పక్కా...లాక్‌ కర్‌దీజీయే...!

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంలో పాల్గొనే పార్టిసిపెంట్స్‌ ప్రశ్నకు జవాబు సరిగ్గా చెప్పగలమనే కాన్ఫిడెన్స్‌ వచ్చినప్పుడు 'పక్కా...లాక్‌కర్‌దీజీయే' అంటూ నమ్మకంగా చెబుతుంటారు. 'కౌన్‌ బనేగా ఏపీ సీఎం' అనే ఆటలో  పాల్గొంటున్న  వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు కూడా 'పక్కా...లాక్‌కర్‌దీజీయే' అని జనాలకు తెలుగులో  ఇప్పటినుంచే చెబుతున్నారు. పక్కాగా జరిగేదేమిటి? వచ్చే ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధిస్తుందని, తానే సీఎం అవుతానని జగన్‌ చెబుతున్నారన్నమాట. గత రెండేళ్లుగా ఇదే మాట చెబుతున్న ఈయన తాజాగా మరోసారి గట్టిగా నొక్కి వక్కాణించారు. తన తండ్రి వైఎస్సార్‌ పథకాలను వివరిస్తూ ఆయన బాటలోనే నడుస్తున్న తాను పార్టీ ప్లీనరీలో నవరత్నాలవంటి వాగ్దానాలు ప్రకటించానన్నారు. మళ్లీ ప్రజల్లో నమ్మకం కలిగేలా 'రాజన్న పాలన' రాబోతోందన్నారు. రాజన్న పాలన కోసం ప్రతి ఇంట్లోనూ ఎదురుచూస్తున్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గానికి, తన సన్మార్గానికి పోరాటం జరుగుతుందన్నారు. జగన్‌ వ్యతిరేకులకు డోసు (జగన్‌ మాటలు) ఎక్కువైనట్లుగా అనిపించవచ్చు. ఇది అహంకారంగా కనిపించవచ్చు. గొప్పలు చెబుతున్న ఫీలింగ్‌ కలగొచ్చు. కాని చంద్రబాబు చేస్తోంది ఇదే పని కాబట్టి జగన్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు.

మొన్నీమధ్య బీజేపీ జాతీయ నాయకుడు రామ్‌మాధవ్‌ మాట్లాడుతూ 'రాజకీయాలు ఛారిటీ (సేవ) కోసం కాదు. అధికారం సంపాదించడం కోసం' అనే విలువైన మాట చెప్పారు. దాని ప్రకారం చూస్తే వైకాపా అధికారంలోకి వస్తుందని, తాను సీఎం అవుతానని జగన్‌ ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు. రాజకీయాల్లో ఉంటూ అధికారకాంక్ష లేదని చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుంది. శాశ్వతంగా టీడీపీయే అధికారంలో ఉండాలని చంద్రబాబు చెబితే చప్పట్లు కొట్టి గంతులేసే 'పచ్చ' తమ్ముళ్లు వైకాపా అధికారంలోకి వస్తుందని చెబితేచాలు చిందులేస్తుంటారు. అదేదో మహాపాపమైనట్లు కిందామీదా పడిపోతుంటారు. ఓ సందర్భంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్‌కు భవిష్యత్తు ఉందని అన్నారు. ఆయన నోటి నుంచి ఈ మాట రావడం ఆశ్చర్యమే కదా....! సాధారణంగా పిల్లలు సరిగా చదువుకోకుండా దారి తప్పినప్పడు పెద్దవారు 'బుద్ధిగా ఉండు. భవిష్యత్తు పాడుచేసుకోకు' అని మందలిస్తారు. అదే తీరులో తనకంటే వయసులో, రాజకీయాల్లో ఎంతో చిన్నవాడైన జగన్‌ను చంద్రబాబు మందలించారు.

వీరిద్దరూ బద్ధ శత్రువులు కాబట్టి 'జగన్‌ నీకు భవిష్యత్తు ఉంది' అని చంద్రబాబు అనడం ఆసక్తికరంగా ఉంది. అసెంబ్లీలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మామూలే కదా. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ''నువ్వు వితండవాదివనే అపవాదు ఉంది. ఎవరు చెప్పినా వినవు. మంచి నాయకుడిగా ఎదగాలంటే అవన్నీ వదిలేయ్‌. నువ్వు ఇంకా యంగ్‌స్టర్‌వి. వితండవాదంతో రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోకు''...అని హితవు చెప్పారు. సో... జగన్‌ని ఒక నాయకుడిగా చంద్రబాబు అంగీకరించారు. సాధారణ అర్థంలో రాజకీయ భవిష్యత్తు అంటే జగన్‌ ముఖ్యమంత్రి కావడం. కాని చంద్రబాబు అర్థం అది అయ్యుండదు. ఒక రాజకీయ నాయకుడిగా కొనసాగుతాడనే అర్థంలోనే మాట్లాడి ఉండొచ్చు. ఇలాంటి వితండవాదన ప్రవర్తనతో ముఖ్యమంత్రి కాలేవు అని బాబు పరోక్షంగా చెప్పారన్నమాట.  ముఖ్యమంత్రి కావాలనే కోరిక జగన్‌ తండ్రి వైఎస్సార్‌కు బాగా ఉండేది.

అలా ఉండటం సహజం. తప్పు కాదు. సీఎం పీఠం ఎక్కడం కోసం ఆయన సుదీర్ఘ కాలం వేచి ఉన్నారు తప్ప అదే పనిగా 'నేను సీఎంనవుతా' అని ప్రచారం చేసుకోలేదు. తనను సీఎం కానివ్వకుండా పార్టీలోని ప్రత్యర్థులు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా అన్నింటినీ అధిగమించి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కాని జగన్‌ వైఖరి ఇందుకు విరుద్ధంగా ఉందని చాలామంది చెబుతుంటారు.  విపక్ష నాయకుడిగా ప్రభుత్వంపై పోరాడటం కంటే ధ్యాసంతా ముఖ్యమంత్రి ఎలా కావాలన్న దానిపైనే పెడుతున్నట్లుగా ఉందంటారు. తండ్రి చనిపోగానే ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. కాని అధిష్టానం ఆశీస్సులు లభించలేదు. ఆ తరువాతి కథ అందరికీ తెలిసిందే.  'కాబోయే ముఖ్యమంత్రిని నేనే', 'వచ్చేది వైసీపీ ప్రభుత్వమే'...అని చాలాసార్లు చెప్పారు.  గతంలో ఓసారి '2017లో ముఖ్యమంత్రినవుతా' అని ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు చేయడం మంచిది కాదని, దీనివల్ల ఇమేజ్‌ దెబ్బతినే ప్రమాదముందని వైకాపా నాయకులే అభిప్రాయపడ్డారు. ప్లీనరీలో 'అన్న వస్తున్నాడని అందరికీ చెప్పండి' అని అనడమూ విమర్శలకు దారితీసింది.

Show comments