ప్రకాష్‌రాజ్‌ వ్యవసాయం

సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌కి సామాజిక బాధ్యత ఎక్కువే. ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం, పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడం.. ఇలా, 'నటుడ్నే కాదు.. అంతకు మించి..' అంటుంటాడాయన. ప్రకాష్‌రాజ్‌కి ఓ ఫామ్‌ హౌస్‌ వుంది. సువిశాలమైన ఫామ్‌ హౌస్‌ వుందక్కడ. 50కి పైగా పశువుల నుంచి పాడి సంపదను సృష్టిస్తున్నాడట ప్రకాష్‌రాజ్‌. ఆ పశువుల నుంచి వచ్చే వ్యర్ధాలనే, సహజసిద్ధమైన ఎరువులుగా వాడి, అక్కడి ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం కూడా చేస్తుంటాడట. 

సినిమాల్లో క్షణం తీరిక లేకుండా వుండే ప్రకాష్‌రాజ్‌, వ్యవసాయం చేయడమేంటి.? ఆయనకి అంత తీరిక వుందా.? అనడక్కండి. ఆలోచన వుంటే, పట్టుదల వుంటే చెయ్యొచ్చు. క్షణం తీరిక దొరికినా, దాన్ని వ్యవసాయం కోసం వినియోగించొచ్చుగాక. అన్నట్టు, టాలీవుడ్‌ హీరో పవన్‌కళ్యాణ్‌ కూడా వ్యవసాయం చేస్తాడు. ఆయనకీ ఓ ఫామ్‌ హౌస్‌ వుంది. అక్కడా ఆయన పశువుల పెంపకం చేపడ్తున్నారు. 

ఇక, ప్రకాష్‌రాజ్‌ ఏదో సరదాగా వ్యవసాయం చేయడంలేదట. రైతుగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడట. ఇది కొంచెం డిఫరెంట్‌గా వుంది కదూ.! దటీజ్‌ ప్రకాష్‌రాజ్‌. ఏమో, నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్‌, వ్యవసాయంలో 'కిక్‌'ని వెతుక్కుంటున్న దరిమిలా, రైతుగానూ ముందు ముందు తాను కోరుకున్న గుర్తింపును అందుకుంటాడేమో వేచి చూడాల్సిందే. 

Show comments