించినది మరి! అందుకే కాబోలు... దుర్గమ్మ ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం కూసింత పెంచమని ఆయన అధికారులను బతిమాలడము జరిగినట్లుగా దినపత్రికలలో చదివితిని. 

ఇక ఇవాళ డైరీ రాయుటకు స్ఫూర్తినిచ్చిన అసలు విషయములోని వత్తుము. సీఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలు మరియు మంత్రుల విషయములో ప్రధానోపాధ్యాయుల వారి పాత్ర పోషించుచుండునని, చేత బెత్తము పట్టినట్టుగా వారిని అదిలించునని అందరూ అనుచూ ఉందురు. కానీ నాకుమాత్రము.. ఆయన జేమ్స్‌బాండ్‌ 007 మాదిరిగా డికెష్టీ మాదిరిగా పనిచేయుచున్నారని బహు నమ్మకము కలిగినది. రాష్ట్రములోని ఎమ్మెల్యేల అందరి పనితీరు గురించి ఆయన చాలా విపులముగా సర్వే చేయించినారనే సంగతి తెలిసి నేను ఈ అభిప్రాయమునకు వచ్చితిని. 

ఎందుకనగా.. హెడ్మాస్టరు అయినచో పిల్లల ప్రోగ్రెస్‌ రిపోర్టు తయారు అయినప్పుడు.. వాటిని వారికి ఇచ్చును. వారి తల్లిదండ్రులతో సంతకము చేయించుకు రమ్మని పంపును. కానీ డికెష్టీ అయినచో వారి గురించి తెలుసుకున్న వివరాలను వారికి తెలియజెప్పరు. రహస్యముగా ఉంచెదరు. ఈ నిర్వచనముల ప్రకారము చూసిన యెడల.. ఎమ్మెల్యేల మీద సర్వే చేయించిన పిమ్మట ఆ వివరములను ప్రకటించకుండా... రహస్యముగా ఉంచు చంద్రబాబు డికెష్టీ కాక మరేమియగును. ఇందులో మరొక మర్మము కూడా దాగియున్నదని నా బుర్రలోని జ్ఞానము ఎందుకో పదేపదే ఘోషించుచున్నది. ఇలా 'ఎమ్మెల్యేలపై సర్వే చేయించితిని' అంటూ వివరములను రహస్యముగా ఆయన చెంత ఉంచుకొనుట వల్ల.. వారిని విడివిడిగా పిలిపించి.. ఆ వివరములు చూపి బెదిరించుటకు ఆయనకు అవకాశము దక్కును. ఆహా... చంద్రబాబు బుర్రలో.. ఎన్నెన్ని విధములయిన జ్ఞానభాండాగారాములు ఉన్నవో కదా..! నేను కూడా అటువంటి వాటిని సంపాదించవలెను. 

సర్వేలు వంటివి చేయించినప్పుడు.. స్కూలు పిల్లల ప్రోగ్రెస్‌ రిపోర్టులను పేరంట్స్‌ కడకు పంపినట్లు, ఎమ్మెల్యేల గురించి వారికి ఓట్లు వేసిన జనమునకు వివరములు తెలిపినచో ఫలితముండును. తాము ఎన్నుకొనిన వారు ఎలా పనిచేసెనో, ఎన్నెన్ని మోసములు చేసెనో.. ఎమ్మెల్యేలను చేసిన తల్లితండ్రుల వంటి ప్రజలు తెలిసిన ప్రయోజనము ఉండును. ఈ విషయము చంద్రబాబు బుర్రలోని జ్ఞానములోకి ప్రవేశించులాగున.. బెజవాడ కనకదుర్గమ్మ కరుణించవలెనని ప్రార్థించుచుంటిని. 

- దారినపోయే దానయ్య 
ఆషాఢ శుక్ల చవితి, దుర్ముఖి అనగా 08 జులై 2016

Show comments