ఇన్నాళ్లూ వారి మీద ఎలాంటి నమ్మకంతో ఆయన తన పేషీలో కీలక అధికారులుగా నియమించుకున్నారో తెలియదు గానీ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారట. తాను ఎంతగా కష్టపడిపోతున్నప్పటికీ, తగిన విధంగా జనంలో గుర్తింపు రావడం లేదనే బాధ చంద్రబాబుకు పుష్కలంగా ఉంది.
ఇలాంటి సమయంలోనే చంద్రబాబు పేషీలోని అధికారులు కూడా ''జనం కొరకు బతుకుతున్న నాయకుడు''గా చంద్రబాబుకు గుర్తింపు రాకపోవడానికి కొంత కారణం అనే నిశ్చయానికి ఆయన వచ్చారు. సాంతం సీఎం పేషీని ప్రక్షాళనచేస్తే తప్ప ప్రజలకు అందుబాటులో ఉండే సీఎంగా పేరు రాదని అనుకున్నారట. దానికి తగినవిధంగా త్వరలోనే మార్పుచేర్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి పేషీలోని కొందరు కీలక అధికారుల మీద చాలా కాలంగా కొన్ని కంప్లయింట్లు ఉన్నాయి. సాధారణ జనానికి సీఎం ను దూరం చేయడం మాత్రమే కాదు కదా.. జనం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా సీఎంని అందుబాటులో ఉంచనివ్వని వైనం పలు సందర్భాల్లో చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. సీఎం పేషీలోని కొందరు కీలక అధికార్లపై ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రికి పలుమార్లు ఫిర్యాదు కూడా చేశారట. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అయితే పేషీలోని ఓ ఐఏస్ అధికారిని బహిరంగంగానే తీవ్రస్థాయిలో దుర్భాషలాడారుట.
సీఎంతో ప్రజాప్రతినిధులు కలవాలన్నా సరే.. అనుమతుల్ని నిర్దేశిస్తూ ఉండే సెక్రటరీ స్థాయికూడా లేని ఏపీ కేడర్‌కు చెందిన సదరు ఐఏఎస్ అధికారి రాయపాటి మార్కు దూషణలతో ఖంగు తిన్నాడుట. తెలుగు వాడే అయినప్పటికీ ప్రజాప్రతినిధులతో వ్యవహరించడంలో ఏమాత్రం హుందాగా ఉండని మరో ఐఏఎస్ మీద కూడా అందరూ గుర్రుగా ఉన్నారుట.
ఇలాంటి కంప్లయింట్ల నేపథ్యంలో చంద్రబాబునాయుడు తన సీఎంపేషీని సంస్కరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞుల్ని, తన ఇమేజి పెంచగలవారిని, ప్రజాప్రతినిధులందరితోనూ సత్సంబంధాలు కొనసాగించగల వారిని తెచ్చి పెట్టుకోవాలని అనుకుంటున్నారట. ముహూర్తం ఎప్పుడనేది ఇంకా తేలలేదు గానీ.. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌ల పేర్లను కూడా సీఎం పేషీకోసం ఇప్పటికే పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.