గెలిపించే నాయకుడు మోదీయే...!

ఒక్కసారి గతంలోకి వెళదాం. 2002లో గుజరాత్‌లో మత ఘర్షణలు జరిగినప్పుడు ఏపీ (ఉమ్మడి) ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. తీవ్ర విమర్శలు చేశారు. ఆయన్ని ఏపీలోకి అడుగు పెట్టనివ్వనని ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతానికి వద్దాం. అంటే 2017లోకి. అప్పుడు నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడే  తాజాగా 2019 ఎన్నికల్లో తాను ఏం చేయబోయేది తేల్చి చెప్పారు. ఏం చెప్పారు? 'నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతాం' అని ఢిల్లీలో ప్రకటించారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? అప్పట్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పి బలమైన నాయకుడిగా, వ్యూహకర్తగా పేరు పొందిన చంద్రబాబు ఇప్పుడు మోదీని బలమైన నాయకుడిగా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో శాశ్వతంగా బలవంతులు, బలహీనులు ఉండరని అర్థమవుతోంది. గత సాధారణ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ పనిచేసింది.  ఆయన ఇచ్చినన్ని సీట్లు తీసుకుంది.

కాని మూడేళ్లలోనే పరిస్థితి మారిపోయింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని 'దేశంలో కెల్లా సీనియర్‌ నాయకుడిని నేనే' అని చెప్పుకుంటున్న చంద్రబాబు అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో...బాబుకు నాయకుడు మోదీయేనన్న మాట. మోదీ పరపతి, పలుకుబడి పెరిగాయి. బలమైన నాయకుడిగా ఎదిగారు. బీజేపీలో ఆయన మాట వేదవాక్కుగా, శిలాశాసనంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో బీజేపీ చంద్రబాబును గట్టిగా డిమాండ్‌ చేసి కావల్సిన సీట్లు రాబట్టుకుంటుందేమో...! ఇంతకుమించి సీట్లు ఇవ్వనని చంద్రబాబు అనలేని పరిస్థితి ఏర్పడవచ్చు. తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేయబోమని అక్కడి బీజేపీ నాయకులు తేల్చిపారేశారు. ఇక ఆంధ్రా బీజేపీలో చంద్రబాబు అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయి. వ్యతిరేక వర్గం తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకుంటోంది. బీజేపీకి, మోదీకి దేశంలో ప్రజాదరణ పెరిగిన నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనవసరమని వ్యతిరేకవర్గం అభిప్రాయపడుతోంది.

దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజాదరణ పెరిగిన మాట నిజమే అయినా ఆంధ్రాలో టీడీపీ మద్దతు లేకుండా బీజేపీకి సీట్లు రావడం కష్టమని చంద్రబాబు అనుకూల వర్గం అభిప్రాయపడుతోంది. టీడీపీ-బీజేపీ బంధం నిలవకపోవచ్చని మొన్నటివరకు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించకముందు కొన్ని సందర్భాల్లో బీజేపీ, టీడీపీ నాయకులు మాటల తూటాలు విసురుకున్నారు. బహిరంగంగంగా విమర్శలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తేనే మంచిదని రెండు పార్టీల నాయకులూ అన్నారు. బీజేపీతో బంధం తెంచుకోవడానికి వెనకాడమని ఒకసారి బాబు తీవ్రంగా హెచ్చరించారు కూడా. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్రానికి పలుమార్లు వచ్చి సభలు పెట్టి కేంద్రం చేసిన సాయాన్ని ఏకరువు పెట్టారు. ఒంటరిగా పోటీ చేసేలా పార్టీని బలోపేతం చేయాలని నాయకులను ఆదేశించారు. 

బాబు వ్యతిరేకవర్గం నాయకులు కేంద్రం చేసిన సాయానికి లెక్కలు చెప్పాలని,  ఆ పని చేశాకే తదుపరి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో బీజేపీకి అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ  నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు పార్టీలూ పైకి మిత్రులుగా ఉన్నా విభేదాలు, మనస్పర్థలు చాలా ఉన్నాయి. అవింకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. మోదీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పడం ద్వారా సానుకూల సంకేతాలు పంపారు. అంతకుమంచి బాబుకు గత్యంతరం లేనట్లుగా కనబడుతోంది. వాస్తవానికి కేంద్రం ఏపీకి ఆశించిన రీతిలో సాయం చేయలేదు. ఇంకా కొన్ని విషయాల్లో నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా లేరు.

Show comments