మంత్రుల లెగసీ : ఒక అల్లుడు నలుగురు కొడుకులు!

అనగనగా ఒక అడవి. విశాఖ పట్నం ప్రాంతంలో నర్సీపట్నం సమీపంలో అటు ఇటుగా కాస్త భారీగా ఉండే ఒకానొక పెద్ద అడవి అది. సదరు అడవిలో లాటెరైట్‌ అను ఖనిజం చాలా విచ్చలవిడిగా దొరుకుతుంది. చాలా విలువైనది కూడా. సహజంగానే దాన్ని కొల్లగొట్టి అమ్మేసుకుంటే కోట్లు గడించేయడం చిటికెలో పని! అలాంటప్పుడు అసలే అధికార మంత్రదండం చేతిలో ఉన్న వారికి ఇక తిరుగేముంటుంది. అందుకే, ఏపీ కేబినెట్‌లో తిరుగులేని వారిలో ఒకరు, చంద్రబాబును కూడా తన కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకునేలా చేయగల స్థాయి ఉన్న ఓ సీనియర్‌ మంత్రిగారి అల్లుడు ఈ అడవులను తవ్వి, లాటెరైట్‌ తీసేద్దామని డిసైడయ్యారు. 

అదే తడవుగా ఆయన ఇలాకాకు చెందిన మనుషుల పేరిట మైనింగ్‌ తవ్వకాలు ప్రారంభించేసుకున్నాడు. అంతే .. స్థానికంగా ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన ఓ ప్రముఖ నేత కుమారుడు రంగ ప్రవేశం చేశారు. మా నాన్న ఇక్కడ ఎమ్మెల్యే అయితే.. మా అనుమతి, మా వాటా ఏమీ లేకుండా ఇదేం వ్యాపారం.. తూచ్‌ అన్నారు. అల్లుడు గారికి కంగారు పుట్టింది. మామకు నివేదించుకున్నారు. 

మనం అడిగితే ఎవరు కాదంటార్లే అనే నమ్మకంతో సదరు మామగారు, సదరు లోకల్‌ మంత్రికి ఫోను చేసి మాట్లాడారు. 'మా బిజినెస్‌ను వదిలేయవచ్చు కదా' అంటే.. 'అదేదో పిల్లల వ్యవహారం వాళ్లు చూసుకుంటార్లే' అని సదరు లోకల్‌ మంత్రి గారు తిరస్కరించారు. మామ మంత్రిగారికి కళ్లు తిరిగాయి. 

ఇదేంట్రా బాబూ అనుకుంటున్న సమయంలో.. మరో మంత్రి వారసుడు రంగ ప్రవేశం చేశాడు. అతనేమో.. సీమ రాజకీయాలు తమ చుట్టూ తిరగాలని అనుకునే మహిళా మంత్రిగారి కుమారుడు. మాకు కమిషన్‌ లేకుండా అసలు ఏ వ్యాపారమైనా ఎలా జరుగుతుంది.. మాది మాకు ముట్టాల్సిందే అంటూ ఆయన వచ్చారు. లోకల్‌ మంత్రిగారి కొడుకుగారి తరఫున ఈయన గారు వకాల్తాపుచ్చుకున్నారు. ఇదంతా చూసి అల్లుడిగారికి కళ్లు తిరగడం దగ్గరినుంచి, కళ్లు చెమర్చడం వరకూ వచ్చింది. 

ఇంతలో 'ఇది అడవుల్లో తవ్వకాలు అంటున్నారు కదా.. మరి ఇదంతా మానాన్న ఏలుబడిలో ఉండవలసిన వ్యవహారం.. నా సంగతి ఏమిటి?' అంటూ మరో మంత్రిగారి కుమారుడు కూడా రంగ ప్రవేశం చేశారు. అల్లుడుగారికి సీన్‌ 70 ఎంఎంలోకి మారింది. 

వీరి వ్యవహారం ఇలా సాగుతోంటే.. 'లాటెరైట్‌ వ్యాపారంలో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని సత్యం బోధపడిన మరో మంత్రిగారి కుమారుడికి ఆశ పుట్టింది. నేను పెట్టుబడుల్లో డబ్బు పెడతాను. నాకూ కాస్త వాటా ఇవ్వండి అంటూ అమాయకంగా వచ్చి అడిగాడు. ఇంతకూ అతనేమో.. భాజపానుంచి వచ్చి చంద్రబాబు కోటరీలో ఉన్న మంత్రిగారి కుమారుడు. ఇదంతా చూసి అల్లుడుగారికి గుండె ఠారెత్తిపోయి ఉంటుంది. వీరిలో ఏ మంత్రిని పాపం.. మామగారు పలకరించబోయినా.. అదేదో పిల్లల వ్యవహారం పిల్లలు చూసుకుంటార్లే అంటున్నారట. 

ఆ రకంగా.. విశాఖ పట్నం అడవుల్లో ఉన్న సంపదను కొల్లగొట్టడానికి ఒక అల్లుడు- నలుగురు కొడుకులు ప్రస్తుతం కుస్తీలు పడుతున్నారని భోగట్టాగా తెలుస్తున్నది. 

Show comments