ధోనీకి ప్రతిష్టాత్మకం.. న్యూజిలాండ్ కు చెలగాటం!

విశాఖ వన్డేకు రంగం సిద్ధం అయ్యింది.. అసలు ఈ సీరిస్ ఫలితం తేలడానికి ఇంత సమయం పడుతుందని ఎవ్వరూ అనుకోలేదు! టెస్టు సీరిస్ ఫలితాన్ని గమనించాకా.. ఇండియన్ పిచ్ లపై కివీల ఆటతీరును గమనించాకా.. తొలి వన్డే ఫలితం వచ్చిన అనంతరం.. భారత మాజీలు కూడా కివీస్ పై ధ్వజమెత్తారు! మరీ ఇంత చెత్తగా ఆడుతుంటే.. చూడటానికి కూడా ఆసక్తి పోతోందని విరుచుకుపడ్డారు.

గెలవాలనే కసి కివీలకు ఏమాత్రం లేదని భారత మాజీలు అభిప్రాయపడ్డారు. వన్ సైడెడ్ ఫలితాలు వస్తుండే సరికి అలాంటి అభిప్రాయాలు వినిపించాయి. అయితే.. రెండో వన్డే నుంచి కథ మారింది. ఆ మ్యాచ్ తో కివీలు ఇండియాను నేలకు దించారు. వన్ సైడెడ్ గానే అయిపోతుందని అనుకున్న సీరిస్ అక్కడ నుంచి ఆసక్తికరంగా మారింది.

ఇక మూడో వన్డేలో టీమిండియా తిరిగి జూలు విధిల్చింది. కొహ్లీ,  ధోనీలురెచ్చిపోవడంతో సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మళ్లీ టీమిండియా లేచింది అనుకుంటే.. నాలుగో వన్డేతో కథ మళ్లీ మొదటకు వచ్చింది. అంత భారీ లక్ష్యం కాకపోయినా.. సొంత గడ్డ మీద 260 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చేతులు ఎత్తేసింది టీమిండియా. సీరిస్ ను కివీలు 2-2 తో సమానం చేశారు!

మరి ఇప్పుడు కీలకమైన.. నిర్ణయాత్మకమైన ఐదో వన్డే, ఆఖరి వన్డే జరగబోతోంది. విశాఖ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీమిండియాకు ప్రత్యేకించి కెప్టెన్ ధోనీకి ప్రతిష్టాత్మకం. అదెందుకో వేరే చెప్పనక్కర్లేదు. టెస్టు సీరిస్ లో టీమిండియా కొహ్లీ కెప్టెన్సీలో కివీలను చిత్తు చేసింది 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. మరి ఇప్పుడు కనీసం వన్డే సీరిస్ ను ఇండియా 3-2తో అయినా గెలిస్తే ఫర్వాలేదు!

లేకపోతే.. ధోనీపై ఒత్తిడి పెరుగుతుంది. కొహ్లీ సారధ్యంలో టీమిండియా చేతిలో చిత్తు అయిన కివీస్ ధోనీ సారధ్యంలోని జట్టును ఓడించి సీరిస్ తీసుకుపోతే అది ఈ కెప్టెన్ కు అవమానమే అవుతుంది. 

ఇక కివీస్ కు ఈ మ్యాచ్ చెలగాటం! ఓడితే పోయేదేమీ లేదు. గెలిస్తే మాత్రం.. వన్డే సీరిస్ గెలిచిన ఆనందం దక్కుతుంది. టెస్టు సీరిస్ లో వైట్ వాష్ అయినా.. టీమిండియాను దాని స్వదేశంలో ఓడించి వన్డే సీరిస్ ను గెలుచుకుపోయిన ఘనత సొంతం అవుతుంది!

Show comments